Publish Date:Dec 30, 2015
Publish Date:Dec 24, 2015
Publish Date:Dec 21, 2015
Publish Date:Oct 11, 2015

EDITORIAL SPECIAL
  మరో రెండేళ్ళలో చంద్రబాబు జైలుకు వెళతారట, ఈ మాట చెప్పింది ఎవరో కాదు బీజేపీకి ఏపీ ఇంచార్జ్ గా నియమించబడిన దేవధర్ అనే బీజేపీ నేత. ఆయన నిన్న ఆ పార్టీ మహిళా నాయకురాలు చంద్రబాబుకు బంధువు అయిన పురందేశ్వరితో కలిసి ఎన్టీఆర్ జన్మ స్థలం అయిన పామర్రులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన ఆయన పేదల సంక్షేమం కోసం తెలుగుదేశాన్ని స్థాపించి 9 నెలలలోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. తన రాజకీయ వారసుడిగా లోకేశ్ ను చంద్రబాబు ప్రకటించడం దారుణమని అన్నారు ఆయన. ఆయన అలా వ్యాఖ్యానించారో లేదో మరో పక్క గత ప్రభుత్వ అవినీతి మీద జగన్ ఒక కమిటీ నియమించారు. ఈరోజు ఏపీ విద్యుత్, ఇంధన శాఖ అధికారులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరిగిన అక్రమాల మీద దృష్టి సారించిన జగన్ సోలార్, విండ్ పవర్ కొనుగోళ్ల విషయంలో బిడ్డింగ్ రేట్లు కన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని సీరియస్ అయ్యారట. ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ నష్టాన్ని రికవరీ చేయాలి జగన్ ఆదేశించారు. ఆయా విద్యుత్ సంస్థలతో తిరిగి సంప్రదింపులు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు, సోలార్, విండ్ కంపెనీలు దారికి రాకుంటే వాటితో ఉన్న ఒప్పందాలు రద్దు చేస్తున్నట్టు జగన్ ఆదేశించారు. ఈ ఒప్పందాల్లో భారీ ఎత్తున ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూరినట్టు తెలియడంతో అప్పట్లో ఈ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి, అప్పటి సీఎం, మంత్రిపైనా న్యాయపరమైన చర్యలకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. అంటే అదేదో సినిమాలో ఆ దేవుడు శాసిస్తాడు ఈ అరుణాచలం పాటిస్తాడు అన్నట్టు బీజేపీ నేతలు సిగ్నల్ ఇస్తారు, జగన్ ఉచ్చు బిగిస్తారు అన్నమాట. నిజానికి చంద్రబాబు మీద అసలు కేసులే లేవని ఆయనను ఇబ్బంది పెట్టె అవసరం ఎవరికి ఉంటుందని నిన్ననే తాజగా పార్టీ ఫిరాయించిన సుజనా ప్రశ్నించారు. తమను చంద్రబాబే పార్టీ మారేలా ప్రోత్సహించి కేసుల నుండి బయట పడే ప్రయత్నం చేస్తున్నారని వస్తున్న విమర్శల నేపధ్యంలో ఆయన అలా స్పందించారు. కేసులు లేకపోతే రెండేళ్ళలో జైల్లో వేయడం ఎలాగని అనుకున్నారో ఏమో తెల్లారే సరికి కేసులు నమోదు చేసే సౌలభ్యాన్ని కలిగించారు.
  కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తే.. ఇక మంత్రులకుఅన్నారం, సుందిల్ల, కన్నేపల్లి బ్యారేజీలు.. ప్రాజెక్టులోని పంప్ హౌస్ లను అధికారంగా ప్రారంభించే అవకాశం దక్కింది. అయితే కేసీఆర్ సీఎం హోదాలో కాళేశ్వరంను ఎంత పట్టుదలతో పూర్తి చేయించారో.. అంతే పట్టుదలతో హరీష్ రావు.. గడిచిన హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తయ్యేలా కృషి చేసారు. కేసీఆర్ గొప్పగా చెబుతున్నట్టు మూడేళ్లలోనే కాళేశ్వరం పూర్తి అయ్యిందంటే అదంతా హరీష్ రావు కృషే అంటారు. అలాంటిది ఇప్పుడు కాళేశ్వరం ప్రారంభోత్సవంలో హరీష్ రావుకి కనీసం చోటు లేకపోవడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన మంత్రులు ఇప్పుడు వివిధ సహ బ్యారేజీలు, పంప్ హౌస్ లు ప్రారంభిస్తున్నారు. ప్రాజెక్ట్ కోసం అంత కృషి చేసిన హరీష్ రావుకు శిలా ఫలకంలో పేరు కాదు కదా.. కనీసం పిలుపు కూడా ఉందో లేదో తెలియని పరిస్థితి. కష్టమొకరిది.. వాటిని అనుభవించే ఫలితం మరొకరిదిలా తయారైందని హరీష్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా సభ ఏర్పాటు చేయకపోవడానికి ఓ రకంగా హరీష్ రావే కారణమని తెలుస్తోంది. ఒక భారీ ప్రాజెక్టును ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తున్నప్పుడు పెద్ద సభ పెట్టటం.. తమ ఆనందాన్ని, తాము సాధించిన విజయాన్ని చెప్పుకోవటం మామూలే. కానీ అందుకు భిన్నంగా కాళేశ్వరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేవలం పూజలకే పరిమితం చేసారు. ఒకేవేళ సభ ఏర్పాటు చేస్తే.. ప్రాజెక్ట్ కోసం కష్టపడిన హరీష్ రావు పేరుని ప్రస్తావించి ఆయనకు క్రెడిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పోనీ ఆయన పేరు ప్రస్తావించకుండా ఉందామా అంటే విమర్శలు వస్తాయి,   అటు పార్టీ శ్రేణుల్లోకి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఇదంతా ఎందుకు వచ్చిన తలనొప్పని సభ పెట్టలేదని తెలుస్తోంది.
  ఏపీ తెలుగుదేశంలో ముసలం ఏర్పడింది. చంద్రబాబు విదేశీ టూర్‌లో ఉండగా ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్ల‌మెంట‌రీ పార్టీ చీలిపోయింది.చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులుగా పేరున్న సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌తో పాటుగా గ‌రిక‌పాటి మోహ‌న‌రావు, టీజీ వెంకటేష్ టీడీపీ వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వారు త‌మ నలుగురిని ప్రత్యేక గ్రూపుగా భావించి రాజ్యసభలో బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌ వెంకయ్యనాయుడికి లేఖ అందజేశారు. ఈ నలుగురు ఎంపీలను బీజేపీలో చేర్చుకునే బాధ్యతను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు అమిత్ షా అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదంతా బీజేపీ అధినాయ‌క‌త్వం సూచ‌న‌ల మేర‌కే జరుగుతున్నట్లు స‌మాచారం. మ‌రో ఇద్ద‌రు స‌భ్యులు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌బాబు, సీతారామ‌ల‌క్ష్మి మాత్ర‌మే టీడీపీలో కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే వీరిద్దరిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. సీతారామలక్ష్మీ బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నట్టు సమాచారం. కనకమేడల మాత్రం టీడీపీని వీడే ఆలోచనలో లేనట్టు తెలిసింది. తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. స‌రిగ్గా పార్టీ మార‌టానికి ఈ నేత‌లు ఇదే స‌రైన స‌మ‌యంగా ఎంచుకున్నారు. పార్టీ కార్యాల‌యం నుండి స‌మాచారం అందుకున్న చంద్ర‌బాబు ఈ నేతలను ఫోన్ ద్వారా సంప్ర‌దించ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నా వీరు మాత్రం ఆయ‌న‌తో మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డలేదు. అయితే క‌నీసం లోక్‌సభ స‌భ్యులైనా వెళ్ల‌కుండా అపేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు ఇప్పుడు విదేశీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకొని తిరిగి ఏపీకి వ‌చ్చే అవ‌శాలు ఉన్న‌ట్లు స‌మాచారం.
ALSO ON TELUGUONE N E W S
ఈ మధ్య కాలంలో దాదాపు కాస్త క్రేజ్ ఉన్న అన్ని సినిమాల మీదా కాపీ వివాదాలు అల్లుకోవడం కామన్ గా మారింది. నిజానికి ఈ కాపీ వివాదాలలో విషయం పెద్దగా ఉండదు. ఎందుకంటే కధను రెడీ చేసుకునే క్రమంలో మన దర్శకులు, కధకులు ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉంటారు. అక్కడ వారికి ఏదో ఒక కామన్ పాయింట్ కనిపించవచ్చు, దానిని పట్టుకుని అంటే ఒక లైన్ రాసుకుని దానిని డెవలప్ చేస్తూ పోతారు. దీంతో ఒక్కోసారి ఇద్దరు రాసుకున్న కధలు ఒకలాగా అనిపిస్తాయి. అంటే మక్కీకి మక్కీ అని చెప్పలేము కానీ కాస్తంత పోలికలతో కూడి ఉంటుంది. నిజానికి ఇది ఎవరో ఎవరినో చూసి కాపీ కొట్టినట్టు కాదు, ఇద్దరూ బహుశా ఒక సినిమానే లేదా ఒకలాగా ఉన్న సినిమానే చూసి ఉండచ్చు. కానీ ముందుగా కధ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఏమంటారు ...ఇది నా కధే నేను ఫలానా వాళ్ళకి చెబితే వాళ్ళు ఈ డైరెక్టర్ చేత సినిమా తీయించుకుంటున్నారు అంటూ వాదిస్తారు. అయితే ఈ మధ్య కాస్త పబ్లిసిటీ కూడా అవుతోంది, ఇలా మీడియాకి ఎక్కడం వలన. అయితే ఇప్పుడు తెలుగులో వస్తున్న రెండు సినిమాల లైన్స్ దగ్గరగా ఉన్నాయనే వార్తలు రావడం కాస్త సంచలనంగా మారింది. అదేంటంటే... పూరీ డైరెక్షన్ లో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. మరో పక్క డైమండ్ రత్నబాబు అనే రైటర్ డైరెక్షన్ డెబ్యూగా సాయికుమార్ కుమారుడు ఆది హీరోగా  బుర్ర కధ అనే సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల కాన్సెప్ట్ లు రెండూ ఒకటే అని అంటున్నారు. నిజానికి ఈ మధ్య రిలీజ్ అయిన బుర్ర కధ ట్రైలర్స్, టీజర్స్ పరిశీలిస్తే గనుక ఓకే మనిషికి రెండు బుర్రలు ఉంటె ఎలా ఉంటుందో అనే కాన్సెప్ట్ తో ఈ కధ రాసినట్టు అర్ధం అవుతుంది. నిజానికి ఇలాంటి దగ్గరి కాన్సెప్ట్ తో గతంలో సవ్యసాచి అనే సినిమా కూడా వచ్చింది. ఒక మనిషిలో మరో మనిషి అంతర్లీనంగా ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నాగ చైతన్య హీరోగా వచ్చిన ఈ సినిమా ఆడలేదు కానీ కాస్త విభిన్నమైన సినిమాగా పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు పూరీ తీస్తున్న ఇస్మార్ట్ శంకర్ కూడా ఈ రెండు మైండ్స్ అనే లైన్ తోనే తెరకేక్కుతుందట. ఈ సినిమా ట్యాగ్ లైన్ పరిశీలిస్తే డబుల్ దిమాగ్ అనే ఉంటుంది. ఈ సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో వస్తుందని అంటున్నారు. అయితే అదే జరిగితే ఇప్పటికే వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరీకి పెద్ద దెబ్బేనని చెప్పాలి. కొడుకుని నిలబెట్టదానికి ఆయన గతంలో మెహబూబా అనే సినిమా తేఇ ఆర్ధికంగా నష్టపోయాడు. ఇక ఈ సినిమాని కూడా ఎవరూ నిర్మించడానికి ముందుకు రాకపోతే ఈయనే స్వయంగా మళ్ళీ అప్పులు చేసి మరీ నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా కంటే ముందుగానే ఈ బుర్ర కధ రిలీజ్ అవుతోంది. ఓకవేళ సేమ్ కధ అని తెలిసినా ఇస్మార్ట్ షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి. మరి ఏమవుతుందో వేచి చూడాలి.
మెగాస్టార్ 151 సినిమా 'సైరా నరసింహారెడ్డి' చిత్రీకరణ పూర్తయింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. అంతకంటే ముందే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయనున్న మెగాస్టార్ 152 షూటింగ్ ప్రారంభం కానుంది. చిరంజీవి పుట్టినరోజున ఆగస్టు 22న పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించి, సెప్టెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఆల్రెడీ సెట్ వర్క్ స్టార్ట్ అయింది. హైద‌రాబాద్‌లో 'రంగ‌స్థ‌లం' కోసం సెట్ వేసిన ప్రాంతంలో కాస్త పక్కకు పెద్ద పెద్ద ఇళ్ల సెట్స్ వేస్తున్నారు. ఆల్రెడీ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. 'ఠాగూర్', 'స్టాలిన్' తరహాలో చిరంజీవి ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టు మెసేజ్ ఓరియెంటెడ్ కథను కొరటాల సిద్ధం చేశారట. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' ఇలా కొరటాల సినిమాలు కూడా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, మెసేజ్‌తో ఉంటాయి. చిరు కోసం ఎలాంటి కథ రెడీ చేశారో!
'కల్కి' కథ విషయంలో విడుదలకు వారం ముందు వివాదం తలెత్తింది. కార్తికేయ అనే రచయిత తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘాన్ని, రచయితల సంఘాన్ని ఆశ్రయించారు... కథ తనదేనని! కార్తికేయ కథకు, 'కల్కి' టీమ్ ఇచ్చిన స్క్రిప్ట్‌కు ప్రాధమికంగా ఎలాంటి పోలికలు లేవని దర్శకుల సంఘానికి చెందిన కథాహక్కుల వేదిక కన్వీనర్ బీవీఎస్ రవి తెలిపారు. అయినా సోమవారం సినిమా చూస్తామన్నారు. సోమవారం సినిమా చూశారో? లేదో? కార్తికేయ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అసలు, ప్రారంభం నుంచి కథ ఎవరిదో చెప్పకుండా 'స్క్రిప్ట్ విల్' కంపెనీ స్క్రిప్ట్‌తో సినిమా తెరకెక్కిస్తున్నామని చెప్పుకొచ్చిన 'కల్కి' టీమ్ కథ ఎవరిదో బయటపెట్టింది. "ప్రశాంత్ వర్మకు చెందిన 'స్క్రిప్ట్ విల్' కంపెనీలో పది పదిహేను మంది రచయితలు ఉన్నారు. 'కల్కి'కి సాయి తేజ కథ అందించారు. స్క్రిప్ట్ విల్ కంపెనీ స్క్రీన్ ప్లే డెవలప్ చేసింది" అని జీవితా రాజశేఖర్ తెలిపారు. కథపై తలెత్తిన వివాదాన్ని ప్రస్తావించకుండా పరోక్షంగా స్పష్టత ఇచ్చారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా 'కల్కి' కథారచయిత సాయితేజ అని పేర్కొన్నారు. దీంతో సినిమా విడుదలకు ముందు వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టే. 'గరుడవేగ' విజయం తరవాత రాజశేఖర్ హీరోగా నటించిన ఈ 'కల్కి'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మంగళవారం సినిమా సెన్సార్ పూర్తయింది. గురువారం ప్రీమియర్ షోలతో అమెరికాలో, శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో 'కల్కి' విడుదలవుతోంది.
తెలుగులో వెబ్ సిరీస్‌ల టైమ్ మొద‌లైంది. ఓ రెండేళ్ల ముందువరకు ఔత్సాహిక దర్శకులు వెబ్ సిరీస్‌లు తీసేవారు. తర్వాత తర్వాత పేరున్న నిర్మాతలు, దర్శకులు వెబ్ సిరీస్‌లు తీయ‌డం మొదలు పెట్టారు. అమేజాన్ ప్రైమ్ కోసం ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్నాదత్ 'గ్యాంగ్ స్టార్స్' అని ఒక వెబ్ సిరీస్ నిర్మించారు. అందులో నవదీప్, జగపతిబాబు తదితరులు నటించారు. అజయ్ భుయాన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌కి దర్శకురాలు నందినీ రెడ్డి రూపకర్త. అలాగే, ఆమె యప్ టీవీ కోసం 'మన ముగ్గురి  లవ్ స్టోరీ' అని మరో వెబ్ సిరీస్ రూపొందించారు. సోనీ లివ్ కోసం దర్శకుడు మారుతి అందించిన కాన్సెప్ట్‌తో 'భజన బ్యాచ్' అని ఒక వెబ్ సిరీస్ రూపొందింది. ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ 10, 15, 20 ఎపిసోడ్స్‌లో పూర్తయ్యే వెబ్ సిరీస్ లు. ఇవన్నీ ఒక ఎత్తు... మధుర శ్రీధర్ నిర్మాణంలో రూపొందుతోన్న ఒక వెబ్ సిరీస్ మరో ఎత్తు. 100 ఎపిసోడ్స్‌తో ఆయనో వెబ్ సిరీస్‌కి శ్రీకారం చుట్టారు.  బహుశా... తెలుగులో, ఆ ఆమాటకొస్తే ఇండియాలో భారీ వెబ్ సిరీస్ ఇదేనేమో. సీరియల్ టైపులో సాగుతుందన్నమాట. ఆల్రెడీ 70 ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి చేశారు. మరో 30 ఎపిసోడ్స్ షూటింగ్ త్వరలో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
`మ‌హ‌ర్షి` స‌క్సెస్ త‌ర్వాత మ‌హేష్ న‌టించబోతున్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ఇటీవ‌ల `ఎఫ్2`తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్  రాజు, అనిల్ సుంక‌ర తో క‌లిసి మ‌హేష్ బాబు కూడా ఒక ప్రొడ్యూస‌ర్ గా వ్వ‌వ‌హ‌రిస్తున్నాడు. ఇటీవ‌ల లాంఛ‌నంగా ఈ చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇక జూలైలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం బిజినెస్ ప‌రంగా అప్పుడే హ‌ల్ చ‌ల్ సృష్టిస్తోంది. అవును హీరో మ‌హేష్ క్రేజ్ తో పాటు హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడుగా పేరు తెచ్చుకున్న డైర‌క్ట‌ర్ అనిల్ కాంబినేష‌న్ లో సినిమా కావ‌డంతో భారీ బిజినెస్ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ట‌. 16.5 కోట్ల‌కు `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంద‌ట స‌న్ నెట్ వ‌ర్క్ సంస్థ. మ‌హేష్ గ‌త చిత్రం మ‌హ‌ర్షి చిత్రానికి 12 కోట్లు మాత్ర‌మే ప‌లిక‌గా ఇప్పుడు మ‌హ‌ర్షి సినిమాను మించి ఈ సినిమా రేటు ప‌ల‌క‌డంతో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.
  ఏపీ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు చేయడం అంటే ఏమిటో ఏపీ ఓటర్లకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలీదేమో ? తాజా ఎన్నికల్లో హీరోలం అనుకునే వారిని జీరోలు చేసి, రూలర్స్ అనుకునే వారిని ఇంటికే పరిమితం చేసి పారేశారు. నిజానికి ఏపీ వోటర్లు రాజకీయ చైతన్యం కలవారే, కానీ ఏపీలో రాజకీయాలు చేయాలంటే ఎన్నో మెళుకువలు నేర్చుకోవాలి. చాలా చోట్ల కుల సమీకరణలతోనే ముందుకు వెళ్ళాలి. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా డిపాజిట్ లు కూడా లేకుండా పోతారు. ఈ విషయం మొన్నటి ఎన్నికలు బాగా క్లారిటీ ఇచ్చి మరీ చూపాయి. అయితే అయినా ఈ దెబ్బకి గుణ పాఠం నేర్చుకోని పవన్ మళ్ళీ జనసేన విషయంలో అదే తప్పు చేస్తున్నాడు.  నిజానికి పవన్ పార్టీ జనసేనకి కాపు పార్టీ అనే ముద్ర పడింది. అయినా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని ఆయన ఎన్నికల ముందు కూడా ఎంతో మంది కాపు నేతలను ఆయన పార్టీలో చేర్చుకున్నారు. జనం కోలుకోలేని విధంగా సమాధానం ఇచ్చారు. అయినా పవన్ తీరు మారినట్టు కనిపించడంలేదు. వంగవీటి వారసుడు రాధాకృష్ణని పార్టీ లో చేర్చుకోవాలని చూడడమే దానికి నిదర్శనం. అయితే ఏపీలో టీడీపీకి కమ్మ, వైసీపీకి రెడ్డి కులాల సపోర్ట్ నేరుగా ఉందని భావిస్తున్న పవన్ జనసేన పార్టీకి కాపు నాయకులని తీసుకున్నా ఫర్లేదని భావిస్తున్నారట. అయితే వంగవీటి రాధాని తీసుకోవడం వల్ల పవన్ కి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. మొన్నటి ఎన్నికల ముందు జగన్ ని తిట్టి టీడీపీలో చేరిన రాధాకు చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. అయితే రాధా ఉత్తర కోస్తాలో పలు చోట్ల తిరిగి ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి కూడా బాలేకపోవడం వలన జనసేన వైపు చూస్తున్నారు.  నిజానికి ఆయన జనసేనలో చేరినా పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయనకీ సొంతంగా చరిష్మా లేదు, తండ్రి రంగా పేరు చెప్పుకుని ఆయన ఇప్పటికీ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అతని వలన కాపు ఓట్లు కొన్నిఅయితే వచ్చాయి, కానీ ఆ తర్వాత వైసీపీ లోకి చేరిన తర్వాత రాధా ద్వారా వైసీపీ పెద్దగా చేకూరిన లాభం ఏమి లేదు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే మొన్న ఎన్నికల ప్రచారంలో తనను కాపుగా చూడకండి అని తాను అందరివాడిని అని ప్రసంగాలు దంచిన పవన్ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా గేట్లు తెరిచాడు అనేదే అర్ధం కాని విషయం. ఒక పక్క సొంత పార్టీలో ఉన్న ఆకుల సత్యనారయణ లాంటి వాళ్ళు నేరుగా పవన్ కి రాజకీయం రాదని విమర్శిస్తుంటే తాను రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాననేందుకే ఇలా చేస్తున్నాడా అనేది కూడా విశ్లేషణలకి అంతు చిక్కకుండా ఉంది.
  ప్రస్తుత రాజకీయాలలో ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రత్యర్థి పార్టీ నేతలను భయపెట్టో, బ్రతిమాలో తమ పార్టీలో చేర్చుకొని ప్రత్యర్థి పార్టీని పూర్తిగా ఖాళీ చేయడం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి మాత్రం భిన్నంగా ఉంది.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 ఎమ్మెల్యే సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. దీంతో జగన్ ఆ 23 లో కూడా మెజారిటీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొని టీడీపీని ఖాళీ చేస్తారని భావించారంతా. కానీ జగన్ మాత్రం అలాంటిదేం చేయకపోగా.. ఒకవేళ ఎవరైనా తమ పార్టీలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాలని స్పష్టం చేసారు. ఈరోజుల్లో ఒక్కో ఎమ్మెల్యే ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెడుతున్నారు. అన్ని కోట్లు ఖర్చుచేసి గెలిచి, మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు పోయే సాహసం చేయలేరు. దీంతో చంద్రబాబు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే జగన్ వదిలినా బీజేపీ మాత్రం టీడీపీని వదల్లేదు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులను చేర్చుకున్న బీజేపీ.. ఇప్పుడు ఎమ్మెల్యేలను చేర్చుకునే దిశగా పావులు కదుపుతుంది. అయితే ఈ విషయంలో బాబు & కో ఎంత ఆందోళన చెందుతున్నారో తెలీదు కానీ.. జగన్ మాత్రం బాగా ఆందోళన చెందుతున్నారట. టీడీపీ బ్రతికుండాలని కోరుకుంటున్నారట. మామూలుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని ఖాళీ చేయాలనుకుంటుంది. కానీ జగన్ మాత్రం టీడీపీ బ్రతకాలని, బాబుని కాపాడుకోవాలని చూస్తున్నారు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది.  కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి బలమైన శక్తిగా ఎదిగింది. ఇప్పుడు బీజేపీ దృష్టి సౌత్ మీద పడింది. ముఖ్యంగా 2024 నాటికి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఏపీలో పావులు కదుపుతుంది. టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటుంది. మొదట టీడీపీ నేతలను చేర్చుకొని బలపడిన తరువాత వైసీపీని టార్గెట్ చేసే అవకాశముంది. ఎందుకంటే ఏపీలో టీడీపీ ఖాళీ అయితే.. అప్పుడు ప్రధాన ప్రత్యర్థులు బీజేపీ, వైసీపీ అవుతాయి. అదే జగన్ భయం. టీడీపీకి ఇప్పుడున్న బలం అలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో జగన్ కి ఈజీ అవుతుంది. అలా కాకుండా బీజేపీ బలపడితే జగన్ కి కష్టాలు మొదలైనట్టే. బీజేపీని ఎదిరించలేడు. ఒకవేళ ఎదిరించే సాహసం చేస్తే పరిస్థితి బాబు కంటే దారుణంగా ఉంటుంది. జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో జైలుకి కూడా వెళ్లొచ్చారు. ఒకవేళ జగన్ బీజేపీని ఎదిరిస్తే వాటిని వెలికితీసి జైలుకి పంపినా ఆశ్చర్యం లేదు. అందుకే జగన్ బీజేపీ బలపడకూడదని, బాబుని కాపాడుకోవాలని చూస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఆ అవకాశం ఇచ్చేలా లేదు. నిజానికి బీజేపీ ఏపీలో బలపడటానికి కొన్ని నెలల ముందు నుంచే ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దానిలో భాగంగా ముందుగా టీడీపీని టార్గెట్ చేసింది. ముఖ్యంగా టీడీపీకి ఆర్థికంగా అండగా ఉన్నవారికి గేలం వేసి దెబ్బ తీసింది. తరువాత మిగతా నేతలను టార్గెట్ చేసింది. కొందరు వ్యాపారాల కోసం, కొందరు భవిష్యత్తు కోసం ఇలా రకరకాల కారణాలతో టీడీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. టీడీపీకి ముందు నుంచి బీసీ, కమ్మ సామాజికవర్గాలు అండ బలంగా ఉండేది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారు టీడీపీకి దూరం జరిగారు. ఇప్పుడు వారికి బీజేపీ వల వేసింది. అదేవిధంగా పలు జిల్లాల్లో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గ నేతలను కూడా ఆకర్షించే పనిలో బీజేపీ పడింది. ఇలా సామాజిక వర్గాల వారీగా టీడీపీని బలహీనపరుస్తూ తాను బలపడాలనేది బీజేపీ ప్లాన్. బీజేపీ ఒక్కసారి బలపడటం మొదలు పెడితే.. 2024 లో అధికారమే లక్ష్యంగా వైసీపీని టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే మోడీ తో సహా పలువురు బీజేపీ పెద్దలు ఏపీలో 2024 లో అధికారంలోకి వస్తామని బలంగా చెబుతున్నారు. దాన్ని బట్టే అర్థంచేసుకోవచ్చు. బీజేపీ ఏపీ మీద ఎంత ఫోకస్ పెట్టిందో. అంటే ఏపీలో టీడీపీ బలహీనపడే కొద్దీ జగన్ కి కష్టాలు మొదలవుతాయి అనమాట. అందుకే జగన్ తన జాగ్రత్తలో తాను ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రధాన బలం హిందూ ఓటు బ్యాంకు. హిందువులు అందరూ గంపగుత్తుగా బీజేపీ వైపు చూడకుండా.. శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామితో సన్నిహితంగా ఉంటున్నారు. ఒకవేళ మెజారిటీ హిందువులు బీజేపీ వైపు వెళ్లినా.. తనకి అండగా ఉన్న రెడ్డి సామాజికవర్గం, క్రిస్టియన్ ఓటుబ్యాంకుతో బీజేపీని ఢీ కొట్టాలని చూస్తున్నారట. అందుకే ఇటీవల అధికారుల పదోన్నుతులలో కూడా రెడ్డిలకు, ముఖ్యంగా క్రిస్టియన్లకు పెద్ద పీట వేశారని తెలుస్తోంది. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి ఏ మాత్రం నచ్చని చర్య. అంటే జగన్ ఒకవైపు బాబుని కాపాడుకోవాలని చూస్తూనే.. మరోవైపు అవసరమైతే బీజేపీతో పోరుకి సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారని అర్ధమవుతుంది. మరి జగన్ బీజేపీని ఎదిరించి నిలబడగలరా?. అసలే ప్రత్యర్థుల మీద సీబీఐ, ఈడీ వంటి వాటిని ఉపయోగించి ముప్పు తిప్పలు పెట్టే బీజేపీ.. జగన్ ని మాత్రం వదులుతుందా?. అదే జరిగితే జగన్ సీఎం పదవి మూడునాళ్ళ ముచ్చట అయ్యే ప్రమాదముంది. అది జరగకూడదంటే జగన్ బాబుని కాపాడుకోకతప్పదు. మరి జగన్ ఈ కమల గండం నుంచి ఎలా బయటపడతారో చూడాలి.
  ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజా వేదిక విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, దాన్ని కూల్చేయాలని జగన్‌ ఆదేశించారు. ప్రజావేదిక నుంచే రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభిద్దామని, సమావేశం ముగియగానే కూల్చివేత పనులు మొదలుపెట్టాలని జగన్ కలెక్టర్ల సమీక్షలో స్పష్టం చేసారు. ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్.. ప్రజా వేదిక విషయంలో కూడా సంచలన నిర్ణయం తీసుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం ఏదో తన హీరోయిజం చూపించుకోవడం కోసం జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ప్రజా వేదిక కూల్చివేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం తప్పని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజా వేదిక కూల్చివేయడం అంటే ప్రజా ధనాన్ని వృథా చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ చెప్పినట్టు అది అక్రమ నిర్మాణమే అవ్వొచ్చు. కానీ అది దాదాపు రూ.10 కోట్ల ప్రజాధనంతో కట్టిన నిర్మాణం. మరి ఇప్పుడు ఉన్నపళంగా దాన్ని కూల్చేస్తే ఆ డబ్బంతా వృథానే కదా. దానికి తోడు ఇప్పుడు కూల్చడానికి కూడా ప్రజాధనమే ఖర్చు చేయాలి. మరి ఇదంతా నష్టమే కదా. మంగళవారం కలెక్టర్లతో సమీక్ష ముగుస్తుంది. బుధవారం నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టమన్నారు. మరి కలెక్టర్లతో తదుపరి సమీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు. వాటి కోసం మరో నిర్మాణం చేపడతారా. ఏదైనా భవనం అద్దెకి తీసుకుంటారా?. మరి ఇవన్నీ అదనపు ఖర్చులే కదా. ప్రజావేదిక కూల్చివేత పుణ్యమా అని పది కోట్లు బూడిద పాలు అవ్వడమే కాక.. మళ్ళీ ఇవన్నీ అదనపు ఖర్చులు. అంటే జగన్ ఇదంతా ఆలోచించకుండా అక్రమ కట్టడం కూల్చాలంటూ తొందరపడి నిర్ణయం తీసుకొని ప్రజా ధనాన్ని వృధా చేసినట్లే అవుతుంది కదా అంటున్నారు. సరే అవినీతి మీద, అక్రమ కట్టడాల మీద జగన్ ఉక్కుపాదం మోపుదాం అనుకుంటున్నారు అనుకుందాం. మరి ప్రజావేదిక విషయంలో చూపిన దూకుడు మిగతా కట్టడాల మీద చూపుతారా?. కరకట్ట సమీపంలో పలు అక్రమ కట్టడాలు ఉన్నాయి. ప్రజావేదికను వెంటనే కూల్చేయమని చెప్పిన జగన్.. మరి మిగతా అక్రమ కట్టడాలను కూడా వెంటనే కూల్చేయమని చెప్తారా?. ఒకవేళ ప్రజావేదిక విషయంలో చూపిన చొరవ, ఉత్సాహం మిగతా అక్రమ కట్టడాలపై చూపకపోతే మాత్రం జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటారు. ఎందుకంటే ప్రజావేదికను ప్రతిపక్ష నాయకుడిగా తనకి కేటాయించాలని చంద్రబాబు లేఖ ద్వారా జగన్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆ లేఖకు బదులివ్వకుండానే ప్రజావేదికను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు కూల్చడానికి సిద్దపడింది. మరి ఇప్పుడు జగన్ సర్కార్ ప్రజావేదికను మాత్రమే కూల్చి మిగతా అక్రమ నిర్మాణాల విషయంలో చూసీచూడనట్టు వదిలిస్తే.. ఇది కచ్చితంగా బాబు మీద కక్ష సాధింపు చర్య అనే అభిప్రాయం వ్యక్తమయే అవకాశముంది. దానికితోడు అసలే జగన్ ది ఫ్యాక్షన్ ధోరణి అని టీడీపీ ఆరోపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజావేదిక ఒక్క నిర్మాణాన్ని మాత్రమే కూల్చితే.. నిజంగానే జగన్ ది ఫ్యాక్షన్ ధోరణి అని టీడీపీ మరింత ప్రచారం చేసే అవకాశముంది. మరి జగన్ వారికి ఆ అవకాశం ఇస్తారో లేదో చూడాలి. 
  'నాయకుడు వారసత్వంలోనుంచి పుట్టడు. ప్రజల్లోనుంచి పుడతాడు. అలా పుట్టిన నాయకుడే ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు.' ఈ విషయాన్ని 4 దశాబ్దాల అనుభవమున్న చంద్రబాబు పూర్తిగా విస్మరించారు. తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉండడం, కొడుకుని గొప్ప స్థాయిలో చూడాలనుకోవడం సహజం. కానీ తన కొడుకు అసలు ఈ రంగంలో రాణించగలడా లేదా అన్న ఆలోచన లేకుండా.. వారసత్వమే తన కొడుకుని నిలబెడుతుందన్న భావనతో బాబు లోకేష్ ని అందలం ఎక్కించారు. తీరా ప్రజా తీర్పు చూసి ఏడుపు మొహం పెట్టారు. ఎందరో వారసులు రాజకీయాల్లోకి వచ్చారు.. కొందరు రాణించారు. వారసులు రాజకీయాల్లోకి రావడంలో తప్పులేదు. కానీ ఆ వచ్చే విధానంలోనే మార్పు కనపడాలి. ముందు పార్టీ గురించి, పార్టీ సిద్ధాంతాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ద్వితీయ శ్రేణి నేతలతో, కార్యకర్తలతో టచ్ లో ఉంటూ.. క్షేత్రస్థాయిలో పని చేయాలి. ప్రజల్లో ఉండాలి. కానీ లోకేష్ రాజకీయ ప్రవేశం ఎలా ఉంది?. అంతా హైటెక్ మయం. మీడియా, సోషల్ మీడియాలో కనిపించడమే తప్ప ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగకుండానే డైరెక్ట్ గా మంత్రి పదవి పొందారు. దీంతో సహజంగానే ప్రజల్లో లోకేష్ మీద వ్యతిరేక భావన ఏర్పడింది. దీనికి తోడు లోకేష్ తన చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని నిజమైన కార్యకర్తలను దూరం పెట్టారు. భజన చేసేవారిని, నాలుగు ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడేవారిని, సోషల్ మీడియానే నిజమైన సమాజం అనుకునేవారిని లోకేష్ తన చుట్టూ పెట్టుకున్నారు. దీంతో ఆయన కార్యకర్తలకు, ప్రజలకు దగ్గరవ్వలేకపోయారు. ఇక లోకేష్ మాటల తడబాటు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. నాయకుడికి చేతలతో పాటు వాక్చాతుర్యం కూడా ఉండాలి. తన ప్రసంగాలతో కార్యకర్తలను ఉత్తేజ పరచాలి, ప్రజలను ఆకట్టుకోవాలి. వాక్చాతుర్యంతో ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెట్టాలి. కానీ లోకేష్ మైక్ పడితే  ప్రత్యర్థి పార్టీలకు పండగే. పదాలను సరిగ్గా పలకకపోవడం లేదా ఒక పదానికి బదులు మరో పదం పలకడం.. ఇలా పదాలతో విన్యాసాలు చేసి ప్రత్యర్థులను కూడా నవ్వించి తాను నవ్వులపాలయ్యాడు. పప్పు అనే పేరు తెచ్చుకున్నాడు. దీన్ని ప్రత్యర్థులు లోకేష్ పేరు వింటే పప్పు అని గుర్తొచ్చే అంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సరే మాటలు తడబాటు సహజం. మిగతా నాయకులు అప్పుడప్పుడు తడబడితే ఈయన ఎక్కువసార్లు తడబడతారు అనుకోవచ్చు. ఇక్కడ లోకేష్ చేసిన ప్రధాన తప్పు.. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకపోవడం. క్షేత్రస్థాయిలో పార్టీలో పనిచేస్తూ కార్యకర్తలకు దగ్గరై, ప్రజల్లోకి వెళ్తే పరిస్థితి మరోలా ఉండేది. ఆయన మాటలు తడబడినా ఆయన చేతలు చూసి ఆయన వెంట కొందరైనా నడిచేవారు. కానీ లోకేష్ అలా చేయలేదు. డైరెక్ట్ గా మంత్రి అయ్యి తనకి తిరుగు లేదు అనుకున్నారు. తనకి తాను యువరాజులా ఫీలయ్యారు. ఇదే ప్రత్యర్థులకు వరమైంది. ఒక్కసారి గెలిపిస్తే బాబు కొడుకుని మంత్రిని చేసాడు, మరోసారి గెలిపిస్తే ఏకంగా ముఖ్యమంత్రిని చేస్తారని ప్రజలకు పదే పదే చెప్పారు. దీంతో ప్రజలు లోకేష్ ని కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించకుండా ఇంటికి పంపారు. పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేసారు. మరి ఈ అనుభవాల నుంచైనా లోకేష్ తన పద్దతి మార్చుకొని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.  
  ఒక్క మంత్రి పదవి ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిందా? ఎవరీ అన్నదమ్ములెవరు? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో మంత్రి పదవుల రేసులో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఐదుగురు పేర్లు విన్పించగా, అందులో ముఖ్యులుగా ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం నిలిచారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాంను అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎంపిక చేసారు. సీనియారిటీ, గత అనుభవాల దృష్ట్యా ధర్మాన ప్రసాదరావుకే మంత్రి పదవి లభిస్తుందని ఆయనతో పాటు ఆయన వర్గం ముందు నుంచే ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అయితే పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ధర్మాన ప్రసాదరావుకు కాక ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. ధర్మాన ప్రసాదరావుకు కాకుండా కృష్ణదాస్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చే జరుగుతోందట. మంత్రిగా అనేక పర్యాయాలు పనిచేసి, సుధీర్ఘ అనుభవం కలిగిన ధర్మాన ప్రసాదరావును కాకుండా ధర్మాన కృష్ణదాస్‌ను మంత్రిగా నియమించడంపై జిల్లా పార్టీలో వ్యతిరేక స్వరం మొదలయ్యిందట. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య అగాథం పెంచిందట. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి జిల్లాకు విచ్చేసిన ధర్మాన కృష్ణదాస్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసారు. రైల్వే స్టేషన్ నుంచి పార్టీ కార్యాలయం చేరుకునే వరకు ధర్మాన కృష్ణదాస్ కు స్వాగతం పలికేందుకు ఎక్కడా ధర్మాన ప్రసాదరావు రాలేదు. పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి ధర్మాన ప్రసాదరావు వస్తారని కొద్దిసేపు కార్యక్రమాన్ని వాయిదా వేసినా ఆయన రాకపోవడంతో చేసేదేమిలేక కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే ఆ సమయంలో ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యాలయంలోనే ఉండి కూడా కార్యక్రమానికి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాదు ధర్మాన కృష్ణదాస్‌ పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోగానే ధర్మాన ప్రసాదరావు అనుచరులు ధర్మాన కృష్ణదాస్‌ ఫ్లైక్సీలను వెంటనే తొలగించారు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ధర్మాన ప్రసాదరావు వర్గీయులు ఇలా చేసారని జిల్లాలో కొందరు నాయకులు గుసగుసలాడుకుంటున్నారట. మొత్తం మీద ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల అంతర్గత విభేదాలతో పార్టీ బలహీన పడుతుందన్న చర్చ ఒకవైపు నడుస్తుండగానే తాజాగా తెరపైకి వచ్చిన అన్నదమ్ముల పదవీ వైరం ఎటువైపు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయట. మరి సోదరుల పంచాయితినీ, వైసీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
  బంతిని నేలకి ఎంత బలంగా విసిరితే.. నింగికి అంత బలంగా ఎగురుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఇదే జరగబోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే కేసీఆర్ తరువాత హరీష్ రావు పేరు వినిపించేది. కష్ట కాలంలో కేసీఆర్ కి అండగా ఉంటూ పార్టీని బలపరచడానికి హరీష్ కృషి చేసారు. గెలుపు అసాధ్యం అనుకున్న స్థానాల్లో కూడా హరీష్ పార్టీని గెలిపించి చూపించారు. ట్రబుల్ షూటర్ గా పేరుతెచ్చుకున్నారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు లెక్క పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కేసీఆర్ కి పార్టీలో ఏ వ్యవహారమైనా ముందుగా మేనల్లుడు హరీష్ పేరు గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఈ మార్పు ఇటీవల స్పష్టంగా కనిపిస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసాధ్యమనుకున్న స్థానాల్లో హరీష్ టీఆర్ఎస్ జెండా ఎగిరేలా చేసారు. అయితే అప్పటికే కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కోసం హరీష్ ని పక్కన పెడుతున్నారనే ప్రచారం జరిగేది. ఎన్నికల తరువాత ఆ ప్రచారం మరింత బలపడింది. హరీష్ కి మంత్రివర్గంలో చోటులేదు, పార్టీలో సరైన స్థానంలేదు. దీంతో హరీష్ అభిమానుల్లో ఆవేదన మొదలైంది. అయితే హరీష్ మాత్రం ఎప్పుడూ కేసీఆర్ కి కానీ, పార్టీకి కానీ వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. తన విధేయత చూపుతూ వస్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంతో.. హరీష్ కి అన్యాయం జరుగుతుందనే చర్చ మళ్ళీ తెర మీదకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కోసం ఎంతో శ్రమించిన హరీష్‌కు.. కనీసం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పార్టీ శ్రేణుల్లోనూ, అటు సామాన్య ప్రజల్లోనూ హరీష్ పై సానుభూతి వ్యక్తమవుతోంది. అయితే హరీష్ మాత్రం ఇంత జరుగుతున్నా తన విధేయత చాటుకుంటూనే ఉన్నారు. సిద్దిపేటలో ఘనంగా కాళేశ్వరం ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించి.. ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా కేసీఆర్ దే అనేసారు. దీంతో హరీష్ మీద ప్రజల్లో మరింత సానుభూతి, అభిమానం పెరిగాయి. అయితే ఇవన్నీ మౌనంగా భరిస్తూ విధేయత చూపుతున్న హరీష్.. ఎప్పుడో అగ్నిపర్వతంలా పేలి పార్టీలో ప్రళయం సృష్టిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ చూపు కూడా ఇప్పుడు హరీష్ పై పడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో బీజేపీలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. తెలంగాణలో 2023 లో అధికారమే లక్ష్యంగా పార్టీని బలపరచాలని అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలను కూడా పార్టీలో చేర్చుకుంది. అయితే బీజేపీ ఇలా నెమ్మది నెమ్మదిగా బలపడటం కంటే ఒకేసారి కుంభస్థలాన్ని కొట్టాలని చూస్తోందట. అందుకే ఇప్పుడు హరీష్ ని పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోందట. హరీష్ చేరితే టీఆర్ఎస్ లో చీలిక వచ్చి బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనేది ఆ పార్టీ పెద్దల భావనగా తెలుస్తోంది. ఎలాగూ ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకొనే పరిస్థితి లేదు. హరీష్ వస్తే టీఆర్ఎస్ బలం కూడా తగ్గుతుంది. దీంతో 2023 అధికారంలోకి రావాలనే ఆశ నెరవేరుతుంది. ఇదే ప్రస్తుతం బీజేపీ ప్లాన్ అని తెలుస్తోంది. మరి హరీష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
  ఒకప్పుడంటే ఫోన్లో మాట్లాడటం విలాసం. కానీ ఇప్పుడో! పక్క ఇంట్లో ఉన్న మనిషితో కూడా ఫోన్లోనే మాట్లాడేస్తున్నాం. ఇలాంటి విచ్చలవిడి వాడకంలోని లాభనష్టాల మాట అటుంచితే ఫోన్లో మాట్లాడటం కూడా కళే అంటున్నారు నిపుణులు. మనిషి ఎదురుగుండా ఉండడు కాబట్టి మొహమాటమూ, భయమూ లేకుండా ఫోన్లో చెలరేగిపోతూ ఉంటాము. అలాంటి సమయాలలో కొన్ని కనీస మర్యాదలు పాటించాలని సూచిస్తున్నారు...   ముందుగానే నిర్ణయించుకోండి ఏదన్నా విషయం గురించి మాట్లాడాలనుకునేటప్పుడు, ఓ నిమిషం సేపైనా మీరు చెప్పాలనుకున్న విషయం ఏమిటి? దానిని అవతలివారికి ఎలా తెలియచేయాలనుకుంటున్నారు? అన్న అంశం మీద దృష్టి పెట్టండి. మీ మాటలకు అవతలి వ్యక్తి ఎలా స్పందించే అవకాశం ఉంది! దానికి మీ దగ్గర తగిన జవాబు ఉందా లేదా! అన్నది తరచి చూసుకోండి. లేకపోతే సంభాషణ మధ్యలో మాటలు తడుముకోవాల్సి ఉంటుంది.   పరిచయంతో మొదలు మన జీవితంలో ఎదురుపడిన ప్రతి ఒక్కరి దగ్గరా మన ఫోన్‌ నెంబరు ఉండాలన్న నిబంధన లేదు. కానీ చాలామందికి తమను తాము పరిచయం చేసుకునేందుకు అహం అడ్డు వస్తుంది. ‘నేనే మాట్లాడుతున్నాను’, ‘ఏంటి విశేషాలు’... అంటూ నేరుగా సంభాషణలోకి దిగిపోతుంటారు. అవతలివారు సదరు మనిషిని గుర్తపట్టలేక ఇబ్బందిపడుతూ ఉంటారు, ఒకవేళ గుర్తుపట్టినా సంభాషణ మొదలయ్యే తీరు చాలా అమర్యాదగా తోస్తుంది.    కనీస మర్యాదలు ఒక వ్యక్తి ఎదురుపడినప్పుడు నమస్కారం చెప్పడం, క్షేమసమాచారాలు అడగడం కనీస మర్యాదు. ఫోన్‌ సంభాషణలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంతేకాదు! అవతలి వ్యక్తి హోదాలో ఎంత చిన్నవారైనా కూడా దురుసుగా మాట్లాడటం, వేళాకోళం చేయడంతో మన గురించి చెడు అభిప్రాయాన్నే మిగులుస్తుంది. చాలామంది ఫోన్లో మాట్లాడేటప్పుడు తమకి ఉన్న హాస్య చతురతని అంతా చూపిద్దామనుకుని గీత దాటుతూ ఉంటారు. దీంతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.   సాఫీగా సంభాషణ ఫోన్లో మన వాదనని వినిపించేందుకు ఎంతగా ప్రాధాన్యతని ఇస్తామో, అవతలివారి మాటని వినేందుకు కూడా అంతే ప్రాధాన్యతని ఇవ్వాలి. మాటిమాటికీ అడ్డు తగలడం, హెచ్చుస్థాయిలో మాట్లాడటం వల్ల వాదన కాస్తా వివాదంగా మారిపోయే అవకాశం ఉంది. తొందరగా మాట్లాడేయాలన్న కంగారులో ఏదిపడితే అది మాట్లాడేసే ప్రమాదమూ లేకపోలేదు. ఇక ఏదన్నా ముఖ్య విషయం మాట్లాడలనుకునేటప్పుడు టీవీ, ట్రాఫిక్‌ వంటి శబ్దాలు లేని సందర్భాన్ని ఎంచుకోవడం మంచిది.   సమయం కొంతమందికి ఫోన్‌ చూస్తే చాలు పూనకం వచ్చేస్తుంది. ‘సరే అయితే!, ‘ఇక ఉంటాను’ లాంటి సూచనలు ఇస్తున్నా కూడా సంభాషణని మరింతగా పొడిగిస్తూ ఉంటారు. ఇలాంటి సంభాషణలకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. ఫోన్ సంభాషణ ఎలా మొదలుపెట్టాలి అన్నదే కాదు, ఎంతసేపట్లో ముగించాలన్నది కూడా తెలిసి ఉండాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఇక చాలు అన్న సూచనని ఇచ్చినప్పుడు ఆ సంభాషణని ముగించడం మేలు. - నిర్జర.
  విజ్ఞానం పెరిగిపోతోంది. విద్యావంతుల సంఖ్యా పెరిగిపోతోంది. పిల్లలకి ఏం పెట్టాలి? వారిని ఎలా పెంచాలి? అనే విషయాల మీద ప్రతి ఒక్కరికీ స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ అవి సరైనవనా! మనం పిల్లల్ని పెంచుతున్న తీరులో ఏవన్నా తీవ్రమైన లోపాలు ఉన్నాయా? అంటే ఉన్నాయనే అంటున్నారు పరిశోధకులు.   తీరు మారింది.. అమెరికాలోని ‘నోట్ర డాం’ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజిస్టులు ఒక పరిశోధనను చేపట్టారు. ఓ 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటి పిల్లల్ని పెంచే తీరులో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ మార్పులు వారి వ్యక్తిత్వం మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? అని తెలుసుకోవడమే ఈ పరిశోధన లక్ష్యం. ఈ పరిశీలనలో గమనించిన కొన్ని ముఖ్యమైన మార్పులు ఇవీ...   - పిల్లల్ని ఎత్తుకుని కాకుండా ఏదో ఒక చోట వారిని ఒంటరిగా వదిలివేయడం జరుగుతోంది. ఊయలలోనో, కారుసీట్ల మీదో, స్ట్రాలీల (strolley) మీదో పిల్లల్ని గంటల తరబడి ఉంచేస్తున్నారు. ఒకవేళ తమతో పాటు తీసుకువెళ్లినా కూడా ‘బేబీ కేరియర్ల’ సాయంతో వారిని కట్టేసి తీసుకువెళ్తున్నారు.   - అమెరికాలో కేవలం 15 శాతం తల్లులు మాత్రమే తమ పిల్లలకి ఏడాది వచ్చేవరకూ పాలు పట్టిస్తున్నారు. మిగతా వారంతా ‘infant formula’ పేరుతో కృత్రిమమైన ఆహారానికే ప్రాధాన్యతని ఇస్తున్నారు.   - 1970ల కాలంతో పోల్చుకుంటే ఉమ్మడి కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.   - పిల్లలు ఏడ్చిన వెంటనే వారిని బుజ్జగించడం అంత మంచిది కాదన్న అభిప్రాయం బలపడిపోయింది.   అన్నీ పొరపాట్లే.. పైన పేర్కొన్న విధానాలన్నీ కూడా పొరపాటే అంటున్నారు సైకాలజిస్టులు. పిల్లలకు పెద్దల స్పర్శ తగులుతూ ఉండటం, తల్లిపాలను అందించడం, నలుగురైదురు చేతుల్లో పెరగడం, వారు ఏడ్చిన వెంటనే ఎత్తుకుని లాలించడం... వంటి చర్యలన్నీ కూడా వారి మానసిక, శారీరిక వికాసానికి అవసరం అంటున్నారు. పిల్లలు ఏడుస్తున్న వెంటనే వారిని లాలించడం అనేది వారి వివేకం మీద ప్రభావం చూపుతుందట. స్పర్శ, లాలనల వల్ల వారిలో ఒత్తిడి తగ్గి, భావోద్వేగాలను నియంత్రించుకునే నేర్పు అలవడుతుందట. ఇక బందీగా ఉంచకుండా స్వేచ్ఛగా మెలసనివ్వడం వల్ల చొరవ, సామాజిక నైపుణ్యాలు పెంపొందుతాయని చెబుతున్నారు. నలుగురి చేతుల్లో పెరగడం వల్ల విచక్షణ, వినయం, సహానుభూతి ఏర్పడతాయట.   ఫలితాలు అనుభవిస్తున్నాం.. పిల్లల పెంపకంలో ఇలాంటి మానవీయ కోణాలు చెదిరిపోవడం వల్ల ఇప్పటి తరం దూకుడుగా, క్రూరంగా, ఆత్మసాక్షి లేకుండా, జాలిదయ వంటి లక్షణాలను అతీతంగా పెరుగుతున్నారని వాపోతున్నారు. పైగా చిన్నవయసులోనే ఉద్వేగం, క్రుంగుబాటు వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు పరిశోధకులు. మనలోని సహానుభూతి, విచక్షణ, స్వీయనియంత్రణ వంటి లక్షణాలను కుడివైపు ఉన్న మెదడు నియంత్రిస్తుందనీ... అది నిరంతరం మారుతూనే ఉంటుందనీ చెబుతున్నారు. కాబట్టి జీవితంలో ఏ క్షణంలో అయినా సరే తల్లిదండ్రులు తమ పెంపకంలోని లోటుని గమనించి వారితో అనుబంఢాన్ని దృఢపరచుకునే ప్రయత్నం చేస్తే పిల్లవాడిలో అనూహ్యమైన మార్పులు వస్తాయని సూచిస్తున్నారు. - నిర్జర.  
  అది ఓ మారుమూల పల్లెటూర్లోని చిన్న పెంకుటిల్లు. పెద్దగా సంపద లేకపోయినా ఆ ఇంట్లో సంతోషానికి మాత్రం లోటు లేదు. ఓ భార్యాభర్తా, వారికి ఓ కొడుకూ కూతురు... ఇలా నలుగురూ హాయిగా ఆ ఇంట్లో జీవిస్తుండేవారు. వాళ్లు మిగిల్చిన చిన్నా చితకా ఆహారం మీద ఓ ఎలుక బతుకుతూ ఉండేది. ఇలా ఉండగా ఓ రోజు ఆ ఇంటి యజమాని ఏదో కొత్త వస్తువుని తీసుకురావడం ఆ ఎలుక గమనించింది. అదేమిటా అని తన కన్నంలోంచి చూసిన దాని గుండె పగిలిపోయింది. తనని పట్టేసేందుకు యజమాని ఒక బోను తీసుకువచ్చాడు.   ఎలుక లబోదిబోమంటూ పెరట్లోకి పరుగులెత్తింది. ఆ ఇంటి పెరట్లో ఒక కోడి, మేక, పొట్టేలు ఉన్నాయి. ముందుగా కోడి దగ్గరకి వెళ్లి ‘మీ యజమాని నాకోసం ఒక బోను తీసుకువచ్చాడు. అది ఎవరికైనా హాని చేయవచ్చు జాగ్రత్త! వీలైతే దాన్ని నీ కాళ్లతో లాగి అవతల పారేయ్‌,’ అంటూ హెచ్చరించింది ఎలుక.   ఎలుక మాటలకు కోడి నవ్వేస్తూ- ‘నీ కోసం తెచ్చిన బోనుతో నాకు ప్రమాదం ఎలా ఉంటుంది. నేను దాని జోలికే పోను. నువ్వే జాగ్రత్త!’ అంది. అయినా ఎలుక తన పట్టు విడవకుండా పక్కనే ఉన్న మేక, పొట్టేలు దగ్గరకు కూడా వెళ్లి ఇదే హెచ్చరికను చేసింది. కానీ వాటి నుంచి కూడా కోడి చెప్పిన జవాబులాంటి సమాధానమే వినిపించింది.   తన మాటని ఎవ్వరూ వినకపోగా, తనని హేళన చేయడంతో ఎలుక చిన్నబుచ్చుకొని తన కలుగులోకి చేరింది. ఇక మీదట తనే కాస్త జాగ్రత్తగా ఉండేందుకు నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి బోనులో ఏదో పడిన చప్పుడి వినిపించింది. అదేమిటా అని తెలుసుకునేందుకు ఇంటి యజమానురాలు ఆసక్తిగా బయటకి వచ్చింది. అంతే! బోనులో తోక ఇరుక్కుపోయిన ఓ త్రాచుపాము పడగ మీద ఆమె కాలు పడింది. తన తల మీద కాలు పడితే పాము ఎందుకు ఊరుకుంటుంది. వెంటనే యజమానురాలిని ఒక్క కాటు వేసింది.   యజమానురాలి అరుపులు విన్న యజమాని వెంటనే పాముని చావబాది, భార్యని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. వైద్యుడు ఏదో చికిత్స చేసి పంపాడే కానీ, రోజులు గడిచేకొద్దీ యజమానురాలి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. భార్యకు నయమయ్యేందుకు భర్త అన్ని ఉపాయాలూ పాటించడం మొదలుపెట్టాడు. అలా ఎవరో అతనికి కోడిమాంసంతో చేసిన కషాయంతో గుణం కనిపిస్తుందని చెప్పగానే వెంటనే పెరట్లోని కోడిని ఒక్క వేటు వేశాడు.   రోజులు గడిచినా యజమానురాలి ఆరోగ్యంలో ఎలాంటి మార్పూ రాలేదు సరికదా మరింత క్షీణించసాగింది. దాంతో ఆమెను ఆఖరిసారి చూసేందుకు దగ్గరి బంధువులంతా తరలి వచ్చారు. మరి వారందరికీ భోజనం ఎలా! అందుకని ఆ రోజు వారికి ఆహారంగా మేకని బలిచ్చారు. ఇక మరో వారం గడిచేసరికి యజమానురాలు కన్నుమూసింది. ఆమె అంత్యక్రియల కోసమని బంధువులతో పాటుగా వీధివీధంతా కదిలి వచ్చింది. ఆ రోజు వారికి ఆహారంగా పొట్టేలు తల తెగిపడింది. ఇదంతా తన కలుగులోంచి చూస్తున్న ఎలుక మాత్రం బతుకుజీవుడా అనుకుంది.   ‘సంఘంలో బతుకుతున్నప్పుడు, ప్రతి ఒక్కరి సమస్యా ఇతరులని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’ అన్న సూత్రం ఈ కథలో బయటపడుతుంది. కష్టం మనది కాదు కదా! అనుకుని దాన్ని అశ్రద్ధ చేస్తే చివరికి అదే కష్టం మన తలుపు తట్టే రోజు వస్తుంది. అలా కాకుండా తోటివారి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తే, అది మనకి తెలియకుండానే ఏదో లాభాన్ని అందిస్తుంది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  
  తెలంగాణలో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తరపున 19 మంది ఎమ్మ‌ల్యేలు గెలిచారు. అయితే వారిలో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు. దాంతో కాంగ్రెస్ బ‌లం 7కు ప‌డిపోయింది. దానికితోడు పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి న‌ల్ల‌గొండ ఎంపీగా గెలుపొంద‌డంతో ఇటీవ‌ల త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బలం 7 కాస్తా 6కు ప‌డిపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కాంగ్రెస్ కి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను తొలిగిస్తూ స్పీక‌ర్ కార్యాల‌యం మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌తి ప‌క్ష హోదా నుంచి కాంగ్రెస్ పేరును తొలిగిస్తూనే.. సీఎల్పీ నేత‌గా వున్న భ‌ట్టి విక్ర‌మార్క పేరును కూడా తొలిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ వ‌ర్గాల‌కు అసెంబ్లీలో ఘోర అవ‌మానం జ‌రిగిన‌ట్ల‌యింది. మంగ‌ళ‌వారం ఇచ్చిన ఉత్త‌ర్వులు స్పీక‌ర్ ఆమోదం తెల‌ప‌డంతో బుధ‌వారం మీడియాకు విడుద‌ల చేశారు. దీంతో కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్ పై, అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడం చెల్ల‌దంటూ కాంగ్రెస్ ఇటీవ‌ల హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. వివాదం కోర్టులో వుండ‌గా ఇలా ఎలా ఉత్త‌ర్వులు జారీ చేస్తార‌ని స్పీక‌ర్ పై కాంగ్రెస్ నేత‌లు మండిపడుతున్నారు.
ఏపీలో రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ప్రతి నిముషానికి ఒక్కో అప్డేట్ వస్తూ రకరకాలగా టెన్షన్ పెడుతున్నాయి. ఇక తాజాగా విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన చంద్రబాబు వెంటనే సమీక్షలు మొదలు పెట్టారు. తాజా రాజకీయపరిణామాల మీద అందుబాటులో ఉన్న నేతలతో చర్చిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలోప్రజావేదిక కూల్చివేత, ఎంపీలు బీజేపీలో చేరడంతో పాటూ పలు కీలక అంశాలపై నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా చంద్రబాబు నివాసం మార్పు విషయం మీద చర్చ జరిగిందట. తాను నివాసం ఉంటున్న భవనం కూడా కూల్చివేత వరకూ వస్తుందని దీంతో ఏమి చేయాలనే అంశంపై నేతలతో చర్చించారట. అయితే ఈ సమావేశానికి కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలు అందరూ డుమ్మా కొట్టారు. అయితే నిజానికి చంద్రబాబు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం ఏర్పాటు చేసినా పొరుగునే విజయవాడలో నివాసం ఉండే కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఈ భేటీకి దూరంగా ఉన్నారు. నిజానికి మామూలుగా ఇప్పుడు రాకుండా ఉండి ఉంటే పెద్దగా ఏమీ అనిపించి ఉండేది కాదేమో కానీ బాబు విదేశీ పర్యటనకు వెళ్తే అదే సమయంలో కాకినాడలో టీడీపీ కాపు నేతలు సమావేశం కావడం, అదే రోజు నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంతో ఈ కాపు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే చర్చ జరిగింది. కానీ తాము పార్టీ మారేది లేదని నేతలు బొండా ఉమా క్లారిటీ ఇచ్చారు. కానీ నిన్న చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న సమయంలో కూడా కృష్ణా జిల్లా నేతలు దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, గద్దే రామ్మోహన్, దేవినేని అవినాష్, బచ్చుల అర్జునుడు లాంటి వాళ్ళు వెళ్లారు. కానీ బోండా ఉమా మాత్రం అక్కడ కనిపించ లేదు. దీంతో ఆరోజు కాపు భేటీలో ఉన్న వారంతా పార్టీ మారతారు అనే ప్రచారం ఊపందుకుంది.
ఏపీ రాజకీయాలు అంతా ప్రజావేదిక చుట్టూ తిరుగుతున్నాయి. ప్రజా ధనం అని చూడకుండా అక్రమ నిర్మాణం పేరుతో జగన్ దానిని కూలగొట్టించారు. ఈ నేపధ్యంలో అది తప్పని టీడీపీ వారు, మేధావులు పేర్కొంటుంటే లేదు ఉన్న మిగతా కట్టడాలను కూడా కూల్చివేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే నిన్నటి దాకా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నిన్న రాత్రి పొద్దుపోయాక విజయవాడ చేరుకున్నారు. ఈరోజు ఉదయాన్నే టీడీపీ నేతలు అందరూ తన ఇంటిలో జరిగే సమావేశాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీంతో దాదాపు చాలా మంది నాయకులు ఆయన సమావేశానికి హాజరయ్యారు. వీరిలో ముఖ్యంగా మొన్న కాకినాడలో మీటింగ్ పెట్టిన కాపు నేతలు అందరూ డుమ్మా కొట్టగా, కృష్ణా జిల్లాలో గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరయిన వంశీ కూడా డుమ్మా కొట్టడం చర్చలకు దారి తీస్తోంది. ఆయన కూడా పార్టీ వీడి కాషాయం కండువా కప్పుకోనున్నాడని, స్వయంగా సుజనా చౌదరి రంగంలోకి దిగి చేరికలను పర్యవేక్షిస్తున్నారని ప్రచారం మొదలయ్యింది. అయితే ఇందులో నిజం ఎంతో తెలీదు కానీ ఈ విషయం గట్టిగా ట్రెండ్ అయ్యింది. ఈయనకి సినిమా ఇండస్ట్రీతో సంబందాలు ఉండడం. ఈయన స్వయానా నిర్మాత కావడమే కాక జూనియర్ ఎన్టీఆర్ కి సన్నిహితుడు కావడంతో ఈ వార్త కాస్త గట్టిగానే ప్రచారం అయ్యింది. దీంతో ఆయన స్పందించక తప్పలేదు. ఆయన తాజాగా మాట్లాడుతూ  తనతో సుజనా చౌదరి మాట్లాడలేదని, బీజేపీలో చేరుతున్నాననే ప్రచారం నిజం కాదని అన్నారు.    
శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ముందు వరుసలో ఉంటాయి. శరీరంలోని మలినాలను తొలగించడానికి, ఎలక్ట్రొలైట్స్ ను సమన్వయం చేయడానికి, రక్తపోటును నియంత్రించడానికి, ఎర్ర రక్తకణాల సంఖ్యను మెరుగుపర్చడానికి... ఇలా ఎన్నో సక్రమంగా జరగడానికి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. అలాంటిది వాటికేదైనా సమస్య వస్తే? ఎంత కష్టమో కదా? అయితే కాస్త జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనిస్తే... సమస్య ముదిరిపోకముందే కిడ్నీలను కాపాడుకోవచ్చు.   రక్తహీనత గానీ ఏర్పడిందంటే ఓసారి కిడ్నీల గురించి ఆలోచించాల్సిందే. ఎందుకంటే కిడ్నీలు ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగేలా చేసే ఎరిత్రోపొయిటిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తాయి. అది సరిగ్గా విడుదల కాక ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయి ఎనీమియా వచ్చిందంటే కిడ్నీల పని తీరు సరిగ్గా లేకపోవచ్చు. రక్తహీనత తీవ్రమైతే మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందక బద్దకం, దేనిమీదా శ్రద్ధ పెట్టలేకపోవడం, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు కనిపించినా కిడ్నీల మీద ఓ కన్నేయాల్సిందే. ఒకవేళ కిడ్నీల చుట్టుపక్కల నొప్పిగా ఉంటే కిడ్నీలో రాళ్లుగానీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గానీ ఉన్నట్టు లెక్క. ఆకలి తగ్గిపోయినా, ఏదైనా తిన్నప్పుడు ఆ రుచి ఏదైనా లోహం నోటిలో పెట్టుకున్నట్టుగా అనిపించినా అది కిడ్నీల పనితీరు దెబ్బతిని రక్తంలోమలినాలు పెరిగిపోయాయనడానికి సూచన.   తరచుగా ర్యాషెస్, దురద, మంట వంటివి వస్తున్నా గమనించుకోవాలి. రక్తంలో మలినాలు పెరిగిపోతే చర్మం పొడిబారిపోయి ఇలాంటివి వస్తాయి. ముఖం, మోకాళ్లు, కీళ్లు ఉబ్బిపోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో హెచ్చుతగ్గులు కూడా సూచనలే. ఇక  ముఖ్యంగా మూత్ర సంబంధిత సమస్యలు. తరచూ మూత్రం రావడం, లేదంటే రావాల్సినంత రాకపోవడం, మూత్రంలో మంట, నొప్పి, రంగు మారడం, నురగతో కూడిన మూత్రం... ఇవన్నీ కూడా కిడ్నీ పనితీరు దెబ్బ తిన్నదని చెప్పకనే చెబుతాయి. కాబట్టి వీటిలో ఏ లక్షణాలు కనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకండి. వెంటనే వైద్యుణ్ని సంప్రదించండి.  
  The nosebleed or also known as epistaxis is the bleeding from the nose, and in severe case it may present as bleeding from the eyes or even mouth. The nosebleeds are rarely life-threatening, they are spontaneous and self-limiting, and however recurrent ones can be a reason for concern. Epistaxis can be divided into 2 categories, based on the site of bleeding as, anterior bleeds and posterior bleeds.    Most of the nosebleeds are anterior epistaxis, which occurs from the Little’s area, wherein the External and internal carotid arteries anastomose, thus the bleeds are constant ooze rather than pulsatile bleed. Posterior bleed arise further back in the nasal cavity, are usually more profuse, and are often of arterial origin, and are even more dangerous than the anterior nosebleeds. The most probable cause of nosebleed is the mucosa is eroded by cold and dry climate, exposing and subsequently rupturing the blood vessels.   Local trauma is the most common cause, followed by facial trauma, foreign bodies, nasal or sinus infections, and prolonged inhalation of dry air. Children usually present with epistaxis due to local irritation or recent upper respiratory infection. While, the systemic causes include; blood dyscrasias, arteriosclerosis, hereditary hemorrhagic telangiectasia, drug abuse and idiopathic causes. The peak incidence is seen among the children of 2-10 years mostly due to self-inflicted local trauma, and also in elderly 50-80 years due to systemic and cancerous growths.    The management includes, first calm down the patient, then apply direct pressure over the soft and fleshy part of the nose hold it from about 5minutes and up to 20minutes, never hold your head back instead tilt it forward which helps decreasing the chances of nausea and airway obstruction. The nosebleed that do not subside within 20minutes require medical attention, this involves local application of vasoconstrictor or the use of silver nitrate to cauterize bleeding blood vessels. Rarely might require surgical ligation of the blood vessels. -Koya Satyasri
ధనియాల మొక్కలే ఈ కొత్తిమీర. మంచి సువావన కలిగి ఉంటుంది. వంటకాలలో విరివిగా వాడతారు. కొత్తిమీరతో పచ్చడి కూడా చేస్తారు. దీని శాస్త్రీయ నామము " Coriandrum sativum ". ఆహార పదార్దాల మీద అలంకరించుకోవడానికని భావిస్తే పొరపాటే. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు,కాయగూరల వంటకాలలో విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమిర నిండా విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి . అంతేకాదు సమృద్ధి గా ఐరన్ కుడా లభిస్తుంది .కొత్తిమిర రక్తహీనతను తగ్గిస్తుంది. పొగతాగడం,కేమోతెరఫి వల్ల కలిగే నష్టము తగ్గించడానికి పోరాడుతుంది.. కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది.రక్తనాళాలలో ఆటంకాలను తొలగిస్తుంది.   దీనిని కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా కొత్తిమీరను ఔషధంగా కూడా వాడవచ్చు. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ సుగంధ తత్వాలూ, ఔషధ తత్వాలూ అనేకం ఉంటాయి. ఈమధ్య జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర ఫుడ్ పాయిజనింగ్‌లో అత్యంత ప్రయోజనకారిగా పనిచేస్తుందని తేలింది. తాజాగా సేకరించిన కొత్తిమీరలో డుడిసినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆహారాన్ని విషతుల్యం చేసే సాల్మనెల్లా బ్యాక్టీరియాని నిర్వీర్యపరుస్తుందని గమనించారు. కొసమెరుపేమిటంటే, సాధారణంగా ఫుడ్ పాయినింగ్‌లో జెంటామైసిన్ వాడుతుంటారు. అయితే దీనికన్నా కొత్తిమీర ప్రభావవంతంగా, సురక్షితంగా పనిచేసినట్లు రుజువయ్యింది. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర కార్మినేటివ్‌గా (గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది. అలాగే రిఫ్రిరెంట్‌గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్‌గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్‌గా (లైంగిక శక్తిని పెంచేదిగా), యాంటీ స్పాస్‌మోడిక్‌గా (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా), హైపోగ్లైసీమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా) పనిచేస్తుందని తేలింది. కొత్తిమీర ఆకుల స్వరసాన్ని ఔషధంగా వాడుకోదలిస్తే 10మి.లీ. (రెండు టీస్పూన్లు) మోతాదులో వాడాలి.కొత్తిమీర ఆమాశయాన్ని శక్తివంతం చేయటమే కాకుండా దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదరంలో చేరిన గ్యాస్‌ని తగ్గించటంతోపాటు మూత్రాన్ని చేయటం, జ్వరాన్ని తగ్గించటం చేస్తుంది. అలాగే శృంగారానురక్తిని పెంచటం, శ్వాసనాళికల్లో సంచితమైన కఫాన్ని కరిగించి వెలుపలకు వచ్చేలాచేయటం వంటి పనులను కూడా చేస్తుంది. ఉదర కండరాలు పట్టేసి నొప్పిని కలిగిస్తున్నప్పుడు ఉపశమనాన్ని కలిగిస్తుంది.   కొత్తిమీర రసం విటమిన్-ఎ, బి1, బి2, సి, ఐరన్ లోపాల్లో హితకరంగా ఉంటుంది. గృహ చికిత్సలు అజీర్ణం, వికారం, శరీరంలో మంటలు తాజా కొత్తిమీర రసం అజీర్ణం, వికారం, ఆర్శమొలలు, బంక విరేచనాలు, హెపటైటిస్, అల్సరేటివ్ కోలైటిస్(పెద్ద పేగులో వ్రణం తయారుకావటం) వంటి వ్యాధుల్లో హితకరంగా పనిచేస్తుంది. జీర్ణక్రియా సమస్యల్లో కొత్తిమీర రసాన్ని(10-20 మి.లీ) 1 గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకోవాలి. నోటి పూత, నోటి దుర్వాసన, చిగుళ్లవాపు, చిగుళ్లనుంచి రక్తం కారటం. కొత్తిమీర ఆకులను నమిలి మింగుతుంటే నోటికి సంబంధించిన సమస్యల్లో ఉపయుక్తంగా ఉంటుంది. దంతాలు దెబ్బతినకుండా ఉంటాయి. కొత్తిమీర రసానికి లవంగ మొగ్గల పొడి కలిపి వాడితే మరింత హితకరంగా ఉంటుంది.  మొటిమలు, మంగు మచ్చలు చర్మంమీద నల్లని మచ్చలు, పొడి చర్మం, పెద్దసైజు మొటిమలు వంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు చెంచాడు కొత్తిమీర రసానికి చిటికెడు పసుపు చేర్చి కలిపి బాహ్యంగా ప్రయోగించాలి. దీని ప్రయోగానికి ముందు ముఖాన్ని బాగా శుభ్రపరుచుకోవటం అవసరం. దీనిని ప్రతిరోజూ రాత్రి నిద్రకుముందు ప్రయోగిస్తే కొద్దిరోజుల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది. ముక్కునుంచి రక్తం కారటం, ముక్కులో కొయ్యగండలు పెరగటం (పాలిప్స్) 20గ్రాముల కొత్తిమీర ఆకులకు చిటికెడు పచ్చకర్పూరం పలుకులు కలిపి ముద్దగా నూరి రసం పిండి రెండుముక్కు రంధ్రాలలోనూ రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి. అలాగే కొద్దిగా రసాన్ని తలకు కూడా రాసుకోవాలి. దీంతో ముక్కునుంచి జరిగి రక్తస్రావం ఆగుతుంది.   ముక్కులో పాలిప్స్ పెరిగిన సందర్భాల్లోకూడా ఇది హితకరంగా ఉంటుంది. నొప్పి, వాపు 20 మిల్లీలీటర్ల కొత్తిమీర రసానికి 10 మిల్లీలీటర్ల వెనిగర్‌ని కలిపి రాసుకుంటే నొప్పి, వాపులనుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్శమొలలు కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి ఎర్రగా వేయించిన ఎర్రమట్టికి కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే మొలలు ఎండిపోయి నొప్పి, దురదలనుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంనుంచి రక్తస్రావమవటం తాజాగా కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి, రసం పిండి, పంచదార కలుపుకొని తాగితే బహిష్టుస్రావం ఎక్కువగా కావటం, ఆర్శమొలలనుంచి రక్తం కారటం వంటి సమస్యలు తగ్గుతాయి. విటమిన్ల లోపం కొత్తిమీరను చట్నీగా చేసుకొని తినాలి. లేదా ప్రతిరోజూ రాత్రి నిద్రకు ముందు తాజాగా తీసిన కొత్తిమీర రసానికి చెంచాడు తేనె కలుపుకొని తాగుతుండాలి. దీనిని క్రమంతప్పకుండా తీసుకుంటే విటమిన్-ఏ, విటమిన్-బి1, విటమిన్-బి6, విటమిన్-సి, లోహం వంటి పదార్థాల లోపం ఏర్పడకుండా ఉంటుంది. ఈ ఆహార చికిత్స క్షయవ్యాధి, ఉబ్బసం, ఎలర్జీలు, మెదడు బలహీనత, కళ్ల బలహీనత వంటి సమస్యల్లో బాగా పనిచేస్తుంది. అమ్మవారు (స్మాల్‌పాక్స్) కొత్తిమీర రసాన్ని తాజాగా తీసి, చెంచాడు రసానికి ఒకటి రెండు అరటి ‘గింజలు’ పొడిని కలిపి రోజుకు ఒకసారి చొప్పున వారంపాటు తీసుకుంటే స్మాల్‌పాక్స్ వంటి పిడకమయ వ్యాధుల్లో నివారణగా సహాయపడుతుంది. స్మాల్‌పాక్స్ వ్యాధి తీవ్రావస్థలో ఉన్నప్పుడు కొత్తిమీర రసాన్ని పరిశుభ్రమైన పద్ధతులతో తీసి, రెండు కళ్లలోనూ చుక్కలుగా వేసుకుంటే కళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. తలనొప్పి, మైగ్రెయిన్ కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి కణతలకు, నుదుటికి పూసుకుంటే తలనొప్పి, ఒంటి కణత నొప్పి వంటివి తగ్గుతాయి.  కళ్లమంటలు, కళ్లకలక కొత్తిమీర ఆకులను తాజాగా తెచ్చి, బాగా కడిగి, ముద్దగా నూరి, రసం పిండి, చనుబాలతో కలిపి కళ్లల్లో బిందువులుగా వేసుకుంటే కళ్లమంటలు, కనురెప్పలు అంటుకుపోవటం, కళ్లుమెరమెరలాడటం, కళ్లకలక వంటి సమస్యలు తగ్గుతాయి. నొప్పితో కూడిన వాపులు కొత్తిమీర ఆకులను, బాదం పలుకులతో ముద్దగా నూరి వాపు, నొప్పి ఉన్నచోట పట్టుగా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. దద్దుర్లు కొత్తిమీర ఆకుల రసానికి తగినంత తేనెనూ బాదాం నూనెనూ కలిపి దద్దురు తయారైనచోట పైకి రాసుకోవాలి. అలాగే పంచదార కలిపి లోపలకు తీసుకోవాలి. విష పురుగులు కుడితే కొత్తిమీర ఆకులను ముద్దగా నూరి బాదం పలుకులనూ, పెసర పిండినీ కలిపి స్థానికంగా ప్రయోగిస్తే విషపురుగులు కరిచినచోట తయారైన నొప్పి,  వాపులు తగ్గుతాయి.  కొత్తిమీర ఆకుల రసానికి కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే మంటలు తగ్గుతాయి. స్మాల్‌పాక్స్ (బృహన్మసూరిక) తాజా కొత్తిమీర రసం స్మాల్‌పాక్స్‌లో నివారణగా పనికి వస్తుంది. దీనిని ఒక చెంచాడు మోతాదులో అరటి పండుతో కలిపి ఏడు రోజులపాటు తీసుకోవాలి. స్మాల్‌పాక్స్‌లో నేత్రాలు దెబ్బతినకుండా కొత్తిమీర రసాన్ని కళ్లలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. ధనియాల మొక్కను మనం కొత్తిమీరగా పిలుస్తాము. దీనికి ధనియాల గుణాలన్నీ ఉంటాయి. సాధారణంగా కొత్తిమీరను సువాసనకోసం వంటల్లో వాడుతుంటారు. లేత మొక్కని మొత్తంగా రోటి చట్నీలకోసం వాడుతుంటారు. కొత్తిమీర ఆకులను సూప్స్,  కూరల వంటి వాటికి చేర్చుతుంటారు.   పెదవులు నల్లగా ఉన్నవారు రోజూ రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసం పెదవులపై రాయండి. కొన్ని రోజులకి పెదాలు లేత రంగును సంతరించుకొంటాయి... ఏదైనా కూర వండేటపుడు కాకుండా చివరలో అంటే దించివేసే ముందు వేస్తేనే కూరకు మంచి సువాసన వస్తుంది. కొత్తిమీర త్వరగా వాడిపోకుండా ఉండాలంటే ఓ గ్లాసులో నీరు పోసి వాటి వేర్లు మునిగేటట్లు ఉంచండి. మీ ఇంటి వెనుక కాస్త స్థలం ఉందా?  ఉంటే కాసిన్ని ధనియాలు చల్లి నీరు చిలకరించండి కొత్తిమీర వస్తుంది. ఒకవేళ స్థలం లేకపోయినా పూలకొండీలలో చల్లినా చాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.