మంచి వ్యక్తిత్వం ఇలా సాధ్యం!
posted on Aug 30, 2022 9:30AM
మనిషిలో మంచితనం అనేది ఒక గొప్ప గుణం. ఈ గుణం ద్వారా మనిషికి సమాజంలో ఒక మంచి స్థానమంటూ ఏర్పడుతుంది. మంచితనాన్ని నింపుకున్న వ్యక్తిని మంచితనానికి నిదర్శనంగా అతనొక మంచి వ్యక్తిత్వం కలిగినవాడు, ఆమె మంచి వ్యక్తిత్వం కలది అని గుర్తుచేసుకుంటూ ఉంటారు. కానీ చాలామంది వ్యక్తిత్వం విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. తమదగ్గర డబ్బు ఉందనో, గొప్ప ఫ్యామిలీ బాక్గ్రౌండ్ ఉందనో, ఇతరుల అవసరం తమకు రాదు అలాంటప్పుడు మంచిగా ఎందుకు ఉండాలి అనే ఆలోచనతోనో మొత్తానికి వ్యక్తిత్వాన్ని మంచిగా ఉంచుకోరు. కానీ ఈ సమాజంలో విలువ అనేది డబ్బును, స్థాయిని వచ్చినా చివరికి వ్యక్తిత్వం దగ్గరే నిజమైన గౌరవం అనేది ఆగుతుంది.
మనం సమాజంలో మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలంటే తప్పనిసరిగా కొన్ని లక్షణాలను కలిగి వుండాలి. మంచి వ్యక్తిత్వం సంపాదించుకోవడం అనేది మనమీదే ఆధారపడి వుంటుంది. మనిషి అనుకుంటే దేనినైనా చేయగలడు, ఏమైనా సాధించగలడు అంటారు కదా. అలాగే మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించాలంటే మొదటిగా మనం అన్ని విషయాలలోనూ చాలా ధైర్యంగా, నిజాయితీగా వుండాలి. ఏ విషయం లోనైనా సరే ఆడంబరంగా వుండకూడదు. అట్లాగే మనం ఎప్పుడూ కూడా స్థిర మనోనిశ్చయం కలిగివుండాలి. మనం ఏవైనా చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు విజయాలు సాదించినప్పుడు మనం సాధించిన దానిపట్ల గర్వంగా వుండడంలో తప్పులేదు. ఎందుకంటే అది కష్టం వల్ల దక్కిన ప్రతిఫలం కాబట్టి. కానీ అహంకారం మాత్రం వుండకూడదు. అహంకారం అనేది మనల్ని అణచివేస్తుంది.
మనం ఎప్పుడూ కూడా ప్రక్కవారితో అంటే ఎవరితో ల్నైనా మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలి. అంతేకాని దురుసుగానో లేక అసలు మాట్లాడటం ఇష్టం లేనట్టు బలహీనంగా మాట్లాడకూడదు. బలహీనం అనేది మనలో ఉన్న నిరాశను నిరాసక్తిని తెలియజేస్తుంది. ఎందుకంటే నోటి వాక్కు చాలా బలమైనది. నోటి వాక్కును ఆయుధంగా వర్ణిస్తారు పెద్దలు.
అందుకే ఈ సమాజంలో ప్రతీది కూడా నోటివాక్కుతో ముడిపడి వుంటుంది. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం సాధించిన వాటి పట్ల సంతృప్తిపడాలి. అంతేగాని అలక్ష్యంగా వుండకూడదు. మనలక్ష్యం పట్ల మనకు డిటాచ్మెంట్ తో కూడిన ఎటాచ్మెంట్ వుండాలి. అంటే ఆ విజయం మనదే కావచ్చు కానీ విజయం సాధించిన తరువాత ఎప్పుడూ దాన్నే గుర్తుచేసుకుని తరువాత జరగవలసిన పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. మంచి పేరును పొందగలము.
కొందరు సమయం సందర్భం లేకుండా అర్ధం పర్ధం లేకుండా, మనసులో ఉన్న విషయం ఏదైనా సరే దాన్ని వెళ్లగక్కేస్తుంటారు. పర్యవసానాలు ఏమిటో గ్రహించకుండా అనవసరంగా ఏదేదో మాట్లాడటం మానాలి. అలా మాట్లాడడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి, వాటి నుండి బోలెడు సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఏ వ్యవహారంలోనైనా, తగాదాల్లోనైనా నేర్పుగా, ఓర్పుగా వ్యవహరించాలి. తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి. మన చెవినపడ్డ ప్రతీ విషయాన్ని నిజమని నమ్మడం మానుకోవాలి. ఇతరుల మాటలను, చేతలను, జరుగుతున్న విషయాలను తప్పుగా అర్ధం చేసుకోకూడదు. అత్యుత్సాహంతో చేసేపనులు చివరకు సమస్యలే తెచ్చిపెడతాయి.
ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించాలి. ప్రేమగా మాట్లాడాలి. ఎప్పుడూ కూడా తీరికలేనట్లు ప్రవర్తించకూడదు. ప్రస్తుత కాలంలో చాలామంది చేసేతప్పు అదే. తీరికలేదు అన్నట్టు తప్పించుకు తిరుగుతారు. మంచి వ్యక్తిత్వం కావాలన్నా, నలుగురితో సత్సంబంధాలు ఉండాలన్నా ఎదుటివారికి కూడా వీలైన వరకు సమయాన్ని కేటాయించాలి. అలాగని పూర్తిగా వ్యక్తిగత పనులు వదిలేసుకొని మరీ అందరితో ఉండమని ఎవరూ చెప్పారు. అట్లాగే ఏదైనా తగాదా వచ్చినప్పుడు అవతలి వాళ్ళే ముందుగా దిగి రావాలని ఎదురు చూడకూడదు. మనమే మాట్లాడానికి ముందుకు రావాలి. మనం ఈ లక్షణాలు అన్నింటిని కలిగివుంటే ఈ సమాజంలో మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవచ్చు. మనం ఈ లక్షణాలన్నింటిని కలిగి వుండడానికి ప్రయత్నించాలి. నిజం చెప్పాలంటే ధైర్యం కలిగినవాళ్లే అన్నిటికి సిద్ధంగా ఉండగలరు. ధైర్యవంతుడిదే ఈ భూమి అన్నారు వివేకానందుడు ఆ విషయం మరిచిపోకండి.
◆నిశ్శబ్ద.