కేటీఆర్ సారూ.. మాట దాటేశారేంటి?

గత ఏడాది జనవరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. అంతే అప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాలలో తిరుగులేని నేతగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్టివ్ రాజకీయాల నుంచి  నిష్క్రమించేశారు. అధికారంలో ఉన్నంత కాలం, అంతకు ముందు తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో కూడా  మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే  ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యూహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టం అంటూ అంతా వ్యాఖ్యానించిన కేసీఆర్ ఇప్పుడు మాటలే మరిచిపోయి మౌనిలా మారిపోయిన పరిస్థితి. 

అయితే కేసీఆర్ మౌనం, ఆయన రాజకీయ ఇన్ యాక్టివ్ నెస్ బీఆర్ఎస్ కు శాపంగా పరిణమించింది. 
కేసీఆర్ మౌనం నేపథ్యంలో పార్టీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావులు నడిపిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలకు పిలుపునిస్తూ, రేవంత్ సర్కార్ విధానాలపై ఘాటు విమర్శలు గుప్పిస్తూ, మరీ ముఖ్యంగా హైడ్రా, మూసీ బాధితులకు అండగా ఉంటామన్న భరోసా ఇస్తూ ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు. అయితే అది సరిపోవడం లేదు. వారు ఎంత దూకుడుగా ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నా కేసీఆర్ మౌనం పెద్ద లోటుగా కనిపిస్తోంది. ఎక్కడకు వెళ్లినా, ఏ వేదికపై ప్రసంగిస్తున్నా వారికి ఎదురౌతున్న ప్రశ్న కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారా? రాజకీయాల నుంచి నిష్క్రమించేశారా అన్న ప్రశ్నలే ఎదురౌతున్నాయి. ఆ ప్రశ్నలకు వారి సరిగా బదులు ఇవ్వలేకపోతున్నారని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.  

తాజాగా ఉబీపీ కాంక్లేవ్ లో పాల్గొన్న కేటీఆర్ కు కేసీఆర్ మౌనం, యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండటంపై ప్రశ్న ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం షాక్ నుంచి కేసీఆర్ ఇంకా తేరుకోలేదా?  ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారు? అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి కేటీఆర్ చెప్పిన సమాధానం ఎవరినీ సంతృప్తి పరచలేకపోయింది. అంతే కాకుండా కేటీఆర్ మాట దాటేశారంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకీ కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఏమిటంటే.. కేసీఆర్ ఓ అద్భుతమైన వ్యక్తి, ఆయన జీవితంలో చాలా చూశారు. ఆయనో ఉక్కు మనిషి.  ఏం జరిగినా ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమి ఆయపై ఎలాంటి ప్రభావం చూపదు. చూపలేదు. అయినా.. మీరు అడగాల్సిన ప్రశ్న ఇది కాదు.. అంటూ తనకు అలవాటైన రాజకీయ ప్రసంగాన్ని ధారాళంగా చేసేశారు. అయన ఇంకా ఏమన్నారంటే..  మీరు కేసీఆర్ మౌనం గురించి కాదుకాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల వాగ్దానం ఏమైంది?  వంద రోజుల్లో నెరవేరుస్తామన్న వాగ్దానాల సంగతేంటి?  అని అడగాలి అని బదులిచ్చారు.  కేసీఆర్ ఏబీపీ కాంక్లేవ్ వేదికగా ఇచ్చిన ఈ సమాధనం పట్ల పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. ఆయన మాటదాటేశారని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ మౌనం గురించి అడిగితే కేసీఆర్ రేవంత్ సర్కార్ పై విమర్శలు చేసి టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారంటున్నారు.