ఒక వీరునికి కడసారి వీడ్కోలు
posted on Oct 16, 2024 11:16AM
2024 అక్టోబర్ 14, హైదరాబాద్. మౌలాలిలోని ఒక పెద్ద అపార్ట్.మెంట్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ అంతా జనాలతో కిటకిటలాడుతోంది. మధ్యాహ్నం 12 దాటుతోంది. జనం వస్తూనే వున్నారు. అల్విదా.. సాయిబాబా అంటున్నారెవరో! ఎర్ర గులాబీల దండల కింద ఒక కవి ఏ కదలికా లేకుండా వున్నాడు. సుత్తికొ డవలితో మెరుస్తున్న ఎర్ర జెండా కింద... రాజీపడని, తలవంచని, భయమెరుగని యోధుడొకడు అచేతనంగా వున్నాడు. ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబా అనే ప్రజల మనిషిని చివరిసారి చూడడం కోసం జనం తోసుకుని వస్తున్నారు. జోహార్ కామ్రేడ్ సాయిబాబా అంటూ నినదిస్తున్నారు. అక్కడంతా ఉద్రిక్తంగా వుంది. ఒక ఉద్వేగం, విషాదం అక్కడ కలిసి ప్రవహిస్తున్నాయి. వందలమంది స్త్రీలు కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. వందలాది మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా అక్కడ తిరుగుతున్నారు. గులాబీ పూల రేకులు తీసి, సాయిబాబా వున్న చల్లని గాజుపేటిక మీద వేసి, పిడికిలి బిగిస్తున్నారు కొందరు. నాయకులు, ఉద్యమకారులు, పేద జనం కోసం పని చేస్తున్న వాళ్లు, కళాకారులు, రచయితలు, కవులు, సంపాదకులు, జర్నలిస్టులు, పబ్లిషర్లు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, సాయిబాబా మిత్రులు, మాజీలు, మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు... ఎందరెందరో.. ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లో అమలాపురంలో పుట్టి, ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేసినాయన కోసం, హైదరాబాద్‌లో ఇంత జనం రావడమేమిటి? సాయిబాబా పీజీ చదువుకున్నది ఇక్కడ... పీహెచ్‌డీ చేసింది యిక్కడే, అంతే కాదు, మిత్రులతో, సామాన్యజనంతో కలుపుగోలుగా వుండే మనిషి. నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ పొందిన ఉత్తమ విద్యార్థి. నిరంతరం చదువుతో, మేల్కొలిపే మాటలతో ఎందరిలోనో జ్ఞాన దీపాలు వెలిగించిన వాడు. నాగపూర్ అండా సెల్‌లో మృత్యు నీడల్లో రోజులు వెళ్ళదీస్తున్న కాలంలో కూడా ఆదీవాసీలైన అక్షరం ముక్క రాని అక్కడి ఖైదీలు కొందరికి సాయిబాబా చదువు చెబితే వాళ్లు డిగ్రీ పరీక్షలు పాసయ్యారు.
అక్రమం, అధర్మం నాలుగు పాదాల మీద నడిచే నేల మీద నిర్భీతి, నిజాయితీ, నిబద్ధతలను మూడు చక్రాల మీద ముందుకు నడిపించిన వాడు సాయిబాబా. దుర్మార్గపు వ్యవస్థల్ని తప్పితే వ్యక్తుల్ని ద్వేషించే మనిషి కాదతను!
అతి సామాన్య జనాన్ని అమితంగా ప్రేమించే మనసు. వాళ్ళ హక్కుల కోసం తెగించి పోరాడే సంకల్పం. అందుకే ఈ రోజు సాయిబాబా కోసం అంతమంది జనం దుఃఖించారు.
ప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్న ఆ దీపాల్లాంటి కళ్ళని దానం చేశాడు. పోరాడి అలసిపోయిన దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజికి యివ్వమని చెప్పాడు.
ఆదివాసులను తరిమివేసి, లేదా అంతం చేసి ఆ కొండలూ, భూములూ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే దుర్మార్గం పేరే 'ఆపరేషన్ గ్రీన్ హంట్.' దానికి వ్యతిరేకంగా పోరాడినందుకే సాయిబాబాకి జీవిత ఖైదు. మోడీ, అమిత్ షా ప్రభుత్వం యిప్పుడు 'ఆపరేషన్ కగార్' అంటోంది. 2026 కల్లా ఆదివాసులనూ, మావోయిస్టులనూ సమూలంగా హతమార్చి, కార్పొరేట్ ఇండియాగా మార్చే పథకం పేరే కగార్. అంటుబుల్ 'అంతిమ యుద్ధం' అని అర్థం. బలహీనులైన నిస్సహాయులైన ఈ దేశ ప్రజల్ని బలి యిచ్చి, కార్పొరేట్లకు కోట్ల డాలర్లు కట్టబెట్టే ఈ అమానుషాన్ని మనందరం వ్యతిరేకించాలని సాయిబాబా గట్టిగా చెప్పారు. ఆచరించి చూపారు.
కలలు కలలుగానే మిగిలిపోయాయి. 3558 రోజులు, అంటే దాదాపు పది సంవత్సరాలు ఇనప వూచల వెనకాల, గోడల మధ్య ఇరుకు గదిలో ఒంటరిగా మిగిలిపోయిన మనిషికి కన్నీళ్ళు తప్ప కలలేముంటాయి? ఒక్కటే ఒక్క కల. ఎప్పటికైనా ఈ నరకం నుంచి బయటపడాలి. వెలుతురు చూడగలగాలి. లేటుగా అయినా ఆ కోర్కె నెరవేరింది. బైటికి రాగలిగాడు. తన కోసం పోరాడి, తపించి, నిరీక్షించిన వసంతకి భర్తగా ఒకింత ఆనందాన్ని యివ్వాలి. ఎమ్మే లిటరేచర్ చేస్తున్న కూతుర్ని యిష్టంగా, కళ్ళ నిండా చూసుకోవాలి, మృతదేహమై కాకుండా, తమ్ముడు రాందేవ్ ఇంటికి వెళ్లి, వాణ్ణి పలకరించి, టీ తాగి రావాలి, రాసి వున్న కవితలన్నీ ఒక చోట చేర్చి పుస్తకం వేయాలి, ఎన్నేళ్ళయిపొయింది! పాత కామ్రేడ్స్ అందర్నీ కలిసి మాట్లాడి కొత్త కార్యాచరణకి సిద్ధం కావాలి.
సుకవి సాయిబాబా కన్న కలలన్నీ పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి మార్చురీ చీకటిలో వూపిరాడక విలవిలలాడి చచ్చిపోయాయి.
కవి వెళ్ళిపోయాడు. కలలు మిగిలిపోయాయి. అదిగో, పాటలు పాడే విమలక్క వచ్చింది. సాయిబాబా మీద అప్పటికప్పుడే కట్టిన పాట అందుకుంది. డప్పులు మొగుతున్నాయి. నలుగురు కోరస్ పాడుతున్నారు. అమరవీరుడి పోరాటాలను గుర్తు చేసుకుంటూ విమల గొంతెత్తి పాడుతున్నారు.
ఒక మంచి ఉపన్యాసకుడు మైక్ అందుకున్నాడు. తెల్లవాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు. నల్లవాడు నిన్ను నక్సలైట్ అన్నాడు... శ్రీశ్రీ గీతం జనానికి వినిపిస్తున్నాడు. వూగరా, వూగరా! నువ్వూగితే శత్రువులకు గాభరా! అన్న శ్రీశ్రీ ఫేమస్ పోయెమ్‌లోని మాటలివి.
అంతిమ వీడ్కోలు:
అందరూ సిద్ధం అవుతున్నారు. వీరుడా జోహార్లు...! అమరుడా... లాల్ సలామ్! గొంతులు విచ్చుకుం టున్నాయి. నినాదాలు నిప్పు రవ్వలై ఎగురుతున్నాయి.
నిజాయితీని ఆయుధంగా ధరించిన మనిషి ఒకడు అక్కడ దీర్ఘ నిద్రలో వున్నాడు. ప్రేమ పూల జలపాతం ఒకటి అక్కడ విశ్రాంతి తీసుకుంటోంది!
అన్ని దిక్కుల నుంచీ, దిగులు నిండిన అందరి హృదయాల నుంచి ఒక భావోద్వేగం తన్నుకువస్తోంది.
కన్నీటి వాన కురవడానికి ఆకాశంలో నల్లమబ్బులన్నీ సమాయత్తమౌతున్నాయి.
అల్విదా.... సాయిబాబా... అల్విదా!
వీరుడా! మానవుడా... అల్విదా!
-తాడి ప్రకాష్