Facebook Twitter
మాటకచ్చేరి (కథానిక )

 

 

మాటకచ్చేరి (కథానిక )

 

 

     భీమశంకరానికి అసహనం పెరిగిపోతూంది.. ఇంట్లోంచీ బైటికీ, బైటినుంచీ ఇంట్లోకీ ఇప్పటికి ముప్ఫై నలభై సార్లకు పైగానే నడిచి వుంటాడు. షుగర్ కూడా ఉంది కదా తనకి....నీరసం వస్తూంది కూడా! తలచుకున్న కొద్దీ సాంబయ్యమీద కోపం కూడా వస్తూంది. ఇప్పటికే అరగంట లేటయింది. అసలింతకీ అవెన్యు  ఆఫీసర్ కు చెప్పాడా.. తాను ఆలస్యంగా  వచ్చేందుకెమైనా పర్మిషన్ తీసుకున్నాడా?  యెంతకీ రాడేమిటి?  అసలేమైఉంటుంది ఆ సాంబయ్యకు ? రోజూ యీ టైం కల్లా  వచ్చేసేవాడు.  యేదొ అక్కడే గోడదగ్గర పెట్టుకున్న దేవుని పటాలకు  కాలనీలో దొరికే పూలనే పెట్టి, అగరొత్తి వెలిగించి కాస్త రెండు నిమిషలు యేమి ప్రార్థన చేసుకుంటాడొ  లేదో  కాని, అదైనప్పటినుంచీ, ఇక మొదలు అతని ఆక్టివిటీ. ..కొంపదిసి యెవరితోనైనా గొడవ పెట్టుకుని మాటా మాటా అనుకుంటూ యెక్కడొ ఉన్నాడా? అతనలాంటివాడె మరి..ఇక్కడే చూస్తుంటాడుగా రోజూ! గేట్ దగ్గరికి యెవరైన వచ్చిన అలికిడైతే చాలు..యెక్కడున్నా అతని చూపునుంచీ తప్పించుకుని పోలేరెవరైనా! గట్టిగా అరుస్తూ, గేట్ దగ్గరే ఆపేస్తాడు. సవా లక్ష  ప్రశ్నలు  వెసి, ఆరా తీసి మరీ భయపెడతాడు. 

 

లోపలెవరైనా  పిలిపించే వుంటే వదులుతాడు. లెదంటే, అంతే, అక్కడినుంచే వాళ్ళు తిరుగుమొహం పట్టక తప్పదు. ఒక్కోసారి, యేమిటబ్బా  ఇంత హడావిడి చేస్తాడు అనిపించినా, అతని డ్యూటి మైండెడ్ నెస్ కి ముచ్చటేస్తుంది కూడా! ఒక్కొకప్పుడు మరీ ఓవరాక్షన్  అనిపిస్తుంది కూడా! అతగానికో  యునిఫారం, చేతిలో పోలీస్ లాఠీ లాంటి  ఆయుధమూ ఉన్నాయి  మరి..  ఆమాత్రం దర్పం ప్రదర్శించకపోతే యెలా  మరి? యేదో సెంట్రల్  గవర్న్ మెంట్ ఆఫీస్ లోనే సెక్యూరిటీ  గార్డ్  గా చేసి రెటైర్  అయిన తరువాత , ఇలా ప్రైవేట్  కంపెనీ ద్వరా వాచ్ మన్ గా వచ్చాడు. అ దర్పమూ అదీ  తగ్గలేదింతవరకూ!    యీరోజు ఇంతవరకూ రాలెదంటే  కారణమేమైఉంటుంది?  ఆరోగ్యం బాగా లేదోయేమిటో వున్నట్టుండి పాపం?  వూహూ..నిన్ననేగా రాత్రి  తొమ్మిది వరకూ వుండి గుడ్ నైట్  కూడా చెప్పి వెళ్ళాడు. యీ ఫది, పదకొండు గంటల్లో యేమవుతుంది?    ఆలోచించి  ఆలోచించి, భీమశంకరానికి  తలనొప్పి వచ్చినట్టనిపించింది. ఇంట్లోకెళ్ళి కూర్చున్నా, దృష్టంతా, గేట్ వైపే!


       ఇంతకూ యెవరీ సాంబయ్య, మన భీమశంకరానికీ  అతనికీ యేమిటీ అవినాభావ  సంబంధం అంటే..మన భీమశంకరం, ఆరునెలల  క్రితమే ఒకానొక  సెంట్రల్ గవర్న్మెంట్ అఫీస్ లో డిప్యూటి డైరెక్టర్   హోదాలో రెటైర్ అయ్యాడు.. భర్య, వున్న ఒక్కగానొక్క  కూతురు డెలివరీకోసం, అమెరికా  వెళ్ళింది. ఇద్దరూ వెళ్దామంటే,   'అబ్బెబ్బే, నాకు  పొద్దుపోదక్కడ, డెలివరీ తరువాత  మనుమణ్ణి చూసేందుకొస్తా'ననేశాడు. దీనికి కారణం లేకపోలేదు. అమ్మాయీ, అల్లుడూ ఉద్యోగాలకు వెళ్తే, ఇంట్లో, తామిద్దరూ హౌస్ అరెస్టే!   వీకెండ్స్ లో యెటైనా వెళ్ళి సరదాగా తిరిగి రావటం, అ తరువాత , మళ్ళి ఇంట్లోనె ఆ  టీ'. వీ చూస్తూ  కాలం గడపాలంతే! రెండు నెలలుండేసరికి, భీమశంకరానికి  చాలైంది. అందుకే  మొండికేశాడు రానని!   ఇటీవలే, ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో   సొంత ఇల్లూ తీసుకున్నారు. 

 

ఇరుగూ పొరుగూతో ఆట్టే పరిచయాలూ  లేవు.  ఆమాటకొస్తే ఆఫీసులోనూ భీమశంకరం అందరితోనూ గలగలా మాట్లాడే  రకం కాదు. తన పనేమిటో,  తానేమిటో ! ఠంచంగా టైం  కి ఆఫీస్  కు వెళ్ళటం పని చేసుకోవటం.  ఠంచన్ గా టైం చూసుకుని ఇంటికి వచ్చేయటం.  ఇంట్లో, భార్య  సరస్వతి, మొగుడు వింటున్నాడా లేదా అన్న పట్టింపులు లేకుండా, తన సంగతులన్నీ కీ  ఇచ్చినట్టు వినిపిస్తూనే  ఉంటుంది. ఆమె యేదో  డిగ్రిదాక చదువుకుంది కాబట్టి,  ఇంటికి కావలసిన  సరుకులూ అవీ ఆవిడే తెచ్చుకుంటూ వుంటుంది. వున్న ఒక్క కూతురూ, బీ టెక్  తరువాత  అమెరికా లో ఎమ్మెస్ చేస్తూనే,  చక్కటి సంబంధం రావటంతో   పెళ్ళీ కుదిరింది.  పెళ్ళవగానే  న్యూయార్క్ దగ్గరే వాళ్ళీద్దరూ  ఉద్యొగాలు  చేస్తూ ఉండటం..ఇలా..రోజులు ఆనందంగా   గడిచి పొతున్నాయి.     యే ఆఫీసబ్బా  భీమశంకరానిది   అన్న విచికిత్స ఇప్ప్పుడు  అవసరం లేదు కానీ,  ప్రస్తుతం, మన భీమశంకరం,  ఆలోచనలేమిటి?

    ముందేచెప్పినట్టు, భీమశంకరానికి ఆఫీస్ లోనూ, రిటైర్ ఐన అతని యోగ క్షేమాలు  ఫోన్ చేసి మరీ తెలుసుకునేంత  ఆత్మీయ సహోద్యోగులెవరూ లేరు.  ఇంట్లో కూడా,  తానొకడే కొడుకు.  వాళ్ళ తండ్రి గారి బాంక్ ఉద్యోగరీత్యా నార్త్ లోనే  యెక్కువగా పెరగటం వల్లా, బంధువులతోనూ యెక్కువ సంబంధాలు లేవు.  వున్నదంతా, సరస్వతి వైపు వాళ్ళే! అప్పుడప్పుడూ  వాళ్లు మాట్లాడుతున్నా, రోజంతా ఒంటరిగా  పొద్దు గడపటంలోని కష్టం ఇప్పుడు తెలిసొచ్చిందతనికి! సరస్వతి వస పిట్టలా వాగుతూ వుంటే,  ఆవిడ మాటల్ని వినీ విననట్టే  వుండే భీమశంకరానికి  భార్య లేని  లోటు భరించలేనంతగా  తెలిసింది. ఇక్కడ పగలూ, అక్కడ రాత్రీ!  యీ తేడాతో ఫోన్లో మాట్లాడటానికీ నిబంధనలే యీ పరిస్థితిలో సాంబయ్య  తగిలాడు భీమశంకరానికి ఆపద్బాంధవుడిలా!


          పెద్ద కుటుంబం సాంబయ్యది.  నలుగురు ఆడపిల్లలూ, ఇద్దరు కొడుకులూ! ముగ్గురు కూతుర్ల తరువాత ఒక కొడుకూ,  మళ్ళీ కూతురూ, ఆఖరున  కొసరుగా మరో కొడుకూ!  ముగ్గురాడపిలలకూ పెళ్ళిళ్ళు చేసేశాదు. ఒక కొడుకు ఉద్యోగంలో ఉన్నాడు. కూతురేదో మాల్ లొ పనిచేస్తూంది టెంత్ తరువాత..అఖరి కొడుకు  తొమ్మిదో క్లాస్.  సాంబయ్యకి ఇద్దరు అన్నలు. వాళ్ళు యితనికి తండ్రి  వైపునుంచీ వచ్చే ఆస్తిని రానీకుండా చేసేశారు, మోసంతో!  రెక్కల కష్టంతొనే బతకాలి..పిన్నమ్మ పిల్లలూ, వాళ్ళ  మనుమళ్ళూ, మనుమరాళ్ళూ, భార్య  పుట్టింటివాళ్ళూ, అమ్మ వైపునుంచీ మామయ్యా, వాళ్ళ పిల్లా  పీచూ..అ మధ్య యెవరికో బాగా  జబ్బు చెసి ఆసుపత్రిలో చేరిస్తే,  రక్తం కూడా ఇచ్చి వచ్చాడట డ్యూటీ కి! అన్నట్టు, వాళ్ళ అన్నలతో చెడినా, వాళ్ళ కొడుకుల  గురించీ, ఆస్ట్రేలియాలోనూ,  అమెరికాలోనూ  వాళ్ళ ఉద్యొగాలగురించీ బాగానే సమాచారం  రాబడుతుంటాడు యెవరి ద్వారానో!  అడపా దడపా  అతనికీ ఫోన్లు వస్తూనే  వుంటాయి మరి!


   ఇంతకీ సాంబయ్య కుటుంబ జీవితానికి సంబంధించిన ఇన్ని సంగతులు మన భీమశంకరానికెలా  తెలిశాయబ్బా? యేముందీ..సాంబయ్య గేట్ దగ్గర కూర్చుని ఘట్టిగా, సెల్ ఫోన్లో ఉదయం నుంచీ సాయంత్రం దాకా మాట్లాడుతూనే ఉంటాడు మరి!


      సాంబయ్యకు  యెప్పుడూ మాటలు కావాలి. సెల్ లో పలుకరించి మరీ బంధువులతో మాట్లాడుతుంటాడు. ఈ లెక్ఖన ఫోన్ కు నెలకు యెంతవుతుందో తెలీదు కానీ, భీమశంకరానికి మొదట్లో, ఇతని ధోరణి చాలా కోపం తెప్పించింది. భార్య అమెరికాకు వెళ్ళగానే, ఉదయం పేపర్ చూస్తుంటే మొదలయ్యేది  సాంబయ్య మాటకచ్చేరి. తమ ఇంటి ముందే  అతని సీట్. ఘట్టిగా, యెవరో యెదురుగా ఉన్నట్టే మాట్లాడుతుండేవాడు.   విసుక్కునేవాడు  భీమశంకరం. టిఫిన్  తింటూ, టీ వీ చూస్తూ, అతని మాటలు వినటం   విసుగై, కమ్యూనిటికి  ఫిర్యాదు కూడా చేశాడోసారి! తన  పేరు బయటికి రానీయకూడదన్నాడు. వాళ్ళూ అతన్ని అదిలించారు. కొన్నాళ్ళు వూరుకున్నాడు. మళ్ళీ మొదలు! వేరే సెక్యూరిటీ గార్డ్ కొసం ప్రయత్నించినా, యెవరూ దొరకలేదనేశారు. ఓవర్ గా మాట్లాట్టం తప్ప డ్యూటీలో యే లోపమూ వుండేది కాదు మరి!  యీ లోగా,  రాను రాను అలవాటైపోయింది  భీమశంకరానికి!  పైగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా  ఉండటం మొదలైంది.

 

యెంతైనా పొరుగింటి పుల్లగూర రుచేకదా! సరస్వతికూడా వూర్లో  లేదు!  సాంబయ్య సంగతులన్నీ తెలుస్తుంటే, తనకింతవరకూ తెలియని ప్రపంచం ముందు సాక్షాత్కరిస్తున్నట్టనిపించేది! సాంబయ్య తక్కువ వాడేంకాదు. మాటల్లొ, అప్పుడప్పుడూ జోకులూ,  లకార, మకారాలతో  కూడిన బూతులూ,  యెత్తిపొడవటాలూ,  యెగతాళి  మాటలూ, కోపమూ, ప్రేమా..ఇన్నీ ధ్వనించేవి. తమది  అసలే గేటెడ్ కమ్యూనిటీ. అందరూ ఉద్యొగస్తులే ఉన్నట్టున్నారు కూడా! భీమశంకరానిది కూడా కల్పించుకుని యెవరితోనూ మాట్లాడే  స్వభావం కాదుకాబట్టి, ఇంట్లో కూర్చుని వుండగానె చేతికి అందివచ్చే యీ పరోక్షానందం తెగ నచ్చేసిందతనికి!


మొత్తానికి, ఆ  రోజు,  భీమశంకరం తపస్సు ఫలించి, సాంబయ్య కాస్త ఆలస్యంగా డ్యూటీకి వచ్చి, అతన్ని ఫుల్లుగా యెంటర్టైన్ చేసెశాడు.


         చెప్పొద్దూ..సరస్వతి కూడా మాట్లాడ్డంలో నేర్పరే!  బంధువులందరితోనూ, చక్కగా మాట్లాడుతూ, వాళ్ళ పిల్లల విషయాలు తెలుసుకుంటుంది. పిల్లలతోనూ తనూ కలిసిపొయి మాట్లాడుతుంది. సినిమాలూ, కథలూ, కాకరకాయలూ, వంటలూ, జోకులూ..అబ్బో..యెన్ని సంగతులో! తనకా వైపు యేమాత్రమూ ఇంట్రెష్టే లేదెందుకో!  ఒక్కసారి మారాలంటే కష్టం కానీ, కొన్ని రొజులు ప్రయోగం చెసి చూస్తే? తనకూ కాలక్షేపం కదా!
  అనుకున్నదే తడవు, భీమశంకరం  సరస్వతి మేనమామతొ   ఓ అరగంట మాట్లాడాడు. వాళ్ళ విషయాలు  అడిగి తెలుసుకున్నాడు. తన సంగతీ బాగానే చెప్పాడు. ఇలాగే  మరో చుట్టం ఫోన్ చేస్తే కూడా, తన అలవాటుకు  భిన్నంగా యెక్కువసేపే  మాట్లాడాడు. వాళ్ళు తనపై జోక్ కూడా వేశారు-రెటైర్  తరువాత కాలక్షెపం  లెదేమో బావగారికి ? అని..కాస్త  నొచ్చుకున్నా, మనసులోంచీ తుడిచేశాడు. 


       ముఖ్యంగా,   సాంబయ్య ఫోన్ లా  తన సెల్లూ యెప్పుడూ బిజీగా వుంటే యెంత బాగుంటుందో అనిపించటం మొదలైంది. నిజానికి  భీమశంకరానికి సెల్లంటే ఇన్నిరోజులూ అంతగా పడేది కాదుకూడా!  ఇప్పుడు భార్యా వూర్లో లెకపోవటం, రిటైర్ అవటమూ-యెప్పుడూ టీ. వీ చూస్తూ కూర్చోలేకపోవటమూ  ఇవన్నీ కారణాలయ్యాయి అతనిలోని యీ మార్పుకు!
       మరుసటిరోజు, భీమశంకరం భోజనానికి కూర్చోబోతున్నాడు. సెల్ మోగింది. ఈ టైంలో చేసేవాళ్ళెవరూ లేరు మరి! కూర్చోబోతున్నవాడల్లా,  చటుక్కున లేచాడు-తన ఇప్పటి ఇంట్రెష్ట్ గుర్తొచ్చి!
    .హలో ! యెవరు?
    హలో ...ఇది భీమశంకరంగారి నంబరేనాండీ?
    ఆఆ అవును..మీరెవరు?
    మీతో ఓ రెండు నిమిషాలు మాట్లాడవొచ్చునా సార్?'
యెవరో అమ్మాయి. చాలా మర్యదగా మాట్లాడుతోంది. భీమశంకరం కాస్త మెత్తబడ్డాడు.
    'యేంటి   విషయం?'
   'సార్! నేను ప్రైం హోంస్  వెంచర్  నుంచీ మాట్లాడుతున్నానండీ..షమ్షాబాద్నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో మా వెంచర్ వుందండీ . గజం పదిహేనువేల రూపాయలు.  మీకు ఇంట్రెస్ట్ ఉంటే! ' అని  ఆ అమ్మాయి ఇంకా ఇంకా వివరాలేవో చెబుతూనే ఉంది.
      భీమశంకరం ఆలోచనలు అలా కొనసాగుతూనే ఉన్నాయి.  వీళ్ళకిలా అందరి నంబర్లెలా దొరుకుతాయసలు? యేర్ టెల్ వాళ్ళతోనూ, బీ.యెస్.ఎన్.ఎల్ , అందరికీ యేదో పాకేజ్  లా చెల్లించి, ఇలా అందరి నంబర్లూ తీసుకుంటారట! ఇలా ఫోన్లు చేసి విసిగిస్తుంటారట! సరస్వతి ఇలాంటి ఫోన్లకు, చాలా విసురుగా సమాధానం చెప్పటం చాలాసార్లే  విన్నాడు. కానీ,  ఇప్పుడు ఇలాంటి  ఫోన్లు అవసరమేననిపించింది.  పైగా, అలా ఫోన్ నంబర్లు తీసుకుని కష్టమర్లను ఇబ్బందిపెట్టేవాళ్ళనిలా కాసేపు యేడిపించవచ్చు కదా! అన్న చిలిపి ఆలోచన వచ్చింది భీమశంకరానికి  విచిత్రంగా !
   'చూడమ్మా! నీ పేరేంటన్నావ్?'
   'చంద్రికండీ..'
   ' నాకవసరం లేదు కానీ, మా బంధువులొకరు ప్లాట్  వాళ్ళబ్బాయి కోసం కొనాలని  చూస్తున్నారు.  వాళ్ళతో మాట్లాడి  చెబుతాను. మీ వెబ్ సైట్ యేదైనా  వుందా?'
   'ఆఆ..వుంది సార్! వాళ్ళ నంబర్ ఇస్తే, నేనూ వాళ్ళతో మాట్లాడుతాను సార్..పైగా, మీలా మాకు  కష్టమర్లను చూపించేవారికి సర్ ప్రైస్ గిఫ్ట్ కూడా ఉందండీ మా దగ్గర!'
    'ఆ..ఆ గిఫ్ట్లూ  అవీ తరువాత కానీ, వాళ్ళిప్పుడు వూళ్ళో లేరు. రెండు రోజుల్లో వస్తారు. ఓపని చెయ్..యెల్లుండి ఇదే టైం కి ఫోన్ చేస్తావా?'
 ' తప్పకుండానండీ. చాలా థాంక్సండీ..'
  'ఆఆ... సరే సరే ఉంటానమ్మా!'
  ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసింది. .
  రెండురోజులెలానో గడిచిపొయాయి. భీమశంకరం సెల్ యెప్పుడు మోగుతుందా అని యెదురు చూస్తూ!   యెంతకీ మోగదేంటబ్బా?  పోనీ తనే  చేస్తే? చీ చీ..అలా చేస్తే మరీ లోకువైపోడూ? భోజనమైపోయి, అన్యమనస్కంగానే కాస్త నడుమూ వల్చాడు. ఫోను మోగ నే లేదు.  సాయంత్రం మెడికల్ షాప్ కు వెళ్ళి మందులు  కొంటుండగా, సెల్ మోగింది.
   హలో హలో!
   యెవరు?
  నేనేసార్! చంద్రికను..సారీ సార్.. అనుకోకుండా నా డ్యూటీ  మారింది. నాలుగ్గంటలకు  రావలసి వచ్చిందండీ! మా కొలీగ్ కి చెప్పానప్పాటికీ,  చేయలేదాండీ?
   మెడికల్ షాప్లోనుండి కాస్త బయటికి వచ్చి మాట్లాడటం  మొదలెట్టాడు.
   లేదమ్మా!  ఐనా వాళ్ళింకా  వూరినుంచీ రాలేదు. రేపేమైనా  వస్తారేమో చూడాలి మరి..
   థాంక్ గాడ్..ఐతే రేపు నేను ఈ టైం కి  చేయనాండీ?
   సరేలేమ్మా!
     భీమశంకరానికి, తన నటన బాగా నచ్చింది. ఇలాగే  మరో రెండు రోజులా   అమ్మాయి తో మాట్లాడి, అప్పుడు,  వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదట  అని చెప్పేయవచ్చుననీ,  వాళ్ళు కష్టమర్లతొ ఆడుకోనగా  లేనిది  మనకేంటి అని కూడా  సరిపెట్టుకున్నాడు.
   ఆ రోజు తరువాత, ఆ హోంస్ వాళ్ళనుంచే మళ్ళీ  యెవరో కూడా రెండు సార్లు చేశారు కానీ,  అప్పుడూ, మన శంకరం యేవో మాటలు చెప్పి దాటేశాడు.  కానీ లోపల్లొపల విసుగొచ్చేసింది.  ఓ సారి బాత్ రూంలో ఉండగా, మరోసారి మాల్ లో ఉండగా, ఇంకోసారి బంధువులెవరో మాట్లాడుతుంటే అక్కడినుంచే ఫోన్.. విసుగొచ్చేసింది. నిజం చెప్పేసి, యీ బెడదనుండీ బయట పడాలనుకున్నాడు కానీ యేదో బలహీనత!
   అ రోజు, భీమశంకరానికి,  అనుకోకుండా, మోషన్స్ పట్టుకున్నాయి. ఆఘమేఘాలమీద, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు తెలిసొచ్చింది సరస్వతి లేని లోటూ, ఇరుగూ పొరుగూతో పరిచయాలు పెంచుకోవలసిన అవసరం కూడా!
  బాత్ రూంకి పదిసార్లకు పైగా వేళ్ళాడారోజు!  నీరసం యెక్కువైంది. ఫోన్లో కూతురూ, అల్లుడూ అన్ని జాగ్రత్తలూ  చెబుతూనే ఉన్నారు. సరస్వతి పిన్ని కొడుకు, దగ్గరే వుండేవాడు వూర్లో లేడు అనుకోకుండా! ఒంటరిగానే  తంటాలు పడుతుండగా,  అప్పుడు మోగింది సెల్లు! నీరసంగా  హలో అన్నాడు..
  'సార్, నేను  చంద్రిక ఫ్రెండ్ దీపక్  నండీ..మీరేదో మా వెంచర్ కొసం'.. అప్పటికే నీరసంగా వున్న భీమశంకరానికి  సహనం చచ్చి పొయింది.
   'చూడు  దీపక్!  మీకు మా నంబర్లెలా వస్తాయోకానీ,  ఇలా  మీకిష్టమైనప్పుడు ఫోన్లు చేసి విసిగిస్తారెందుకయ్యా?  అసలు మీలాంటి  వెంచర్లన్నీ ఇలాగే  చేస్తాయా? కష్టమర్లసంగతేమోకానీ, అనవసరంగా, మమ్మల్నందరినీ  యెందుకిలా ఇబ్బంది పెడతారయ్యా బాబూ?'
  'సర్..స ర్..అదీ..నేనండి. .ప్రైం హోంస్ నుండి చంద్రిక ఇచ్చిందండి మీ నంబర్..మీరెవరిగురించో చెబుతారని..'
  'ఆఆ అవునయ్యా ..చెప్పాను. .ఇప్పుడు చెబుతున్నా విను..యెవరూ లేరు.  ఊరికే మిమ్మల్నో ఆటాడించాలని చెప్పా అంతే! ఇలా అందరినీ వేళ  కాని  వేళల్లో ఫోన్  చేసి  విసింగించకండి నాయనా!'
   అవతల ఆ అబ్బాయి  కోపంతో అంటున్నాడు..'ముందే మమ్మల్ని వదిలించుకోవచ్చుగా మీరు? ఇన్నిరోజులూ  ఫోన్లు చేయించుకుని  ఇప్పుడిలా మాట్లాడటం బాగుందా మీకు.?ఐనా మేమా కంపెనీలో పనిచేస్తున్నామండీ! మా ఆఫీసర్ యెలాచేయమంటే అలా చేస్తాంకానీ మా తప్పేముందిందులో? మా  ఆఫీస్ వాళ్ళతో  మాట్లాడాలి  మీరిదంతా!'
   'ఆఆ..ఔనయ్యా..నువ్వూ, లేకపోతే మరొకడూ..మీలాంటివాళ్ళకు బుద్ధి రావాలంటే....'
   'మాకు నువ్వేం బుద్ధి చెబుతావయ్యా? యేదో పెద్దమనిషని మర్యాదిచ్చి మాట్లాడుతూంటే, యేదేదో   మాట్లాడుతున్నావ్? పేద్ద మగాడివనుకుంటున్నావా!'
 ఇంకా ఆ అబ్బాయి తిట్లకు కూడా  లకించుకునేసరికి, భీమశంకరం తట్టుకోలేక ఫోన్ కట్  చేసేశాదు. ఇంకెప్పుడూ  ఇలాంటి  చిన్న చిన్న  ప్రలోభాలకు లొంగకూడదని  నీరసంగానే  ఒట్టు పెట్టుకుంటూ! ఇంతకూ మన భీమశంకరంగారికీ  అనుభవం యేమి  నేర్పింది?  సరస్వతిలా,  సాంబయ్యలా  ప్రతిరొజూ మాటకచ్చేరి చేయటమంటే మాటలు కాదని!!! అసలు మాట్లడటం  ఒక కళే! నొప్పించక తానొవ్వక,  యెదుటివారి మనసెరిగినట్టు మాట్లాడటం-అమ్మో, నిజంగా చాలా కష్టమే! ఇదివరకైతే జీవితాలెంతో సింపుల్ గా కూడా వుండేవి..మనుషుల అభిరుచులూ ఆలోచనలూ పరిమితంగానే వుండేవి..మరి ఇప్పుడో...మాట మాటకూ చాలా ఆలోచించి మాటలు పేర్చాలి మరి! అమ్మో! నా వల్ల కాదీ మాటకచ్చేరి  చేయటం! తన పరాజయాన్ని ఇంత తొందరగా ఒప్పుకోవలసి వస్తుందనుకోలేదు !  భీమశంకరం తలపట్టుకుని కూర్చున్నాడు నిశ్శ్శబ్దంగా! సాంబయ్య కంఠం మాత్రం  కంచులా మోగుతూనే ఉంది బైట! అదే  సమయానికి భీమశంకరం సెల్లూ ట్రింగ్ ట్రింగ్ అనటం   మొదలెట్టింది!

-  పద్మిని -హర్ష