నాగార్జున ప్రభుత్వస్థలం నొక్కేశాడా

 

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతల దృష్టి ఇప్పుడు టాలివుడ్ హీరో నాగార్జునపై పడింది. అతను మాదాపూర్ వద్దగల 14 ఎకరాల తమ్మిడి చెరువును ఆక్రమించుకొని, దానిని స్వర్గీయ వైయస్సార్ హయంలో రెగ్యులరైజ్ కూడా చేయించుకొని, అక్కడ తన విలాసవంతమయిన ‘యన్. కన్వెన్షన్’ అనే ఒక పెద్ద ఫంక్షన్ హాలును నిర్మించాడని తెదేపా నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. అతను ఆక్రమించుకొన్న చెరువుకు దగ్గరలోనే తన భూములు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.

 

ఆ తరువాత కాంగ్రెస్ నేత కే. కేశవ్ రావు కూడా అవే ఆరోపణలు చేయడం విశేషం. సినిమా ముసుగులో ఒక ల్యాండ్ మాఫియా నగరంలో విస్తరిస్తోందని ఆరోపణలు చేసారు. కానీ, నాగార్జున మాత్రం వారి ఆరోపణలకు ఇంతవరకు సరయిన సమాధానం ఇవ్వకపోగా, వారలా తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్ధం కావడం లేదని మాత్రం అన్నారు. ఇప్పుడు నాగార్జునకు వ్యతిరేఖంగా అవే ఆరోపణలతో లోకాయుక్తలో ఒక పిటిషను కూడా దాఖలయింది. సంబందిత అధికారులను నాలుగు వారాలలోగా ఈ అంశంపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని లోకాయుక్త ఆదేశించింది.

 

యన్.కన్వెన్షన్ యొక్క అధికారిక వెబ్ సైటులో “నగరానికి దూరంగా సహజ సిద్దమయిన ప్రకృతి ఒడిలో టాలివుడ్ నటుడు నాగార్జునకు చెందిన 7ఎకరాల సువిశాలమయిన స్థలంలో ఈ యన్ కన్వెన్షన్ నిర్మింపబడిందని” వ్రాసి ఉంది.