మాకెంత... మీకెంత... సింగపూర్ తో చంద్రబాబు బేరాలు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు శరవేగంగా ఏర్పాట్లు జరిగిపోతున్నా, మాస్టర్ డెవలపర్ అయిన సింగపూర్ ప్రభుత్వంతో అగ్రిమెంట్ మాత్రం ఇంకా ప్రోసెస్ లోనే ఉంది, 3వేల ఎకరాల్లో సీడ్ కేపిటల్ నిర్మాణం చేపట్టాలని డిసైడైనా ఏ ఫార్ములా ప్రకారం సింగపూర్ కు వాటిని కట్టబెడతారో తేలలేదు, అయితే ఫైనల్ ఎంవోయూపై ముమ్మర కసరత్తు చేస్తున్న ఏపీ, సింగపూర్ ప్రభుత్వాలు... ప్రాఫిట్ షేరింగ్ ఫార్ములాకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫార్ములా ప్రకారం.. కేపిటల్ నిర్మాణానికి నిధులు వెచ్చించేది సింగపూరే అయినా ఆ తర్వాత వచ్చే లాభాల్లో మాత్రం ఏపీ ప్రభుత్వానికి కూడా వాటా దక్కనుంది.

ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా అంతర్జాతీయ రాజధానిని నిర్మించాలని భావిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు...దానికి ప్రాఫిట్ షేరింగ్ ఫార్ములాని ఎంచుకున్నట్లు తెలుస్తోంది, దీని ప్రకారం రాజధాని నిర్మాణంలో పాలు పంచుకునే కంపెనీలకు భూమిని అలాట్ మెంట్ చేసినా, డెవలప్ మెంట్ హక్కులు మాత్రమే కట్టబెట్టనున్నారు, అందుకోసం అమరావతి డెవలప్ మెంట్ పార్టనర్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి, దాని ద్వారా రాజధాని నిర్మాణం చేపట్టనున్నారు, ఈ కార్ఫొరేషన్లో సింగపూర్, జపాన్ తదితర దేశాలు పార్టనర్స్ గా వ్యవహరించనున్నాయి, అయితే పార్టనర్స్ ఎవరైనా అమరావతి డెవలప్ మెంట్ కార్ఫొరేషన్ ద్వారానే పెట్టుబడులు పెట్టి కేపిటల్ కనెస్ట్రక్షన్లో పాల్గొనాల్సి ఉంటుంది.

ముందుగా అనుకున్న ప్రకారం మాస్టర్ డెవలపర్ అయిన సింగపూర్ ప్రభుత్వ కన్సల్టెంట్ కంపెనీలకు 3000 ఎకరాలను అప్పగించనున్నారు, ఈ ల్యాండ్ లో సింగపూర్ ప్రభుత్వం.... సీడ్ కేపిటల్ ను డెవలప్ చేయనుంది, అయితే 3వేల ఎకరాలను అప్పగించినా యాజమాన్య హక్కులు మాత్రం అమరావతి డెవలప్ మెంట్ పార్టనర్స్ కార్పొరేషన్ చేతిలోనే ఉండనున్నాయి, దీని ప్రకారం పెట్టుబడులు పెట్టేది సింగపూర్ అయినా, జపాన్ అయినా...లాభాల్లో ఏపీ ప్రభుత్వానికి వాటా ఇవ్వాల్సి ఉంటుంది, అది ఎంతనే దానిపైనే కసరత్తు జరుగుతోంది.

 

శంకుస్థాపన కార్యక్రమానికి కంటే ముందే అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటున్న ఇరు ప్రభుత్వాలు.... మీకెంత... మాకెంత అనే లెక్కలు తేల్చుకునే పనిలో ఉన్నాయి, మరో పదిరోజుల్లోపే ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది.