మనం నిజమైన స్నేహితులమేనా?

ప్రతిఒక్కరు జీవితంలో స్నేహానికి ప్రాధాన్యత ఇస్తారు. స్నేహంచాలా గొప్పది. కనీసం ఒక్క స్నేహితుడిని అయినా కలిగుంటారు. చిన్నతనం నుండి మరణం వరకు స్నేహం అనే అనుబంధంలో సాగేవారు ఎందరో. స్నేహంలో సహాయం, సలహాలు, తోడ్పాటు, ఓదార్పు, ముందడుగు వేసే ధైర్యం లభిస్తాయి. అలాగే స్నేహితుల మధ్య గొడవలు, చిరాకులు, వాదనలు, అభిప్రాయభేధాలు కూడా బోలెడు వస్తుంటాయి. 

ఇతరులు మనకి నిజమైన స్నేహితులా? అని ఆలోచించిస్తారంతా! అయితే అలా ఆలోచించడానికి ముందు మనం ఇతరులకు నిజమైన స్నేహితులమేనా? అని ఒక్క క్షణం ఆలోచించుకుంటే మంచిది.

మనం స్నేహంలో ఆప్యాయత, ప్రేమ, అభిమానం, ఓదార్పు కావాలని కోరుకుంటూ వుంటే వాటిని ముందు ఇతరులకు ఇవ్వడం, పంచడం నేర్చుకోవాలి. అంటే ఇక్కడ మనల్ని బట్టే ఎదుటివారు ఉంటారు. మన ప్రవర్తన మన వ్యక్తిత్వాన్ని బట్టి మన స్నేహితులు మన విషయంలో ప్రవర్తిస్తారు. స్నేహాన్ని, స్నేహితులను ఎప్పుడూ కానుకలతో కొనవద్దు, కానుకలు ఆపేస్తే స్నేహమూ ఆగిపోతుంది. స్నేహంలో కానుకలు, ఇచ్చిపుచ్చుకోవడాలూ వుండవు. ఇచ్చి పుచ్చుకొనేది మనస్సు మాత్రమే. అంతేకానీ ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు సంతోషపడిపోయి ఆహా, ఓహో అని పొగడగానే వాడే నిజమైన స్నేహితుడు. నా గురించి అందరికీ గొప్పగా చెబుతాడు అని అనుకుంటే తప్పే. 

మిత్రుడు అడగకుండా చేసే సహాయమే నిజమైన సహాయం. సహాయం చేసి కృతజ్ఞతలు ఆశించడం సరికాదు. స్నేహమంటేనే మనకి వున్నది ఇవ్వడం, పంచడం. ఏదో ఉపకారాన్ని ఆశించి చేసే స్నేహం కలకాలం నిలవదు. మన ప్రతిష్టను, గౌరవమర్యాదలను పెంచగలిగే ఉత్తమనడవడికలు కలిగిన వారితో స్నేహం చేయాలి. చెడ్డవారితో, చెడు అలవాట్లు కలిగిన వారితో కలిసి మెలసి తిరగడం కంటే అటువంటి స్నేహితులు లేకుండా ఒంటరిగా ఉండటమే మంచిది. చెడ్డవారితో స్నేహం ఉదయపు నీడలాంటిది. ఆ నీడ ఉదయాన ఎక్కువవుండి, తరువాత గంట గంటకీ తగ్గిపోతుంది. మంచి వారితో స్నేహం సాయంత్రపు నీడ లాగా మొదట తక్కువగా వుండి తరువాత గంట గంటకీ పెరుగుతూ వుంటుంది. స్నేహం ఆ విధంగా పెరుగుతూ వుండాలి. 

పాపపు పనులు నుంచి మళ్ళించే వాడే స్నేహితుడు. ఏది మంచో అది మాత్రమే చెబుతాడు మంచి స్నేహితుడు. ఈల అచేస్తే బాగుంటుంది అని ఓ ఉత్తమ సలహా ఇచ్చేవాడు,ఇలా చెడితే పలితం ఇలా ఉంటుందని అందులో మంచి చెడును సాధారణ విషయంలా వివరించి చెప్పేవాడు మంచి స్నేహితుడు.  కానీ ఏది చెడో అదే చెబుతాడు చెడ్డ స్నేహితుడు.చెడ్డ స్నేహితుడు ఎప్పుడూ చెడును మంచిగా చెబుతాడు, అదే నిజమైన మంచి అనే భ్రమను కలిగిస్తాడు. అందులో తప్పులేదని వాదించి చెబుతాడు. చివరకు మనిషిలో విచక్షణను మెల్లిగా కోల్పోయేలా చేస్తాడు.  ఈ విచక్షణను ఎవరికి వారే తెలుసుకోవాలి. 

మంచి నీటి నదులు సముద్రంలో కలిసి ఉప్పునీరుగా మారిపోయిన విధంగా చెడ్డ వ్యక్తులతో స్నేహం కొనసాగిస్తే చేటు తప్పదు.

చెడ్డ స్నేహితులకు తెలివితేటలు ఎక్కువగా వుంటాయి. వీరు చక్కగా మాట్లాడుతారు. మంచి మాటకారితనం వల్ల ఇటువంటి వారి నుండి తప్పించుకోవడానికి ఎక్కువ వివేకం, సమయస్ఫూర్తి వుండాలి. మనం స్నేహితుల్ని మందలించేటప్పుడు రహస్యంగా మందలించాలి. పొగిడేటప్పుడు బహిరంగంగా పొగడాలి. కానీ చెడు స్నేహితులు అలా కాదు. మీ ముందు మిమ్మల్ని పొగిడి మీరు లేని సమయంలో అందరి దగ్గర మీ గురించి చెడుగా చెప్పడం చేస్తారు.   అలాగే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యవిషయం పరిచయస్తులందరూ స్నేహితులు కారు. తెలిసిన వాళ్ళందరూ స్నేహితులు కారు. అందరితో పరిచయం పెంచుకోవాలి. కాని కొద్ది మందితో మాత్రమే స్నేహితులుగా వుండాలి. అలాగే మనం నిజమైన స్నేహతులుగా ఉన్నామా లేదా తెలుసుకోవాలి.

                                        ◆నిశ్శబ్ద.

Related Segment News