ప్రత్యేక క్రెడిట్ కోసమే డిల్లీలో దీక్షా?
posted on Jul 31, 2015 1:04PM
రాష్ట్రంలో ఒక్క వైకాపా తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా ప్రత్యేకహోదా కోసం గట్టిగానే పోరాడుతున్నాయి. దాని గురించి వైకాపా ఎంపీలు పారమేన్తులో పోరాడుతున్నారు కనుక తాము పోరాడవలసిన అవసరం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే ఇదివరకు స్వయంగా చెప్పారు. అయినప్పటికీ వేరే స్థానిక సమస్యలపై దీక్షలు చేస్తున్నప్పుడు, ప్రత్యేకహోదా బ్యానర్ కూడా తగిలించేసి, దాని కోసం కూడా తమ పార్టీ గట్టిగానే పోరాడుతోందని జగన్ సమర్ధించుకొచ్చారు. సోనియా గాంధీ ప్రతీ అంశం మీద స్వయంగా స్పందిస్తారా?అలాగే నేనూ ప్రతీ అంశం మీద స్పందించనవసరం లేదని మంచి పాయింటు కూడా తీసి తనను తాను సమర్ధించుకొన్నారు.
కానీ ప్రత్యేకహోదాపై పోరాడేందుకు జగన్ ఎందుకో భయపడుతున్నట్లుంది అని రాహుల్ గాంధీ విమర్శించేసరికి జగన్మోహన్ రెడ్డికి పౌరుషం వచ్చేసింది. రాష్ట్రంలో కాదు ఏకంగా డిల్లీలోనే జంతర్ మంతర్ దగ్గరే ప్రత్యేకహోదా కోసం దీక్ష చేసేస్తాను అంటూ ఆగస్ట్ 10వ తేదీకి డేట్ కూడా ఫిక్స్ చేసేసారు. ఇంతలోనే ఎంత చేంజి? అని జనాలు కూడా ముక్కున వేలేసుకొంటున్నారు.
సుమారు మూడు నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకహోదా కోసమో లేక తన పార్టీ ఉనికిని చాటుకోవడానికో ఏదో హడావుడి చేస్తూనే ఉంది. వామపక్షాలు కూడా ప్రత్యేకహోదా కోసం బస్సు యాత్రలు చేసేందుకు ఎర్రబస్సులను సిద్దం చేసుకొంటున్నాయి. ఇక అధికార తెదేపా అయితే ప్రతిపక్ష పార్టీలలాగ రోడ్లేక్కి ధర్నాలు, నిరసనలు చేయలేదు కానీ కేంద్రంపై నిరంతర ఒత్తిడి చేస్తూనే ఉంది. మరొక నెలన్నర రోజుల్లో ప్రత్యేకహోదాపై కేంద్రం ప్రకటన చేయవచ్చని కేంద్రమంత్రి సుజనాచౌదరి రెండువారాల క్రితమే ప్రకటించారు. అంటే ఇక నేడో రేపో ప్రత్యేకహోదాపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అర్ధమవుతోంది.
బహుశః అందుకే అన్ని రాజకీయపార్టీలు తెగ హడావుడి పడిపోతున్నట్లున్నాయి. బహుశః జగన్ మోహన్ రెడ్డి అందుకే ఏకంగా డిల్లీలో దీక్షకి రెడీ అయిపోతున్నారేమో? ఎలాగు కేంద్రం త్వరలో ప్రత్యేకహోదా ఇస్తుంది కనుక అంతకంటే ముందు తను డిల్లీలో, తన పార్టీ రాష్ట్రంలో ధర్నాలు వగైరా చేస్తే తమ పోరాటాలతో కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధించామని గొప్పగా చెప్పుకోవచ్చును. ఒకవేళ ఇవ్వకపోయినా దాని కోసం తమ పార్టీ డిల్లీలో కూడా పోరాడిందని చెప్పుకొనే సౌలభ్యం ఉంది. అందుకే ఇంతకాలం ప్రత్యేకహోదా గురించి మాట్లాడని వైకాపా నేతలందరూ అకస్మాత్తుగా నిద్రలో నుండి మేల్కొన్నట్లుగా మేల్కొని మీడియా ముందుకు వచ్చి ప్రత్యేకహోదా గురించి తెగ మాట్లాడేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ది లేనిదే దీక్షలు, యాత్రలు చేయరని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అందుకే అన్నారు. ఆయన మాటలని కొట్టిపారేయలేమనిపిస్తోంది వైకాప హడావుడి చూస్తుంటే!