Facebook Twitter
నిన్ను మార్చేదాకా - చిమ్మపూడి శ్రీరామమూర్తి

నిన్ను మార్చేదాకా...........

 

చిమ్మపూడి శ్రీరామమూర్తి

 

kavithalu, ninnu marchedaaka, chimmapudi sriramamurthi

మోపెడు సహనాన్ని నా తల మీద ఎత్తి

మోజులు తీర్చుకునే పశువు నువ్వు.

ఇప్పుడు నేనో నెత్తురు చిరునామాను.

నా శవాన్ని నేను చూసుకునేదాకా

వదల్లేదు నువ్వు.

 

మూడు ముళ్ళ చితి మీద

అమ్మా-నాన్నా పడుకోబెట్టినప్పుడే అనుకున్నా-

కోరికలతో నువ్వు రెడీగా వుంటావని.

బుసకొట్టే కోరికల పాముల నన్ను చుట్టేస్తుంటే

నాలోని నన్ను చంపెసుకున్నా.

నా నిరీక్షణ కన్నీళ్ళ మీద కాగితప్పడవై

నన్ను వెక్కిరిస్తూనే వుంది.

 

ఈ కీర్తి కిరీటాలు, కలికితురాయిలు నాకెందుకు?

నువ్వే తీసుకుపో.

నలుడిలా, హరిశ్చంద్రుడిలా,ధర్మరాజులా

నువ్వూ ఓ మగాడివే!

నా ఊహల నుంచి జారిపోతున్న ఆశను

ఇంధనం చేసుకున్నావు.

 

రిజర్వేషన్లు, వాక్కులూ, బిల్లులూ, కోటాలు.....వట్టి ట్రాష్.

ఆపద్దర్మంగా నువ్వు జపించే మంత్రాలం.

ఇప్పుడు నాదారి నిండా ఉద్యమాన్ని పరుచుకున్నా

నేనిప్పుడు అక్షరాల వెలుగు నీళ్లతో

ముఖం కడుక్కున్నా, నిద్రపోను నిన్ను మార్చేదాకా....