ప్రసాదాల్లో కల్తీలు.. దేవుడికే పంగనామాలు!
posted on Oct 16, 2024 10:20AM
కాదేదీ కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అంటే కొందరు కాంట్రాక్టర్లు మాత్రం కాదేదీ కల్తీకి అనర్హం అంటున్నారు. ఇప్పటి వరకూ ప్రసాదాల తయారీలో కల్తీ లేదన్న భావన భక్తుల్లో ఉండేది. కానీ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలతో ఆ నమ్మకం సైతం ఆవిరైపోయింది. తినే తిండ, పీల్చే గాలీ, తాగే నీరు ఇలా అన్నిటినీ కల్తీకి ఆనవాళ్లుగా మార్చేశారు. దేవుడి ప్రసాదాన్ని కూడా కల్తీ చేయడానికి గుత్తేదార్లు తెగించేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ విషయం దర్యాప్తులో ఉండగానే శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదంలో మోతాదు మించి క్రిమిసంహారకాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచకుండా నిలిపివేశారు. దాదాపు 6.65లక్షల డబ్బాలలో అరవణ అనే అయ్యప్ప ప్రసాదంలో కల్తీ జరిగినట్లు గుర్తించారు. దీనిని ఏడాదిగా వాడకుండా ఉంచారు. దీనిని ఎరువుగా మార్చాలని దేవస్థానం నిర్ణయించింది. గత ఏడాది భక్తులు మాల వేసుకునే సమయంలో ఈ ప్రసాదాన్ని తయారుచేసారు. ప్రసాదంలో వాడే యాలకుల్లో కల్తీ జరిగిందని గుర్తించారు.దాంతో భక్తులకు అమ్మకాలు నిలిపివేసారు. శబరిమల వెళ్లిన భక్తులు డబ్బాల్లో ఉండే అరవణ ప్రసాదం తెచ్చి బంధువులకు స్నేహితులకూ పంచుతారు. ప్రసాదం పారవేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతిం టాయని,దాన్ని ఏమి చేయాలనే విషయంపై ట్రావెన్ కోర్ దేవస్థానం మల్లగుల్లాలు పడి చివరకు ఆ కల్తీ ప్రసాదాన్ని ఎరువుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఆమేరకు టెండర్లు పిలిచి చర్యలు ప్రారంభించింది.
ఇలా దేవుడి ప్రసాదాలను కల్తీ చేయడానికి కొంతమంది పాపపుణ్యాలు మరచి కేవలం ధనార్జనే ధ్యేయంగా అడ్డగొలుగా, ఇష్టారీతిగా తెగించేస్తున్నారు. దేవుని ప్రసాదం అంటే దేవునితో సమానంగా భక్తులు భావిస్తారు. కాని లాభాల కోసం,కమిషన్లకోసం మంచీ చెడులను కాంట్రాక్టర్లు గాలికి వదిలేస్తున్నారు. భక్తులు ఆ పాపానికి దేవుడే శిక్షిస్తాడనీ నమస్కారం పెట్టడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.పెత్తనం చేసే పాలక మండళ్లు ప్రభుత్వాల చేతుల్లో ఉండడం వల్ల చేతకానివిగా తయారయ్యారు. తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్వతంత్ర సిట్ ను దర్యాప్తునకు ఆదేశించింది.
పాత ప్రభుత్వం ఇది ఆరోపణ మాత్రమేనని, ఇది కూటమి ప్రభుత్వ రాజకీయకుట్ర అని ఆరోపిస్తున్నది. కాని ప్రస్తుత ప్రభుత్వం కల్తీ జరిగిందనేది వాస్తవమని చెబుతు న్నది. భక్తుల నుంచి,సిబ్బంది నుంచి వచ్చిన ఆరోపణల మేరకు ప్రభుత్వ ల్యాబ్ పరిక్షలలో కల్తీ జరిగిందనీ, అదీ జంతు కొవ్వు కలిసిందనే నివేదికే ఇందుకు ఆధారమని అంటున్నారు. ఆమేరకు నిజానిజ నిర్ధారణకు సిట్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు దాన్నే మరింత విసృత పరచింది.ఏది ఏమైనా కల్తీలో అదీ నిషేధ పదార్ధాలు కలవడం భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనే కనీస విషయం మరచిన బాధ్యులను గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.