నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్ ఆస్తులు జప్తు చేసిన బ్యాంక్
posted on May 3, 2015 7:56AM
పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే తీసే నిర్మాతలు, కేవలం అటువంటి సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించేందుకు ఆసక్తి చూపే దర్శకులు మన సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఆ సినిమాలు హిట్ట్ అయితే అందరి కంటే ముందు ఆ సినిమాలో నటించిన హీరో, ఆ తరువాత దాని దర్శకుడు, సంగీత దర్శకుడు ఆ క్రెడిట్ మొత్తం క్లైమ్ చేసుకొంటారు. వారి తరువాతే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన నిర్మాత పేరు వినిపిస్తుంది. చివరికి అందరూ కలిసి పండగ చేసుకొంటారు. కానీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం దానిని చేయడం కోసం కోట్లు పిండుకొన్న వారందరూ కూడా ఆ తప్పును ఎదుటవాడి మీదకి తోసేసి చల్లగా తప్పుకొని వెళ్ళిపోతే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన నిర్మాత, (సదరు హీరో, దర్శకులపై అపార నమ్మకంతో) సినిమాను తీసుకొన్న డిస్ట్రిబ్యూటర్లే రోడ్డున పడతారు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువయింది. మళ్ళీ తమిళ చిత్ర నిర్మాత ఆస్కార్ ఫిలిమ్స్ సంస్థ అధినేత వి. రవి చంద్రన్ మరోమారు మన కళ్ళ ముందు సజీవ ఉదాహరణగా నిలుస్తున్నారు.
కమల్ హాసన్ నటించిన దశావతారం, విక్రమ్ నటించిన అన్నియన్, ‘ఐ’ వంటి పలు భారీ చిత్రాలను నిర్మించిన ఆయన వాటి నిర్మాణం కోసం తన ఆస్తులను చెన్నైలో గల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో కుదువ బెట్టి అప్పులు తీసుకొన్నారు. కానీ ఆయన తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో బ్యాంకులో తీసుకొన్న అప్పును తిరిగి తీర్చలేకపోయారు. ఆ మొత్తం వడ్డీతో కలిపి రూ.97 కోట్లకు చేరుకొంది. ఆ అప్పును తీర్చమని రవిచంద్రన్ కు ఎన్నిసార్లు నోటీసులు పంపించినా ఆయన తీర్చలేకపోవడంతో ఆయన కుదువ బెట్టిన థియేటర్లను, భవనాలను, ఇళ్ళను, కార్యాలయాలను అన్నిటినీ బ్యాంక్ అధికారులు జప్తు చేసారు.
బ్యాంక్ అధికారులతో తాము చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే ఆ అప్పులన్నీ తీర్చివేస్తామని, ఆస్కార్ ఫిలిమ్స్ సంస్థ ప్రతినిధులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు రూ.97 కోట్లు కాదు కదా కనీసం 9కోట్లు కూడా తీర్చలేని పరిస్థితిలో రవిచంద్రన్ ఉన్నట్లు తమిళ సినిమా పరిశ్రమలో చెప్పుకొంటున్నారు. ఆ సినిమాలు చేయడం కోసం కోట్లు పిండుకొన్న హీరోలు కానీ దర్శకులు కానీ కష్టకాలంలో నిర్మాతను ఆదుకొనేందుకు ముందుకు రాలేదు.
గత ఆరు దశాబ్దాలుగా సినిమాలలో కమర్షియల్ ఫార్ములా సినిమాలు విజయవంతంగా ఆడుతున్నట్లే, సినీ పరిశ్రమలో ఇటువంటి నిర్మాతల ట్రాజెడీ స్టోరీలు నిత్యం బయటపడుతూనే ఉంటాయి. అయినా ఎవరూ గుణపాఠం నేర్చుకోరు. కొత్త బకరాలు పుట్టుకొస్తునే ఉంటాయి. ఆ బకరాలు హీరోలను, వారి మనుమలు, వారి మునిమనుమలను పెంచి పోషిస్తూనే ఉంటాయి. ఇదొక అంతులేని వింత రంగుల కధ.