మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొన్న తులసి రెడ్డి

 

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన సీనియర్ నేత తులసి రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పంచనచేరారు. కానీ ఆయన స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని విధంగా ఘోరంగా ఓడిపోయి మూతపడిన తరువాత తులసి రెడ్డి పరిస్థితి కూడా అయోమయంగా మారింది. దాదాపు పది నెలలు వేచి చూసిన తరువాత ఆయన పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి సమక్షంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 

తన భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందనే ఆలోచనతోనే బహుశః ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండవచ్చును. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కూడా అగమ్యగోచరంగానే ఉందనే సంగతి అందరికీ తెలుసు. అటువంటప్పుడు తులసి రెడ్డి తీసుకొన్న నిర్ణయం పెనం మీద నుండి పొయ్యిలోకి దూకినట్లుంది. కానీ ఎంతగొప్ప రాజకీయ నాయకులకైనా ఏదో ఒక పార్టీ గొడుగు క్రింద ఉన్నంత కాలమే మీడియాలో, సమాజంలో గుర్తింపు ఉంటుంది కనుక ఆయన మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరుతున్నారనుకోవాలసి ఉంటుంది. అయితే రాష్ట్రంలో ప్రత్యమ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకొంటున్న బీజేపీ తులసిరెడ్డి వంటి కాంగ్రెస్ నాయకుల కోసమే చూస్తున్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది.