మనిషికి మానసిక ధైర్యం అవసరమెంత?
posted on Aug 29, 2022 9:30AM
అందరి జీవితాలు వడ్డించిన విస్తరి కాదు. ఎంతో కష్టపడాలి. మనం విజయాలు సాధిస్తున్నప్పుడు జీవితం ఎంతో సంతోషదాయకంగా అనిపిస్తుంది. కొందరుంటారు ఎదుటివారు విజయం సాధించగానే, ఉన్నత స్థాయిలోకి వెళ్లారని తెలియగానే అదేదో ఒక్కసారిగా ఆ స్థానానికి వెళ్లిపోయినట్టు ఎంతో ఈసీ అన్నట్టు చెప్పేస్తారు. కానీ ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాల కష్టమే వారి ప్రస్తుత విజయానికి కారణం అనే విషయాన్ని తెలుసుకోరు. అంతేనా గెలిచిన వారి వెంట ఎంతోమంది వెళతారు అదే పరాజయాల బాటలో నడుస్తున్నప్పుడు వెనక వచ్చేవారు ఎవరూ ఎక్కువగా ఉండరు. అలాంటప్పుడు మనుషులు నిరాశకు లోనవుతారు. అలాంటప్పుడు జీవితం విషాదమయంగా బాధల సుడిలో ఉన్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ మనం చేసే పని అద్భుతంగా చేసి తీరాలి.
మనం కష్టాలలో ఉన్నాం కదా అని చేసే పనిలో నిర్లక్ష్యం చూపకూడదు. దీనికి మానసిక ధైర్యం కావాలి. ప్రపంచంలో మనం ఏం కోల్పోయినా ఫర్వాలేదు. కానీ మానసిక ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. మానసిక ధైర్యమే మనకు దీర్ఘకాలిక విజయాలను చేకూర్చి పెడుతుంది. మానసిక ధైర్యం అంటే సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎంతో తెలివిగా అర్థం చేసుకోవడం,సమస్య ఏమిటో గుర్తించడం, సమస్య అర్థమయ్యాక దానికి పరిష్కారాన్ని వెతకడం, ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వవచ్చు, ఎన్నో నొచ్చుకునే విషయాలు భరించాల్సి రావచ్చు. కానీ వాటన్నిటినీ భరించాలి. అలా బాధలను ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని పెంచుకోవాలి. చేసే పనులలో ఎన్నో ఒడిదుడుకులు, అవరోధాలు ఉన్నప్పుడే అప్పుడే మానసిక ధైర్యం అవసరం అవుతుంది. అలాంటప్పుడు మానసిక ధైర్యం ఎంత గొప్పదో, అది మనిషిని ఎలా నిలబెడుతుందో, మనిషి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో అర్థమవుతుంది.
బాధల్ని, కష్టాల్ని, ఆర్థిక సమస్యలనూ అధిగమించడానికి మనం చేయాలనుకునే పనులను ఉన్నతంగా చేయడానికే ప్రయత్నించాలి. వీటి ఫలితం నూటికి నూరు శాతం వ్యతిరేకంగా వచ్చినా ధైర్యాన్ని సడలిపోనివ్వకూడదు. లక్ష్యం వైపుగానే అడుగులు వేయాలి తప్ప బేరువుగా పారిపోకూడదు. కంఫర్ట్ బుల్ జోన్ నుంచి బయటికి వచ్చినా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. కంఫర్ట్ జోన్ అంటే ఎప్పుడూ సమస్యలు రాకుండా సుఖంగా గడిచిపోవడం. అలాంటి సుఖం మనిషికి మంచిది కాదు. భవిష్యత్తులో ఎన్నో కష్టాలు తెచ్చిపెడుతుంది, కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వలేదు.
ప్రేక్షకుడి స్థాయి నుంచి ఫెర్ ఫార్మెన్స్ స్థాయికి ఎదగాలి. చప్పట్లు కొట్టే దశ నుంచి చప్పట్లు కొట్టించుకునే దశకి ఎదగాలి. అది మనిషిలో రావలసిన మార్పు. మనిషి ఒకే సర్కిల్ లో ఉండిపోతే అలా ఎదగడం ఎప్పటికీ సాధ్యం కాదు. మన మానసిక ధైర్యమే మనకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కలిగిస్తుంది. మనం ఓటమిలో ఉన్నప్పుడు మన శత్రువుల మాటలకు, విమర్శలకు మౌనంగానే సమాధానం చెప్పాలి. ఇతరులు మన శక్తి సామర్ధ్యాలను శంకిస్తున్నప్పుడు, అనుమానిస్తున్నప్పుడు నిశ్శబ్ధంగానే రెట్టింపు పనిచేసి మనల్ని మనం ఋజువు చేసుకోవాలి.
పరాజయాలలో ఉన్నప్పుడు మన పరాజయాలకు కారణాలుగా ఇతరులను నిందించవద్దు. సహనంతో వేచి ఉండాలి. మన చేతకానితనానికి ఇతరులను నిందించకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచం, ఈ భూమి మనదే. ఇక్కడ దొరికే ప్రతి అవకాశం మనదే. మనం ఉపయోగించుకోవాలి. మనమే భూమి పుత్రులం. అవకాశాలకు జాతి, మత, కుల, ప్రాంతాలు లేవు. భయం మన గుండెల్లో గూడు కట్టుకుంటే ఏ పనీ సక్రమంగా చేయలేము. భయం మనల్ని తన గుప్పిట్లోకి తీసుకోకుండా జాగ్రత్తపడాలి. భయాన్ని అధిగమించాలి. భయాన్ని అధిగమించడానికి భౌతికంగా శారీరకంగా మానసికంగా రెండు విధాలుగా సంసిద్ధులు కావాలి. అప్పుడే మానసిక ధైర్యం మనల్ని విడిచిపోదు, అది మనతో ఉంటే మనం ఏదైనా సాధించగలం.
◆నిశ్శబ్ద.