హైదరాబాద్ కి ప్రత్యేక గుర్తింపు నిచ్చేవి చారిత్రిక కట్టడాలే!
posted on Aug 1, 2015 11:28AM
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొంటున్న నిర్ణయాలు తరచూ వివాదాస్పదం అవుతున్నాయి. ఆ లిస్టు గురించి చెప్పుకొంటే అదొక పెద్ద గ్రంధమే అవుతుందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఆయన తాజా నిర్ణయం ఉస్మానియా ఆసుపత్రినిసి అక్కడి నుండి తరలించి దాని స్థానంలో అత్యాధునిక భవనం నిర్మించడం. చారిత్రాత్మకమయినఉస్మానియా ఆసుపత్రిని కూలద్రోయదాన్ని ప్రతిపక్షాలే కాదు ప్రజలు, పర్యావరణ ప్రేమికులు, చారిత్రిక సంపదలను ప్రేమించేవారు అందరూ కూడా తప్పు పడుతున్నారు.
నిజమే! హైదరాబాద్ కి ఐ.టి. రంగం ఒక సరికొత్త హోదాను, హంగు ఆర్భాటాలను ఇచ్చింది. కానీ అంతకంటే ముందు హైదారాబాద్ అనగానే ఎవరి మదిలోనయినా తప్పకుండా మేదిలేవి చార్మినార్, హైకోర్టు, సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండ వంటి చారిత్రిక కట్టడాలే!అవి లేని హైదరాబాద్ ని ఊహించుకోవడమే కష్టం. అటువంటి గొప్పగొప్ప చారిత్రిక కట్టడాలు ఏ యూరోపియన్ దేశాలలోనయినా ఉన్నట్లయితే వారు వాటికి మరింత భద్రంగా చూసుకొంటూ వాటికి మరిన్ని హంగులు సమకూర్చి పర్యాటక ఆకర్షణలుగా మలుచుకొనేవారు. కానీ మనకున్న ఇటువంటి గొప్పగొప్ప చారిత్రిక కట్టడాలను మనం కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు చేప్పట్టకపోగా వాటి స్థానంలో కొత్త భవనాలు కట్టుకోనేందుకు ఉన్నవాటిని కూల్చుకోవడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
అవి చిరకాలం నిలిచి ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ నగర శివార్లలో ఖాళీ ప్రాంతాలలో అత్యాధునిక మౌలిక సదుపాయాలూ, భవానాలు వగైరా ఏర్పాటు చేసుకొంటూ నగరాన్ని విస్తరించుకొంటే ఎవరూ తప్పు పట్టరు. పైగా దానివలన హైదరాబాద్ నగరం మరింత విస్తరించి సాంప్రదాయ, అత్యాధునిక మేలు కలయికగా మారి యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. కానీ ఈవిధంగా మెట్రో రైల్ నిర్మాణానికి, కొత్తగా అసెంబ్లీ భవనం కోసం, రోడ్లను వెడల్పు చేయడం కోసం చారిత్రాత్మక కట్టడాలను కూల్చుకొంటూ పోతే మన చరిత్రను, మన వారసత్వ సంపదను మనమే ద్వంసం చేసుకొన్నట్లవుతుంది. ఒక చాత్రిక కట్టడాన్ని కూల్చడానికి పెద్ద సమయమేమీ పట్టదు. కానీ మళ్ళీ ఎన్నడూ కూడా అటువంటి గొప్ప కట్టడాలను పునర్నిర్మించుకోలేము. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా యావత్ ప్రపంచం నివ్వేరపోయెంత గొప్ప కట్టడం ఒక్కటీ కూడా మనం నిర్మించుకోలేకపోయామనే వాస్తవం గ్రహించకుండా ఉన్నవాటిని కూడా కూల్చుకోవడం ఎంత అవివేకమో ఆలోచిస్తే అర్ధమవుతుంది. ఉస్మానియా వంటి భవనాలలో ఆసుపత్రిని నిర్వహించడం ఇబ్బందికరం అనుకొంటే వేరే చోట అత్యాధునిక ఆసుపత్రిని నిర్మించి అక్కడికి ఆసుపత్రిని తరలించి, ఉస్మానియా భవనాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చును. ఇప్పటికయినా ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేయాలనే తన నిర్ణయాన్ని మార్చుకొనకపోతే తను ఆసుపత్రి ప్రాంగణంలోనే దీక్షకు కూర్చొంటానని ఎంపీ హనుమంత రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.