ఎర్ర దొంగలకు అంతే లేదా?



ప్రతివాడికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేరగా దొరికినట్టున్నారు. అందుకే ఆంధ్రులతో ఆటలాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగల పరిస్థితి, తమిళనాడు రాజకీయ నాయకుల పరిస్థితి ఇలాగే తయారైంది. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు్గా వాళ్ళ తీరు వుంది. ఈ కంత్రీగాళ్ళ తీరు చూసి దేశమంతా పకపకా నవ్వుతున్నా ఆ ఎడ్డిగాళ్ళకి సిగ్గూ శరం రావడం లేదు. తమ దారుణమైన ప్రవర్తనతో రౌడీల్లాగా వ్యవహరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మీద పైచేయి సాధించాలని అనుకుటున్నారు.

మొన్నామధ్య వరకూ తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు కంటినిండా కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ వెనుక వున్నది ఘనత వహించిన తమిళనాడు రాజకీయ నాయకులే అన్నది జగమెరిగిన సత్యం. అవసరం తీరిన తర్వాత అల్లుడు... అన్నట్టుగా వీరప్పన్‌తో అవసరం తీరిన తర్వాత అతన్ని చాకచక్యంగా మట్టుబెట్టేశారు. వీరప్పన్ వీరమరణంతో అనాథలైపోయిన అతగాడి అనుచర స్మగ్లర్ బ్యాచ్ అంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్‌ అడవుల్లోని ఎర్రచందనం చెట్లమీద పడింది. గత పది సంవత్సరాలుగా లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికేశారు. పనిలోపనిగా అడ్డు వచ్చిన అధికారులనూ నరికేస్తూ వచ్చారు. అలాంటి నరహంతక స్మగ్లర్లు 20 మందిని మొన్నామధ్య ఏపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం వీళ్ళ ఉన్మదానికి ఆజ్యం పోసినట్టు అయింది. తమిళనాడులో వున్న ఆంధ్రప్రదేశ్ సంస్థలు, బస్సులపై దాడి చేయడం లాంటి హింసాత్మక ఘటనలతో తమ బుద్ధిని మరోసారి  బయటపెట్టుకున్నారు.

ఎన్‌కౌంటర్ జరిగింది కదా అని ఎర్ర స్మగ్లర్లు ఆగారా... లేదు... ఎన్‌కౌంటర్ జరిగిన మూడోరోజే దాదాపు మూడు వందల మంది స్మగ్లర్లు చిత్తూరు జిల్లా అడవుల్లో దొరికిపోయారు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎర్రదొంగలు ఇప్పుడున్న పరిస్థితిని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికీ చిత్తూరు జిల్లా అడవుల్లో ప్రతిరోజూ ఇద్దరుముగ్గురయినా ఎర్రచందనం దొంగలు దొరుకుతున్నారు. వాళ్ళ తెంపరి తనాన్ని అర్థం చేసుకోవడానికి దీనికి మించిన ఉదాహరణ వుంటుందా? వీళ్ళు చిత్తూరు జిల్లా అడవులను మంచి ఆదాయాన్నిచ్చే టూరిస్టు ప్లేస్‌లా భావిస్తున్నారు. ఈ ధోరణికి మరింత బలంగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది.