జూపూడి అనుభవంతో ఆంధ్రా నేతలకు కనువిప్పు

 

తెలుగు దేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావుకి యం.యల్సీ.సీటు చేతికి అందినట్లే అంది తప్పిపోయింది. ఆంద్రప్రదేశ్ రాష్ర్టంలో జరిగే యం.యల్సీ. ఎన్నికలలో అయనకు పార్టీ అధిష్టానం సీటు ఖరారు చేసినప్పటికీ, ఆయనకు రాష్ట్రంలో ఓటు హక్కు లేకపోవడంతో ఒక మంచి అవకాశం కోల్పోయారు. ప్రజాప్రనిధుల చట్టం, 1951లో సెక్షన్స్ 5 మరియు 6 ప్రకారం, ఎన్నికలలో పోటీ చేయాలనుకొన్న ఏ వ్యక్తికయినా తప్పనిసరిగా సంబంధిత నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలనే నియమం ఉంది. జూపూడి ప్రకాశం జిల్లాకు చెందినవారయినప్పటికీ, ఆయన చాలా కాలంగా హైదరాబాద్ లోనే స్థిరపడి ఉండటం వలన అక్కడే తన పేరును ఓటరుగా నమోదు చేయించుకొన్నారు. ఇంత కాలం హైదరాబాద్ నగరం రాష్ట్ర రాజధానిగా ఉండేది కనుక ఆయనకు కానీ మరెవరికీ గానీ ఇటువంటి వింత సమస్య ఎదురవలేదు. కానీ రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ తెలంగాణాకి దక్కడంతో అక్కడ ఓటర్లుగా నమోదు చేయించుకొన్నవారందరూ ఆంధ్రాలో ఓటు హక్కు కోల్పోయారు.

 

నేటికీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుండటం, అక్కడి నుండే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన సాగుతుండటంతో హైదరాబాద్ లో ఓటర్లుగా నమోదు చేయించుకొన్న రాజకీయనేతలకు, తమ ఓటు హక్కును ఆంద్రప్రదేశ్ కి మార్పించుకోవాలనే విషయం మరిచిపోయినట్లున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి చెందిన అనేక మంది మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నేటికీ హైదరాబాద్ లోనే ఓటర్లుగా కొనసాగుతున్నారు. జూపూడికి ఎదురయిన ఈ చేదు అనుభవంతో వారు అందరూ తమ వోటు హక్కును ఆంద్రప్రదేశ్ మార్పించుకోక తప్పదని స్పష్టమయింది. వారందరికీ ఇప్పటికిప్పుడు ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా వచ్చే ఎన్నికల నాటికి వారందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మార్పించుకోక తప్పదు. దానితోబాటే తమ శాశ్విత నివాసం కూడా.