యేసుక్రీస్తు జన్మ దినం.. ప్రేమ, ఆనందం, శాంతి మార్గం.. క్రిస్మస్ వేడుక..!

 

ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రోజూ ఏదో మూలన  ఏదో పండగనో, ఉత్సవమో జరుగుతూనే ఉంటుంది.  భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే మన భారతదేశంలో అయితే వీటికి అస్సలు లోటు ఉండదు.  ఒక వైపు హిందూ దేవుళ్ల పూజలు,  ముస్లిం సోదరుల నమాజ్ లు,  క్రిస్టియన్ సోదరుల ప్రార్థనలతో దేశం బోలెడు సంస్కృతులు,  సంప్రదాయాలతో అలరారుతుంది. అయితే హిందువులకు ఉన్నన్ని పండుగలు ముస్లిం లకు,  క్రిస్టియన్స్ కు ఉండవనే విషయం అందరికీ తెలిసిందే.. క్రిస్టియన్స్ ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో క్రిస్మస్ ప్రధానమైనది. ప్రతి పండుగ ఏదో ఒక సందేశాన్ని ప్రజలకు అందించినట్టే క్రిస్మస్ కూడా ప్రపంచానికి సందేశాన్ని ఇస్తుంది.


యేసు క్రీస్తు జననంమే క్రిస్మస్ పండుగకు ఆధారం. క్రీస్తు జన్మించిన తేదీని ఖచ్చితంగా గుర్తించలేకపోయినప్పటికీ డిసెంబర్ 25న క్రిస్మస్ జరపడం 4వ శతాబ్దం నుండి ప్రారంభమైంది. రోమన్ సామ్రాజ్యంలో పాగన్ పండుగ అయిన "సోలిస్ ఇన్విక్టి" (అజేయ సూర్యుడు జన్మదినం)ని క్రైస్తవ పండుగగా మార్చినట్టు చరిత్రకారులు భావిస్తారు.  యేసు క్రీస్తు పుట్టుకను శాంతి, ప్రేమకు సంకేతంగా భావిస్తారు. ఆయన తన బోధనల ద్వారా  మానవత్వం, సద్గుణాలు, సమానత్వం బోధించారు.

క్రిస్మస్ సంప్రదాయాలు..


ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగకు ప్రత్యేకమైన  ఆచారాలు ఉన్నాయి. ఇవి ప్రాంతీయ సంస్కృతులతో ముడిపడినప్పటికీ, కొన్ని సాధారణ సంప్రదాయాలు అన్ని చోట్లా కనిపిస్తాయి.

క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారు. ఫిర్ చెట్లు క్రిస్మస్ ట్రీగా పాపులర్ అయ్యాయి.  మొదటిసారిగా 16వ శతాబ్దంలో జర్మనీలో ఈ సంప్రదాయం ప్రారంభమైంది. చెట్లను నక్షత్రాలు, బొమ్మలు, మిఠాయిలతో అలంకరిస్తారు.


 క్రిస్మస్ పాటలు లేదా క్యారల్స్ పాడడం సంప్రదాయమైంది. “సైలెంట్ నైట్,” “ఓ హోలీ నైట్,” “జింగిల్ బెల్స్” వంటి పాటలు ప్రసిద్ధి చెందాయి. యేసు జన్మదినం సందర్భంగా మేఘదూతలు ఆయనకు ఇచ్చిన కానులని ఆధారంగా చేసుకుని ఈ రోజున గిఫ్ట్‌లు ఇచ్చే సంప్రదాయం మొదలైంది.  

పిల్లలు  బాగా ఇష్టపడే శాంటాక్లాజ్  గిఫ్ట్‌లను అందజేస్తూ, పిల్లల్ని హ్యాపీగా ఫీలయ్యేలా చేస్తాడు.

క్రిస్మస్ వేడుకలో చేసే   ప్లమ్ కేక్ చాలా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి కుటుంబం తమకు తగిన వంటకాలు తయారు చేస్తూ పండుగ సంబరాలు జరుపుకుంటుంది.

కాగితం నక్షత్రాలు, క్రిస్మస్ లైట్స్, క్రిబ్ సెట్స్ తో ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు.

ఇండియాలోని   క్రైస్తవులు క్రిస్మస్ ట్రీకి బదులుగా మామిడి లేదా వెదురు చెట్లను ఉపయోగిస్తారు. రంగురంగుల లైట్లు, కాగితం నక్షత్రాలతో  ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు.

                                    *రూపశ్రీ.

Related Segment News