అవినీతి జగన్.. కేసులు డజన్...

 

నీతి నిజాయితీలకు మారు పేరని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు పోగేసుకొన్నారని ఆరోపిస్తూ సీబీఐ 11 చార్జ్ షీట్లు వేసింది. అవింకా ఒక కొలిక్కి రాక ముందే, ఇప్పడు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఆయనపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో మరొక కొత్త చార్జ్ షీట్ వేసారు. జగన్ తరువాత అన్ని చార్జ్ షీట్లలో రెండవ ముద్దాయిగా ఉన్న ఆడిటర్ మరియు వైకాపా నేత విజయసాయి రెడ్డి పేరును కూడా ఈడీ తన చార్జ్ షీట్లో చేర్చింది. వారిరువురూ కలిసి జగతీ పబ్లికేషన్స్ ఆస్తుల విలువను పెంచి చూపడం, క్విడ్ ప్రో పద్దతిలో జయలక్ష్మి టెక్స్ టైల్స్ డైరెక్టర్ టి.ఆర్. కన్నన్ చేత జగతీ పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టించడం, తరువాత జగతీ పబ్లిక్షేన్స్ లో నష్టాలు చూపించడం వంటి నేరాలకు పాల్పడ్డారని ఈడీ తన చార్జ్ షీట్లో ఆరోపించింది. ఆ చార్జ్ షీట్ ని విచారణకు స్వీకరించిన సెషన్స్ కోర్టు ఈ కేసుకు యస్.సి. నెంబర్: 106/15ను కేటాయించింది. ఈ కేసులో ప్రధమ ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి, రెండవ ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డికి, మూడవ ముద్దాయిగా పేర్కొనబడిన జగతీ పబ్లికేషన్స్ కి మే2వ తేదీన కోర్టుకు హాజరవవలసిందిగా నోటీసులు జారీ చేసింది.

 

అయితే తలుపులు నమిలి తినేవాడికి అప్పడాలు తినడం ఒక లెక్కా అన్నట్లు ఒకపక్క 11 సీబీఐ చార్జ్ షీట్లలో సీబీఐ కోర్టు కేసులను అవలీలగా ఎదుర్కొంటూ మరోపక్క రాజకీయాలలో చక్రం తిప్పుతున్న జగన్మోహన్ రెడ్డికి ఈడీ వేసిన ఈ కేసును ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదనే చెప్పవచ్చును. దీనిని కూడా వాటితో కలిపి చూసుకొంటే ముచ్చటగా డజను కేసులున్నాయి చెప్పుకొనే సౌలభ్యం ఏర్పడిందిప్పుడు.