Facebook Twitter
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 3


“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 3

సూరన్న జరీ కండువా తీసుకుని, వక్షస్థలం కప్పుకోబోయాడు. రెండు పెద్ద పెద్ద చిరుగులు.. అప్పుడు దర్శనమిచ్చాయి, తమ స్థితిగతులను సూచిస్తూ. విద్యాభ్యాసం.. వివాహం, వీటి ధ్యాసలో పడి పట్టించుకొనే సమయం లేక.. ఏదీ గమనించలేదు. గట్టిగా నిట్టూర్పు విడిచాడు.
   ఇంక విచారించి ఏం లాభం.. ఏదో చెయ్యవలసిందే కానీ!
   మూడు తరాల ముందటి మహరాజు మెచ్చి ఇచ్చిన మణులు మడి మాన్యాలు మాయమై పోయాయి..
   మడి కట్టుకుని కూర్చుంటే మనుగడ సాగేదెలా? ముందుకు సాగి మేధకి పదును పెట్టాలి మరి.
   తనకి తనే ధైర్యం చెప్పుకుని, కష్టపడి కండువా చిరుగులు కనిపించకుండా సర్ది, వీధి వాకిలి తీశాడు.
   ఇద్దరు భటులు..
   సూరన్న రాక చూసి, శిరస్త్రాణాలు తీసి ప్రక్కనున్నఅరుగు మీదనుంచి నమస్కరించారు.
   "స్వామీ! అద్దంకినాయంకరానికి చెందిన పంటవంశపు రెడ్డి ప్రభువులు తమకు వర్తమానం అంపారు. మీ సమాధానం విని తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు." నడుముకి కట్టిన సంచీ తీసి, అందు భద్రపరచిన లేఖని ఇచ్చాడు ముందుకు వచ్చిన ఒక సైనికుడు.
   లేఖ అందుకుని, భృకుటి ముడిచి చదవసాగాడు సూరన్న.
   "ఎవరదీ.. ఏ పని మీద వచ్చారూ?" ఎరపోతసూరి నెమ్మదిగా వచ్చి స్థంబానికి ఆనుకుని నిలిచి ఆడిగాడు.
   "అద్దంకి నుండి వర్తమానం తండ్రీ! రెడ్డి ప్రభువులు నన్ను గుడ్లూరులోని నీలకంఠేశ్వరాలయం చూసుకుంటూ, అక్కడ పాఠశాలని ప్రారంభించమని అడుగుతున్నారు. అచ్చటి ప్రధాన అర్చకునికి వారసులు లేరట. ఆయన నా పేరు సూచించి మరణించారట. మా గురువుగారు, ఆయన మంచి స్నేహితులు. ఏం చేద్దామంటారు?"
   "ఆ నీలకంఠుడే పిలుస్తుంటే కాదనడానికి మన మెవరం.. సరైన సమయంలో నేనున్నానని చూపించాడు. పరమేశ్వరుని ఆజ్ఞ.. పైగా రెడ్డి ప్రభువులు సాహిత్యాభిలాషులనీ, సామాన్యులని కూడా అక్షరాసక్తులని చెయ్యాలని కంకణం కట్టుకున్నారనీ విన్నాను. మనం ఆలోచించవలసిన పనే లేదు."

   వాకిట మేనాలు సిద్ధంగా ఉన్నాయి.
   పేరమ్మ ఇల్లంతా తిరుగుతూ, ద్వారాలు, గవాక్షాలూ, గోడలూ.. అన్నీ తడుముతూ విచారంగా పెరటి తోటలోని వృక్షాలనీ, పక్షుల్నీ పేరు పేరునా పలుకరిస్తోంది. ఇరువది ఐదు వత్సరాలుగా ఆ ఇంటితో నున్న అనుబంధం..
   "అమ్మా! మమ్మల్ని చల్లగా కాపాడావు. ఇప్పటి వరకూ ఏనాడూ పస్తు పడుక్కునే స్థితి రాకుండా చూసుకున్నావు. నీకు దూరమవుతున్నా.. నిరంతరం నిన్ను స్మరిస్తూనే ఉంటా తల్లీ.. కరుణ చూపు.." తను నిత్యం పూజించే తులసి కోట దగ్గర నిలిచి కన్నులు మూసుకుంది.
   ఎరపోతసూరి తనకి అత్యంత ప్రియమైన మామిడి చెట్టును వదిలి రాలేకపోతున్నాడు. తనకి మూడు సంవత్సరాల వయసప్పుడు.. తాతగారు భీమన మంత్రి రాజుగారి తోటనుండి తెచ్చిన చిన్న మొక్కని పాతారు. చిన్ని చిన్ని చేతులతో దానికి గొప్పులు తవ్వి, నీళ్లు పోసి, తనతో ఆ చెట్టు కూడా పెరుగుతూ ఉంటే.. చిగురాకులు వేసినప్పుడల్లా తామందరూ ఎగిరి గంతులేస్తూ.. ఎన్నెన్ని జ్ఞాపకాలు?
   ఆ తరువాత అది మహా వృక్షమైనప్పుడు, ఎన్నో శుభ కార్యాలు జరిగాయి ఆ చెట్టు నీడన. ఆ ఇంటి ఆడపడుచులు ఉయ్యాలలు ఊగుతూ పాడిన పాటలు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
   ప్రతీ పండుగకీ మామిడి తోరణాలు, వేసంగుల్లో ఊరగాయలు.. మామిడికాయ పప్పుతో వరి అన్నం, పురిషిడు నెయ్యి వేసుకుని తింటే.. ఆ రుచి ఏ పంచ భక్ష్య పరమాన్నాలకి సాటి?
   "ఈ వేప చూశారా.. కొమ్మలు ఊగించి మనకి పూస్నానం చేస్తోంది.." గద్గద కంఠస్వరంతో పేరమ్మ అడుగుతుంటే నోట మాట రాక తలూపారు ఎరపోతసూరి.
   "అమ్మా! మనం ఇంక సాగాలి.. సంధ్యా సమయానికి రెండు యోజనములు పైగా వెళ్లాలి. అక్కడే మనకి రేయి గడపడానికి వసతి ఉంది. మీరు ఇచ్చోటు వదిలి రావడం కష్టమే.. కానీ మనకి సమయానికి మంచి అవకాశం కల్పించాడు ఆ పరమేశ్వరుడు. లేకున్న కొద్ది రోజులలో పస్తులు తప్పేవి కాదు కదా. మీరు పెద్దవారు.. అనుభవజ్ఞులు. మీకు చెప్పేటంతటి వాడిని కాను.." సూరన్న రెండు చేతులతో తల్లిదండ్రులిద్దరినీ తోడ్కొని వెళ్లి మేనా ఎక్కించాడు.
   తిరు చందనం నామం పెట్టుకొన్న ఎర్రపోతసూరి సాక్షాత్తూ విష్ణుని వలే ఉన్నాడు. ఇంక పేరమ్మ.. ఎర్రని పట్టు చీర కట్టి, అడ్డబాస మెరుస్తుండగా, నల్లపూసలు నిగనిగలాడుతూ పవిత్ర భావాన్ని కలిగిస్తుంటే లక్ష్మీదేవికి ప్రతి వలే ఉంది. నడవలేక నడవలేక నడిచి, మేనా ఎక్కారు ఇరువురూ.
   మెత్తని బూరుగు దూది పరుపులమర్చిన మేనా సౌకర్యంగా ఉంది.
   ముందు నున్న మేనాలో భార్యని ఎక్కించి.. తాను కొంత దూరం వెనుక నడుస్తానని చెప్పాడు సూరన్న. ఇంట నున్న సామాన్లు ఏవీ తీసుకొని రావద్దనీ, వీరికి సకల సౌకర్యాలూ కలుగ జేశామని చెప్పమన్నారని అన్నారు.. రాజుగారు పంపిన భటులు.
   అయినా.. ఇంటిలో సామాన్లు ఏమున్నాయని.. మట్టి కుండలు తప్ప.
   సామాన్లు ఒక్కొక్కటీ ఏనాడో తాకట్టుకి కట్టుగా వేంచేశాయి. సంభారాలా.. ఏ పూటకాపూటే..
   దారిలో మార్చుకొనుటకు మాత్రం తలకొక రెండు జతలు బట్టలు మూటలు కింద కట్టి, మేనాలో పెట్టుకున్నారు.
 
   "ఒక్కనిముషం.." ఎర్రపోతసూరి మేనా దిగి ఇంటిలోనికి వెళ్లాడు.
   సూరన్న అసహనంగా అటూ ఇటూ తచ్చాడుతున్నాడు. మనసులో కూడా పితృదేవుని చిన్న చూపు చూడని మనస్తత్వం.. జన్మతః వచ్చిన సంస్కారం.
   "చూశావా సూరీ. అనుకుంటూనే ఉన్నా.. నా పంచాయతనం మరచిపోతానని. ఆ విధంగానే.." భద్రంగా పట్టుబట్టలో చుట్టిన పంచాయతనాన్ని, పూజా గృహంలోనుంచి తీసుకొస్తూ అన్నాడు ఎర్రన్న, వణుకుతున్న కంఠంతో.
   తండ్రిని మేనా ఎక్కించి, తాను బోయీలతో నడుస్తానన్నాడు సూరన్న. వేరొకరు మోస్తుంటే తాను కూర్చొనడమా! శక్తి ఉంది కదా.. తన వంతుగా కొద్ది భారము తగ్గించిననూ నయమే కదా!
    మేనాలు తీసుకొని వెళ్లే బోయీలు కాక నలువురు భటులు.. ఒక అధికారి ఉన్నారు. త్రోవలో భోజన, విశ్రాంత్యాది కార్యక్రమాలకి కూడా అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు.
   రాజు గారు తలచుకుంటే దేనికి కొదవ..
   అచ్చట గుమికూడిన ఊరివారందరికీ కన్నీటితో వీడ్కోలు చెప్పారు నలువురూ.
   వేచి ఉన్న శ్రేష్ఠి గారికి ఇంటి తాళం అప్పజెప్పి, తాము ఋణపడిన వారి పట్టిక ఇచ్చారు సూరన్న, ఎర్రపోత సూరి.
   ఊరి పొలిమేర వరకూ వచ్చి సాగనంపారు కరాపర్తి గ్రామ వాస్తవ్యులు.. కన్నుల ప్రవహిస్తున్న నీరు ఆపుకునే ప్రయత్నం చెయ్యలేదు ఎవరూ. మూడు తరాల అనుబంధం.

   తమ శరీరాల్లో ఒక భాగాన్ని వదిలి వేస్తున్నట్లు అనిపించింది ఆ కుటుంబీకులకి.
   అందరికీ అన్నన్ని బోధలు చేశాడు కానీ సూరన్న కన్నులు చెమరుస్తూనే ఉన్నాయి. వెనుతిరిగి చూసుకుంటూ అడుగులు వేస్తున్నాడు. ప్రతీ చెట్టూ, ప్రతీ పుట్టా వీడ్కోలు చెప్తున్నట్లే ఉంది.
   అదిగో ఆ వేప చెట్ల మీదనే కదా మిత్రులతో కోతి కొమ్మచ్చి ఆడింది..
   ఈ రావి చెట్టుకిందనే మొదటి గురువు అక్షరాలు దిద్దించింది.
   అరే.. తాము ఈత కొట్టిన దిగుడుబావి. ఒక్క చుక్క నీరు లేదు. పిచ్చి మొక్కలు మొలిచి దీనంగా చూస్తోంది. అడుగు ముందుకు పడనని మొరాయిస్తోంది శరీరం.
   "అయ్యోరూ! మీరు మేనా ఎక్కండి. మాకంటే అలవాటే. పైగా మేం మజిలీ మజిలీకీ మారుతాం. మీకు ఎదర చేకొనే కార్యాలు చాలా ఉంటయ్యి." బోయీల పెద్ద అనునయించగా సూరన్న భార్య కూర్చున్న మేనా ఎక్కాడు.
   భటులంతా అశ్వారూఢులై ముందు ఇరువురు, వెనుక మువ్వురు సాగుతున్నారు. సూరన్న ఎక్కగానే వేగం పెంచి పరుగందుకున్నారు బోయీలు. అప్పుడు.. అర్ధమయింది సూరన్నకి తను చేసిన తప్పు.. తన వలననే వేగం తగ్గింది అంత వరకూ.
   పోతమాంబ భర్త చెయ్యి పట్టుకుంది అనునయిస్తూ.. ధైర్యం చెప్తూ.
  "నిక్కము నిక్కము, నిక్కము..
   ప్రక్కా తోడూ, ఊరూ వాడా..
   ఎవరూ, ఏదీ నీ వెంట రాదు.
   మధ్య మజిలీలకి మేమున్నామన్నా
   చిట్ట చివరి మజిలీకి
   ఒంటరి పయనం తప్పదన్నా.
   ఒహోం.. ఒహోం హోం ఒహోం ఒహోం..
   నాలుగు రోజులున్నా
   నలుగురికీ మేలు చెయ్యాలన్నా
   పదుగురి మెప్పూ పొందాలన్నా
   పదికాలాలు నీ మంచే తలవాలన్నా.
   ఒహోం.. ఒహోం హోం ఒహోం ఒహోం.."
   బోయీలు పాటందుకున్నారు. తన చేత కాని పరిస్థితులలో వేదాంతం తప్పదు ఎవరికైనా.. సూరన్న విరక్తిగా నవ్వుకున్నాడు.

   మధ్యాహ్న కాలం వరకూ అవిశ్రాంతగా సాగి, అప్పుడు.. దట్టంగా చెట్లున్న చోట ఆగారు.
   బోయీలు మేనాలు ఆపి కిందికి దింపారు. మేనా దిగిన ఎర్రపోతన దంపతులు, సూరన్న, పొత్తమ్మ కాళ్లు చేతులు సాగదీసుకుని, చెట్ల చాటునకు వెళ్లి అవసరాలు తీర్చుకుని, నీడన చాపలు పరిచి విశ్రాంతిగా కూర్చున్నారు.
   అక్కడికి దగ్గరలోనే ఏరు ఉంది. చల్లని నీటితో ముఖము కడుగుకొనగానే సుఖంగా అనిపించింది అందరికీ. మలయమారుతం సేద తీరుస్తోంది.
   రౌతులు, గుర్రాలను చెట్లకి కట్టేసి, మాలీషు చెయ్యసాగారు. అశ్వాలకి కడుపు నిండుగా తిండి పెడ్తే సరిపోదు. ఆప్యాయత కూడా కావాలి. గుగ్గిళ్లు పెడుతూ, వాటితో సంభాషణలు జరుపుతుంటే ఆశ్చర్యంగా చూసింది పొత్తమాంబ.
   "మానవులకంటే అభిమానం ఎక్కువ తురగాలకి. తమ యజమాని కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడవు. రౌతుకి దెబ్బ తగిలి పడిపోతే, క్షేమంగా ఇంటికి చేరుస్తాయి. అంతే ఆప్యాయతని ఆశిస్తాయి కూడా.. ఉదాసీనంగా ఉంటే కదలమంటూ మొరాయిస్తాయి" సూరన్న వివరించాడు.
   పెద్ద పెద్ద ఆకులు తీసుకుని, అందులో నాలుగు రకాల ఫలాలు పెట్టి ఎర్రపోతన్న, సూరన్నాదులకి అందించారు భటులు. వెదురు బూరాల్లో మంచి తీర్థం ఉండనే ఉంది.
   "స్వామీ! మీరు ఫలములు ఆరగించి కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటే మనం సంధ్యవేళకి ఒక పల్లె చేరుతాము. అచ్చట అర్ఘ్యపాద్యాది అనుష్ఠానం అయిన పిదప, మీకు బ్రాహ్మణ సత్రంలో భోజన వసతి చేయించాము."
   పేరమ్మ, తనూ కోడలూ నాలుగు రోజులుగా కూర్చుని చేసిన భక్ష్యాలు, అరిసెలు, వేయించిన అటుకులు, వేపుడు బియ్యం.. కొద్ది కొద్దిగా అందరికీ పెట్టింది. చుట్టు ప్రక్కల ఉన్న ఆడవాళ్ళు కూడా వచ్చి సహాయం చేశారు..
పిండి దంచడంలో, జల్లెడ పట్టడంలో.. అరిసెలు వత్తడంలో.
   అత్తా, కోడలు వాటన్నింటినీ ప్రత్యేకంగా బాదం ఆకుల్లో, అరటి ఆకుల్లో భద్రంగా చుట్టి.. పరిశుభ్రమైన వస్త్రాలతో మూటలు కట్టారు. అవి వారి వెంటే ఉంటాయి.
   "అమ్మగారూ! ఈ ఫలారాలు ఇకనుంచీ మాకు పెట్టద్దమ్మా! మేం తెచ్చుకున్నవే ఉన్నాయి. అవి మీరు తినరు కదా.. రెండువారాలు పడుతుంది మనం మన ఊరు చేరే సరికి. అప్పటి వరకూ జాగరూకతతో వాడుకోవాలి కదా!" అధికారి, నరసింహ సేనాని అన్నాడు.
   పేరమ్మ ప్రసన్నంగా చూసింది.
   "ఈ పూటకి తినండి బాబూ.. కష్టపడుతున్నారు."
   "మాకు ఈ పయనం నల్లేరు మీది నడకేనమ్మా! గంగా తీరం వరకూ తెలియని త్రోవల వెంట వెళ్లిన వాళ్లం. దారి వెంట పురుగు, పుట్ర.. దొంగలు, క్రూర జంతువులు.. ఒకటేమిటి.. ఎన్నో అడ్డంకులు. అన్నింటినీ అధిగమించి సాగవలసిందే." నరసింహుడు వినమ్రంగా అన్నాడు.
   పోతమ్మ మాత్రం కొంగు భుజాల చుట్టూ కప్పుకుని, తల దించుకుని వినయంగా కూర్చునుండిపోయింది. మామగారు, భర్త ఎదురుగా ఉండగా ఏ విధంగా భక్షించాలి.. సంప్రదాయం కాదు కదా!
   "అమ్మా! ఈ కానలో కోనలో.. ఏ సంకోచం వలదు. మేం నీ తల్లిదండ్రులం. తీసుకో తల్లీ.." ఎరపోతన్న అభిమానంగా చూస్తూ అన్నాడు.
   ఆప్యాయతకీ, ప్రేమాభిమానాలకీ ప్రతీకలైనట్లున్న ఆకుటుంబాన్ని ముచ్చటగా చూశారు అచ్చటనున్న బోయీలు, భటులూ.

   రెండురోజులు పయనం తరువాత కృష్ణా తీరం చేరారు.
   ఇంద్రకీలాద్రి పర్వతం..
   అర్జనుడు పరమేశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సాధించిన ప్రదేశం. విజయుని పేరుమీదుగా విజయవాడ అనే పేరును సార్ధకం చేసుకొన్న పట్టణం. అచ్చట ఒకరోజు విశ్రాంతి అనీ.. బోయీలు మారుతారనీ నరసింహుడు చెప్పాడు.
   శివభక్తుడైన సూరన్న సంతోషానికి అవధిలేదు.
   కృష్ణవేణీ నదిలో స్నానమాచరించి, ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటే కామితములన్నీ నెరవేరును కదా! మల్లికార్జునస్వామిని సేవిస్తే మరి ఎదురేముండదు కదా! ఎటువంటి అవకాశం దొరికింది.. అంతా ఆ ముక్కంటి దయ. తాము తీర్థ యాత్రలు చెయ్యడానికే ఈ విధంగా జరిగిందేమో!
   ప్రభువులు ఏర్పాటు చేసిన విడిది ఇల్లు ఒక బ్రాహ్మణ సత్రము. అచ్చట నియోగింపడిన బ్రాహ్మణుడు ఆదరంతో పలుకరించి వసతి చూపించాడు.
   ఒకప్పుడు ఆ ప్రదేశంలో రాక్షసుల బాధ అధికంగా ఉండేదట.. అప్పుడు ఇంద్రకీలుడనే ఋషి తపస్సు చేసి కనకదుర్గమ్మని మెప్పించి, తన శిరము మీద వసించి ప్రజలని రక్షించి కాపాడమని అడిగాడుట. అదే ఇంద్రకీలాద్రి పర్వతం అని ఒక పురాణ గాధ తెలుపుతుంది.
   భక్తుని కోరిక మన్నించి దుర్గమ్మతల్లి అక్కడ నివాసం ఏర్పరచుకుందని ప్రజల నమ్మకం.
   సూరన్న తెలతెల వారుతుండగా అందరినీ లేపేశాడు. కృష్ణానదిలో స్నానం, అమ్మవారి దర్శనం, మల్లికార్జున స్వామికి అభిషేకం.. పిదప పరిసరాలన్నింటిని పరికించి చూస్తూ, మనసారా ఆనందిస్తూ కొండ దిగుతున్నారు.
   ఎన్నెన్నో వృక్షాలు.. వాటినల్లుకుని రంగు రంగుల పువ్వులతో నిండిన 
తీవెలు  

ఓహ్.. ఏమి అందాలు
                            .
   మల్లెలు మొల్లలు మామిళ్లనల్లి హొయలుపోగా
   అల్లన మెల్లన వాయు వీచోపుల్ హాయి గొలుపగా
   ఘల్లు ఘల్లున పోతమాంబ అందెలు రంజిల్లుతూ మ్రోగగా
   మెల్లగ చనిరి మున్ముందుకు ఎర్రపోతసూరనాదులు.

(చిత్రాలు- కమలా పర్చా గారి సౌజన్యంతో)
.... మంథా భానుమతి