బాబూ రాహుల్... జర భద్రం



రాహుల్ గాంధీ ఈమధ్య భారీ స్థాయిలో రిస్కులు చేస్తున్నారు. తాను జనాల్లో కలిసిపోయే నాయకుడిని అని నిరూపించుకోవడానికి ఆయన పదే పదే ప్రయత్నిస్తున్నారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ ఏ విధంగా సెక్యూరిటీ నిబంధనలను అధిగమించి జనాల్లోకి వెళ్ళేవారో అందరూ చూశారు. చివరికి ఆ జనాల్లో కలసిపోయే తత్వం శ్రీ పెరంబదూరులో ఎలా వికటించిందో కూడా అందరూ చూశారు. అయితే తన తండ్రి అనుభావాల నుంచి పాఠాలను నేర్చుకోని రాహుల్ గాంధీ తన తండ్రిలాగానే జనాల్లో కలసిపోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ జరిగితే సడెన్‌గా జనాల్లోకి వెళ్ళిపోతున్నారు. యుపీఏ అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఓసారి సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌కి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వచ్చి బిర్యానీ తిని వెళ్ళారు. అది ఆయనకు బాగానే వుండొచ్చుగానీ, ఆయన సెక్యూరిటీ బాధ్యతలు చూసేవారికి మాత్రం చెమటలు పడుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత మొన్నీమధ్యే ఎవరికీ చెప్పాపెట్టకుండా, ఎక్కడకి వెళ్తున్నాడో కూడా చెప్పకుండా నెలలకు నెలలు గాయబ్ అయిపోయారు. ఇప్పుడు చేస్తున్న పాదయాత్రల సంగతి సరేసరి. ఇలాంటి రిస్కులు చేయడం అలవాటు అయిపోయిన ఆయన ఇప్పుడు మరో రిస్కు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రిస్కు... ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులతో సమావేశం కావడం.

రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో చచ్చిపోయింది. తెలంగాణలో చిక్కి శల్యమై చావడానికి సిద్ధంగా వుంది. అలాంటి పార్టీకి ప్రాణం పోసే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారట. ఈ సందర్భంగా మా యూనివర్సిటీకి కూడా రండి సర్ అని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఆహ్వానించారట. అంచేత ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి విద్యార్థులను కలిసే ఆలోచనలో వున్నారట. అయితే,  ఉస్మానియాలో చాలా విద్యార్థి సంఘాలు వున్నాయి. కొన్ని సంఘాలు పిలిచాయని వెళ్తే, మిగతా సంఘాలు ఏమంటాయో ఊహించడం చాలా కష్టం. ప్రస్తుతం ఉస్మానియా విద్యార్థులు ఉద్యోగాలు దొరకవన్న నిస్పృహలో వున్నారు. అసలే విద్యార్థులు సున్నిత హృదయం వున్నవారు. రాహుల్ గాంధీ వచ్చి నాలుగు మంచి మాటలు చెబితే చప్పట్లు కొట్టే స్థితిలో ఎంతమాత్రం లేరు. వారివి కల్లాకపటం ఎరుగని మనసులు కాబట్టి ఎలాగైనా రియాక్ట్ అవుతారు. గతంలో అనేకమంది ప్రముఖ నాయకులకు వాళ్ళు దేహశుద్ధి చేస్తే, దేహశుద్ది చేయించుకున్నవాళ్ళు కూడా ఉస్మానియా విద్యార్థుల ఆవేదనను సానుభూతితో అర్థం చేసుకోవడం మినహా ఏమీ చేయలేకపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నటి వరకూ వారి దృష్టిలో ఒక హీరో. అలాంటి హీరోనే ఇంతవరకు ఉస్మానియా  క్యాంపస్‌లోకి వెళ్ళే సాహసం చేయలేదు. మరి ఆ సాహసం రాహుల్ గాంధీకి ఎందుకట?