Facebook Twitter
శ్రమికజాతి

శ్రమికజాతి!

 


 
తర తరాల దరిద్రాల
బరువులతో కరువులతో
క్రుంగి క్రుంగి
కుమిలి కుమిలి
కష్టాలకు నష్టాలకు
ఖైదులకూ కాల్పులకూ
సహనంతో శాంతంతో
బలిపశువై తలవాల్చిన
దీన పరాధీనజాతి
శ్రమికజాతి
దెబ్బతిన్న బెబ్బులివలె
మేల్కొన్నది
మేల్కొన్నది.
విశ్వవిపణి వీథుల్లో
చావు చాల చవకైనది
బ్రతుకుకు బ్లాక్‌మార్కెట్‌ధర.
వ్యాపారులు ప్రపంచాన్ని
తుంచుకొని పంచుకొని
పరిపాలిస్తున్నారు.
రైతు కూలి ప్రజ లంతా
ధనికుల పాదాల క్రింద
చీమలవలె చితికినారు.
శ్రమజీవుల రక్తధార
జలంకన్న పలచనైంది.
పరతంత్రత దరిద్రత
గిరులవోలె పెరిగినాయి.
శాంతానికి సహనానికి
దహనక్రియ జరిగింది.
చెలియలి కట్టలు దాటిన
ప్రళయకాల జలధి వోలె
తిరుగుబాటు పరచుకుంది.
విశ్వ రుద్ర ఫాలంలో
విప్లవాక్షి విరిసింది.
పరతంత్ర ప్రజాకోటి
ప్రళయవృష్టి కురిసింది.
స్వాతంత్ర్యోద్యమ శంఖం
దిగంతాల మొరసింది.
పొగులుతున్న భూగర్భం --
పగులనున్న జ్వాలాముఖి --
చిచ్చంటిన స్నిగ్ధాటవి --
పిడుగు లురలు పెను మేఘం --
హరగళగత హలాహలం
శ్రమికజాతి కదిలింది.
ప్రజాద్రోహి వర్గానికి
లయకాళిక శ్రమికజాతి --
జగద్విప్లవ గళంలో
జయమాలిక శ్రమికజాతి --
మేల్కొన్నది
మేల్కొన్నది

(దాశరథి కృష్ణమాచార్య రాసిన అగ్నిధార కవితాసంపుటిలోంచి)

- నిర్జర.