ఆయనొక బాబా...టర్నోవర్ రూ.2000 కోట్లు
posted on Nov 30, 2015 10:04AM
పెద్దపెద్ద వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలని పెంచుకొనేందుకు ప్రముఖ సినీ నటులకు కోట్ల రూపాయలు చెల్లించి వారిచేత ప్రచారం చేయించుకొంటాయి. బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకొంటుంటాయి. కానీ అటువంటి హంగూ ఆర్భాటం ఏదీ చేయకుండానే పతంజలి ఆయుర్వేదిక, ఆహార ఉత్పత్తులను దేశమంతా విస్తృతంగా అమ్మకాలు సాగించగలడం విశేషం. దాని యజమాననే దానికి బ్రాండ్ అంబాసిడర్. ఆయనే ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ !
దేశ వ్యాప్తంగా సుమారు 15,000కి పైగా పతంజలి ఆయుర్వేద దుఖాణాలున్నాయి. అయితే అవన్నీ చిన్న చిన్న దుఖాణాలు మాత్రమే. కనుక త్వరలో దక్షిణాదిన సుమారు 2000-3000 చదరపు అడుగుల వైశాల్యం గల పెద్దపెద్ద షాపులను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. వాటిల్లో కేవలం పతంజలి ఉత్పత్తులు మాత్రమే విక్రయిస్తామని తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ ఉత్పత్తులు బిగ్ బజార్, రిలయన్స్ ఫ్రెష్, డీ-మార్ట్ వంటి ప్రముఖ షాపింగ్ మాల్స్ లో కూడా లభ్యం అవుతున్నాయని అయన తెలిపారు. ఇకపై ఆన్ లైన్ అమ్మకాలపై కూడా దృష్టి సారించబోతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే వచ్చే ఏడాది మార్చి నుండి అమెరికా, కెనడా మరియు యు.కె.లకు తమ ఉత్పత్తులను ఎగుమతులు చేసేందుకు ప్రయత్నాలు మొదలయినట్లు తెలిపారు.
గత ఆర్ధిక సంవత్సరంలో రూ.2,000 కోట్ల బిజినాస్ టర్నోవర్ జరిగిందని, దానిని వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ. 5,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోన్నామని బాబా రాందేవ్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలలో మార్కెట్ అవసరాలకు సరిపోయే విధంగా పతంజలి ఉత్పత్తులను అందించేందుకు ఆంధ్రా, కర్నాటక, మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కడో ఒకచోట వచ్చే సం.లో రూ.1000 కోట్లు వ్యయంతో ఒక ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ సంస్థ వర్కింగ్ కేపిటల్ కోసం వివిధ బ్యాంకులు సుమారు రూ.500 కోట్లు అప్పు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేశాయని, అవసరమయితే ఇంకా ఎక్కువ మొత్తం ఇచ్చేందుకు కూడా అంగీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం హరిద్వార్ లో పతంజలి సంస్థ ఒక మెగా ఫుడ్ పార్క్ దిగ్విజయంగా మంచి లాభాలతో నిర్వహిస్తోంది.
ఇంతవరకు ఆయుర్వేద ఔషధాలు, ఆహార, సౌందర్య ఉత్పత్తులపైనే దృష్టి కేంద్రీకరించిన పతంజలి ఆయుర్వేద సంస్థ ఇకపై ఆవు పాలతో పాలపొడి, చాక్లెట్స్ తయారు చేయాలని భావిస్తోంది. అలాగే నాణ్యమయిన పశువుల దాణా, పాల ఉత్పత్తిని వృద్ధి చేసేందుకు పశువుల బ్రీడింగ్ రంగాలలో ప్రవేశించబోతున్నట్లు బాబా రాందేవ్ తెలిపారు. సౌందర్య బ్రాండ్ విభాగంలో మరిన్ని సౌందర్య ఉత్పత్తులు, అలాగే శిశు రక్షణ విభాగంలో పసిపిల్లలకు సంబంధించిన ప్రీమియం ఉత్పత్తులను వచ్చే నెలలో మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
ఆయుర్వేదానికి భారతదేశమే పుట్టినిల్లు అయినప్పటికీ, ఆధునిక వైద్య విధానాల పట్ల ప్రజలకు నమ్మకం పెరిగినందున ఆయుర్వేద వైద్యం, ఆయుర్వేద ఉత్పత్తులు ప్రజల ఆదరణకు నోచుకోలేకపోతున్నాయి. కానీ ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా బాబా రాందేవ్ కి చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ ఎటువంటి ప్రచారార్భాటం లేకుండానే ఇంత అద్భుతంగా తన వ్యాపారాన్ని పెంచుకోవడం విశేషమే. భారతీయులలో ఆయుర్వేదం పట్ల క్రమంగా నమ్మకం పెరుగుతున్నందునే పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తులకి ఇంత ఆదరణ దక్కుతోందా లేకపోతే పతంజలి సంస్థ అనుసరిస్తున్న విన్నూత్నమయిన మార్కెట్ విధానాలే దానికి లాభాలు చేకూర్చి పెడుతున్నాయా? అనే ప్రశ్నకు కార్పోరేట్ కంపెనీలే జవాబు చెప్పాలి.