మంగళగిరిలోనే సమర దీక్ష ఎందుకంటే?

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 3, 4 తేదీలలో రెండు రోజులపాటు రాజధాని ప్రాంతంలో మంగళగిరిని వేదికగా ‘సమర దీక్ష’ చేయబోతున్నట్లు ఆ పార్టీ నేత కె. పార్ధసారధి ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జగన్ దీక్ష చేయబోతున్నట్లు వైకాపా చెప్పుకొంటున్నప్పటికీ, అందుకోసం ఆ పార్టీ ఎంచుకొన్న సమయం, స్థలం రెంటినీ గమనిస్తే అది ప్రజల కోసం చేస్తున్న పోరాటంలా కాక తను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే చేస్తున్నట్లుంది.

 

జూన్ 2న రాష్ట్రావతరణ దినం సందర్భంగా ఆరోజు నుండి ప్రభుత్వం వారం రోజుల పాటు నవనిర్మాణ దీక్ష పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సభలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. జూన్ 6వ తేదీన రాజధానికి శంఖుస్థాపన చేసేందుకు సిద్దమవుతోంది. జూన్ 8న ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకొన్న సందర్భంగా ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలని భావిస్తోంది. ఏడాది పాలనలో రాష్ట్రాభివృద్ధికి, వివిధ సంక్షేమ పధకాల అమలుకి, ఎన్నికల హామీల అమలుకి రాష్ట్ర ప్రభుత్వం చేప్పట్టిన చర్యలు వాటి ఫలితాల గురించి ఈ సభలో ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని భావిస్తోంది.

 

రాష్ట్ర ప్రభుత్వం తన ఈ కార్యక్రమాల గురించి ప్రకటించగానే వైకాపా కూడా తన వ్యూహాలతో సిద్దమయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ‘నవ నిర్మాణ దీక్ష’ గురించి ప్రకటన చేయగానే దానికి పోటీగా వైకాపా ‘సమర దీక్ష’ చేయబోతున్నట్లు ప్రకటించింది. రాజధాని నిర్మించబోయే తుళ్ళూరు, మంగళగిరి మండలాలలో మంగళగిరి ప్రాంతంలోనే కొంతమంది రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే వైకాపా మంగళగిరిని వేదికాగా ఎంచుకొన్నట్లు అర్ధమవుతోంది. తద్వారా జగన్ దీక్షకు వారి మద్దతు పొందడమే కాకుండా వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పురిగొల్పవచ్చని వైకాపా భావిస్తున్నట్లుంది.

 

అదే జరిగితే జూన్ 6న రాజధాని నిర్మాణానికి శంఖుస్థాపన చేయాలనుకొంటున్న ప్రభుత్వానికి రైతుల నుండి ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే వైకాపా తన సమర దీక్షకు చాలా వ్యూహాత్మకంగా జూన్ 3,4 తేదీలను, వేదికగా మంగళగిరిని ఎంచుకోన్నట్లు అర్ధమవుతోంది. కానీ అధికార తెదేపాతో వైకాపాకున్న రాజకీయ విభేదాలు, వైషమ్యాల కారణంగా ఈవిధంగా రాజధాని నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించడం ఎవరూ హర్షించరనే సంగతి ఆ పార్టీ గ్రహిస్తే బాగుంటుంది.