ఆకాష్ అదరహో



భారత శాస్త్రవేత్తలు రూపొందించిన సరికొత్త క్షిపణి ‘ఆకాష్’. ఆకాష్... పేరు మూడు అక్షరాలు. పేరుకు తగ్గట్టు శత్రు దేశాల వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించగల సత్తా వున్న అస్త్రం. శత్రుదేశాలకు చెందిన విమానాల అతి సూక్ష్మమైన లక్ష్యాలను ఛేదించగలదు. 25 కిలోమీటర్ల దూరంలో వున్న లక్ష్యాన్ని 35 క్షణాల్లో పేల్చేయగలదు. ఒకేసారి నాలుగు లక్ష్యాల మీద ఎనిమిది క్షిపణులను ప్రయోగించవచ్చు. లాంచింగ్ ప్యాడ్ ద్వారా ప్రయోగించడానికి ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించడానికి అనువుగా వుంటే క్షిపణి.  రాడార్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఇన్ని ప్లస్ పాయింట్లు వున్న క్షిపణి మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలకు కూడా లేదు. అంటే ఇప్పుడు మన అమ్ములపొదిలో ఆకాష్ చేరింది కాబట్టి ఈ రెండు దేశాలు అదిరిపోవడం ఖాయం. అయితే మన దేశం ఆత్మ రక్షణ కోసం మాత్రమే ఈ క్షిపణిని తయారు చేసింది కాబట్టి ఆ దేశాలు భయపడాల్సిన అవసరం లేదు.. మనతో జాగ్రత్తగా వుంటే చాలు.

‘ఆకాష్’ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆయుధం. 600 కోట్ల వ్యయంతో, 18 ఏళ్ళ పరిశోధనతో ఈ ఆయుధం రూపకల్పన జరిగింది. దేశంలోని దాదాపు రెండు వందల సంస్థలు ఈ క్షిపణుల తయారీలో భాగస్వాములు అయ్యాయి. దాదాపు 5,500 మంది శాస్త్రవేత్తలు ఆకాష్ క్షిపణిని తయారు చేయడానికి శ్రమించారు. ఇప్పటికి ఎన్నోసార్లు ఈ క్షిపణిని పరీక్షించారు. అన్నిసార్లూ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆకాష్ ఛేదించగలిగింది. మంగళవారం నాడు ఈ క్షిపణిని ఆర్మీకి అందజేసింది. ఆకాష్ లాంటి క్షిపణి మన ఆర్మీ చేతికి చేరింది. ఇక మనం ఎప్పటిలాగే గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు.