రాంగోపాల్ వర్మ రిటర్న్స్
posted on Sep 30, 2015 1:14PM
దర్శకుడు రాంగోపాల్ వర్మ తీరు చూస్తుంటే పనిలేని మంగలాడు పిల్లి బుర్ర గోరిగాడనే పాతకాలం సామెత ఒకటి గుర్తుకు వస్తోంది. రాజమౌళి, కోట్ల శివ వంటి ఆయన తోటి దర్శకులు అద్బుతమయిన సినిమాలు తీసి తమ సత్తా చాటుకొని ప్రజాధారణ పొందుతుంటే, రాంగోపాల్ వర్మ మాత్రం వారితో పోటీపడి సినిమాలు తీయలేక, వారు తీస్తున్న సినిమాల గురించి, వారి అభిమానుల గురించి, చిరంజీవి 150వ సినిమా గురించి ట్వీటర్ మెసేజులు పెడుతూ ప్రజలను ఆకట్టుకోవాలని ఆపసోపాలు పడుతున్నారు.
బాహుబలి కంటే గొప్ప సినిమా తీయకపోతే చిరంజీవి స్థాయికి తగదని, పూరీ జగన్నాద్ తో సినిమా తీయడం కంటే రాజమౌళితోనే చిరంజీవి సినిమా చేయడం మంచిదని ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు వేసిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ట్వీటర్ మెసేజులు పెట్టారు.
ట్వీటర్లో మహేష్ బాబు కంటే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కి తక్కువ ఫాలోయర్లు ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసారు. మహేష్ బాబు కంటే పవన్ కళ్యాణ్ ఆలశ్యంగా ట్వీటర్లో ప్రవేశించడం వలననే బహుశః ఆయనకి తక్కువ ఫాలోయింగ్ ఉండి ఉండ వచ్చనుకొన్నా ఆయన వంటి ఒక సూపర్ స్టార్ ఒకసారి ట్వీటర్లో ప్రవేశించగానే అమాంతం ఫాలోయర్ల సంఖ్య పెరగాలి. కానీ హీరోయిన్ సమంతకి ఉన్నంత ఫాలోయింగ్ కూడా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కి లేకపోవడంపై ఆశ్చర్యం కలిగిస్తోందని మెసేజ్ పెట్టారు. దీనికి గల కారణాల గురించి రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విశ్లేషిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులలో ఎక్కువ మందికి ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలను ఏవిధంగా ఉపయోగించాలో తెలియనందునే ఆయనను ట్వీటర్లో ఫాలో కాలేకపోతున్నారని, కనుక వారు ఒకరికొకరు సహకరించుకొని సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కి అంత తక్కువ ఫాలోయింగ్ ఉండటం ఆయన అభిమానిగా తనకు చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. “నేను పవన్ కళ్యాణ్ నటన, డ్యాన్సులని చాలా ఇష్టపడతాను. కాని ఆయన రాజకీయాలను కాదు,” అని వర్మ తన మేసేజులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తన ట్వీటర్ పేజిలో రైతుల సమస్యల గురించి ఎక్కువగా మెసేజులు పెడుతుంటారని అందుకే తను కూడా ఆయనని ఫాలో చేయడం లేదని వర్మ తెలిపారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయదలచుకొంటున్నారు కనుక ముందుగా ట్వీటర్లో తన అభిమానుల సంఖ్య పెంచుకోవాలని వర్మ సూచించారు.
పవన్ కళ్యాణ్ ట్వీటర్లోకి చాలా ఆలస్యంగా ప్రవేశించారని రాంగోపాల్ వర్మే చెపుతున్నారు. ట్వీటర్లో ఆయన తన సినిమాల గురించి కాకుండా రాజకీయాలు, రైతు సమస్యల గురించి మాత్రమే మెసేజులు పోస్ట్ చేస్తున్నారని అందుకే తను కూడా ఆయన్ని ఫాలో అవడం లేదని చెప్పారు. అటువంటప్పుడు మళ్ళీ ఈ వెర్రిమొర్రి ప్రశ్నలు, సలహాలు ఎందుకు ఇస్తున్నట్లు?
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫాలోయర్ల గురించి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా చాలా అవివేకంగా ఉన్నాయి. మహేష్ బాబు ఎప్పటికప్పుడు తన ట్వీటర్ పేజీని తన సినిమా విశేషాల గురించి, ఇతర సినిమాల కబుర్లతో అప్ డేట్ చేస్తుంటారు. కనుక సహజంగానే ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ తన ట్వీటర్ పేజీలో తన సినిమాల గురించి ఒక్క అప్ డేట్ కూడా పెట్టలేదు. కేవలం రాజకీయాలు, రైతుల సమస్యల గురించి మాత్రమే పెడుతుంటారు. అది కూడా ఏ మూడు నాలుగు నెలలకో ఒకసారి. పవన్ కళ్యాణ్ ఆగస్ట్ 28న తన ట్వీటర్ అప్ డేట్ చేసారు. మళ్ళీ అప్పటి నుండి ఇంతవరకు ఒక్క మెసేజ్ కూడా పోస్ట్ చేయలేదు. అసలు యాక్టివ్ గా లేని ట్వీటర్ పేజీని సందర్శించి ప్రయోజనం ఏమిటి? పైగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన సినిమా విశేషాలు వినాలనుకొంటారే తప్ప రాజకీయాల గురించి కాదు. రాజకీయాలపై కూడా ఆసక్తి ఉన్న అభిమానులు ఆయనని ఫాలో అవుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తన ట్వీటర్ పేజిని అప్ డేట్ చేయనప్పుడు వారు మాత్రం ఏమి చేయగలరు?
ప్రపంచంలో చాలా మంది ప్రముఖులకు లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. కానీ దాని వలన పవన్ కళ్యాణ్ కొచ్చే నష్టం ఏమీ లేదు. కానీ రాంగోపాల్ వర్మకి మాత్రం అందులో ఏదో పెద్ద తప్పు కనబడుతోంది ఎందుకో...బహుశః పనిపాటు లేకపోవడం వలననేమో. ప్రజలను ఆకర్షించేందుకు ఈ విధంగా వృధా ప్రయత్నాలు చేస్తూ కాలక్షేపం చేసే బదులు వీలయితే నాలుగు మంచి, గొప్ప సినిమాలు తీసి ఆయన తన సామర్ధ్యం నిరూపించుకొంటే బాగుంటుంది కదా.