Facebook Twitter
కల్లోలిత

కల్లోలిత

 

 

అదిగదిగో నిజంకాని కలలకే సిగ్గెక్కువ మరి
ఏమిటంత పిచ్చి ప్రేలాపన? కలలూ,నిజమున్నా?
కలలన్నీ ఊహలైతే ఆ ఊహంతా మరి నిజమే కదూ నీలవేణి

మంచుకొండల్లోంచి జారిపోతున్న నీటిబిందువులేమీ ఏడవటం లేదు
మళ్ళీ ఘనీభవించటం నేర్చుకున్నాయి కాబోలు!
మరి పాత వాసనేస్తున్న జ్ఞాపకాల డైరీల్లో ఎండిపోయిన నీటిచారలు మాత్రం ఇలా ఎడారులుగానే మిగిలిపోవాలనుకుంటున్నాయేమో..

ఒక్కో సిప్పుకి ఇంకిపోతున్న కాఫీకప్పుల్లో
ఆప్టిమిసాన్ని వెతుక్కుంటూ కాయితాల్లో కలల్ని ఒంపుకోవటానికి కవినేమీ కాదోయి..
తుజ్సే కైసే సమ్జాన్..ఇస్ దిల్ కే జజ్బాత్ !
చిమ్మ చీకట్లలోన నిశ్శబ్దానికి సైతం కనబడకుండా
ఎన్నెన్నో కావ్యాలు లిఖిస్తూనే ఉన్నాయి మనసు కళ్ళు

అదిసరే..దిగులు దండాలను తెంచివేసే తుఫానులనేమీ
ఇపుడిక కోరుకోను కానీ ప్యారా
నాక్కొద్దిగా నవ్వటం నేర్పవూ!
అచ్చూ నీలా..ఆ పువ్వులా
రాలిపోతానన్న సంగతే తెలియక ఇంకా విచ్చుకోవాలనుకుంటున్న ఆ పసిమెుగ్గలా!

- సరిత భూపతి