బొత్స మెడపై విశాఖ మేయర్ పీఠం కత్తి

విశాఖ మేయర్ పదవి విషయంలో వైసిపి తప్పటడుగు?

ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిందంటారు. ఇప్పుడు విశాఖ మేయర్ విషయంలో వైసీపీ నిర్ణయాలు బొత్స సత్యనారాయణ కు సవాలుగా మారాయి. ఏడాది కాలం కూడా లేని పదవి కోసం పెట్టిన శిబిరాలు ఫలిస్తాయా? ఫలితం రాకపోతే తనకు నష్టం కలుగుతుందా అన్న ఆలోచనలో ఇప్పుడు బొత్స ఉన్నట్టు కనిపిస్తోంది. 

వైసీపీ   అధికారంలో ఉన్నప్పుడు విశాఖ మేయర్ పీఠం ఆ పార్టీ దక్కించుకుంది. మేయర్ గా బీసీ మహిళ గొలగాని హరి వెంకట కుమారిని పార్టీ నియమించింది. వాస్తవానికి మేయర్ హరి వెంకట కుమారి అయినప్పటికీ పెద్దరికమంతా వైసీపీ పెద్దలదే. కొంతకాలం విజయసాయిరెడ్డి ఆ తర్వాత వై వి సుబ్బారెడ్డి కనుసనల్లోనే విశాఖ కార్పొరేషన్ పాలన జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తమకు ఆ పదవి దక్కడమే చాలు అంటూ మేయర్ హరి వెంకట కుమారి, ఆమె భర్త శ్రీనివాస్ వ్యవహరించారు. కార్పొరేషన్ లో కూడా వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ ల హవాయే కొనసాగింది. దీనిపై సొంత పార్టీలో కూడా చాలా వరకు అసంతృప్తి ఉండేది. అధికారంలో ఉన్నప్పుడు నిధులు కేటాయింపు విషయంలో కూడా తమకు నిర్లక్ష్యంగా చూశారని కొందరు కార్పొరేటర్లలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దశలో నాలుగేళ్ల పాలన ముగిసింది. కూటమి నాయకులు అవిశ్వాస తీర్మానం నోటీసు జిల్లా కలెక్టర్ కు ఇచ్చారు. దీంతో వైసీపీలో గుబులు మొదలైంది.

నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచిన కార్పొరేటర్లతో పాటు ఇండిపెండెంట్, తెలుగుదేశం కార్పొరేటర్ లను కూడా తమ వైపు లాక్కున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి తమకు వస్తుందని వైసీపీలో భయం మొదలైంది. అందుకు తగ్గట్టే కొందరు వైసీపీ  కార్పొరేటర్లు తెలుగుదేశంలోకి మరికొందరు జనసేన  వైపు వెళ్లారు. మరి కొందరు అదే బాటలో అడుగులు వేస్తున్న దశలో పార్టీ పెద్దగా బొత్స సత్యనారాయణ కార్పొరేటర్ల వలసలు అడ్డుకట్ట వేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ క్రమంలో కార్పొరేటర్ లను గోవాకు తరలించారు. అక్కడి నుంచి శ్రీలంక కు కూడా శిబిరాన్ని మార్చేస్తున్నారు. నిజానికి 98 వార్డులు ఉన్న విశాఖ కార్పొరేషన్ లో ఎక్స్ ఎఫిషియో సభ్యులతో కలిసి 111 మంది సభ్యులు ఉంటారు.

మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 74 మ్యాజిక్ ఫిగరు చేరాలి. ఇప్పటికకే కూటమికి 70 మంది కార్పొరేటర్ల బలం ఉంది.  వైసీపీకి ఎక్స్ అఫీషియో సభ్యులు ముగ్గురు, మరో 33 మంది కార్పొరేటర్లు ఉన్నారు ఈ దశలో కూటమికి నలుగురు సభ్యుల బలం అవసరం. సిపిఐ పార్టీ కార్పొరేటర్ స్టాలిన్, గతంలో వైసీపీలో  ఉండి పార్టీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాసరావు కుమార్తె ముత్తంశెట్టి ప్రియాంక లు కూటమికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది. అయితే వారిద్దరూ ఓటు వేసినా మరో ఇద్దరి ఓట్లు అవిశ్వాసానికి అనుకూలంగా పడటం అవసరం. అయితే కూటమి నాయకులు మాత్రం వైసీపీ శిబిరంలో ఉన్న ఐదుగురు కార్పొరేటర్లు తమకు అనుకూలంగా ఉన్నారని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ వ్యవహారాన్ని అంతా తన భుజాన వేసుకొని మేయర్ పీఠాన్ని వైసీపీకి ఉండేలా చేస్తానంటూ బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 రోజులుగా శిబిరం కొనసాగుతోంది. ఈనెల 19వ తేదీన ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.  ఆ రోజు జరిగే కౌన్సిల్లో కచ్చితంగా కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసంపై చర్చ చేసే అవకాశం ఉంది.

టిడిపికి పూర్తిగా మద్దతు ఇవ్వాలని జనసేనకు చెందిన 11 మంది కార్పొరేటర్లు గురువారం తీర్మానం చేశారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సమావేశమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అందరూ కట్టుబడి ఉంటారని ప్రకటన కూడా చేశారు. నిజానికి వైసీపీలో అంతర్గత  విభేదాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ వ్యవహారాలు కొందరిచుట్టూ తిరిగాయని బహిరంగ విమర్శలు ఉన్నాయి. చివరికి కౌన్సిల్లో మాట్లాడడానికి తమకు అవకాశం కూడా ఇవ్వడం లేదని వైసీపీకి చెందిన కార్పొరేటర్   తిప్పల వంశీ లాంటి నాయకులు ఎన్నో సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. అలాగే వార్డులకు నిధులు కేటాయించే సమయంలో కూడా తమను పట్టించుకోలేదన్న అసంతృప్తి కార్పొరేటర్లలో ఉంది.  దీన్ని ఆసరాగా తీసుకొని కూటమి నాయకులు పూర్తి స్థాయిలో వార్డు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని కార్పొరేటర్లకు హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. మరో ఏడాది కాలంలో పదవులు ముగియనున్న దశలో ప్రజలకు అభివృద్ధి పనులు చేస్తే మేలు జరుగుతుందన్న భావనలో కార్పొరేటర్లు ఉన్నారు.

ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కేకే రాజు పై కొందరు కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. వారు కచ్చితంగా కూటమికి అనుకూలంగా ఉంటారన్న సమాచారం వైసీపీ పెద్దలకు చేరింది. దీంతో అప్పటికప్పుడు ఈ అనుమానిత కార్పొరేటర్లకు పార్టీ పదవులను ఆఫర్ చేశారని విశాఖలో చర్చ జరుగుతోంది. పదవులు ఇచ్చినంత మాత్రాన గతంలో జరిగిన అన్యాయాన్ని ఈ కార్పొరేటర్లు మర్చిపోతారా అన్నది అనుమానంగా ఉంది. ఇప్పటికే శిబిరం నిర్వహణ ఖర్చులు భారంగా మారడమే కాక , సమయం దగ్గర పడుతున్న కొలది తమ కార్పొరేటర్లు ఎటువైపు వెళ్తారో అని బొత్స వర్గంలో కలవరం కనిపిస్తోంది. చేతులెత్తి ఓటు వేసే పరిస్థితి వస్తే కొందరు కార్పొరేటర్లు గైర్హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయన్న భయం కూడా వైసిపి పెద్దల్లో  కనిపిస్తున్నది. కూటమి మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి నలుగురు సభ్యుల సహకారం అవసరం. సిపిఎం కార్పొరేటర్ స్టాలిన్, వైసీపీకి రాజీనామా చేసిన ముత్తంశెట్టి ప్రియాంక లు కూటమికి అనుకూలంగా ఓటు వేసినా లేక గైర్హాజరైనా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు పడినట్టే.

ఇక వైసీపీఅసంతృప్తి కార్పొరేటర్ల కుటుంబ పెద్దలతో కూటమి నాయకులు టచ్ లో ఉన్నారు. పార్టీ అధికారంలో అన్యాయం జరిగినట్టు భావిస్తున్న ఆ కార్పొరేటర్లు దాదాపు ఐదుగురు కూటమికి అనుకూలంగా ఉన్నారని వినికిడి. ఇదే జరిగితే మేయర్ పదవి కోల్పోవడమే కాక.. ఈ తతంగం నిర్వహణలో వైఫల్యం చెందినట్లు బొత్స సత్యనారాయణకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వైసీపీలో మరో వర్గం సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 19 డెడ్ లైన్ గా వైసీపీ కార్పొరేటర్ల శిబిరం కొనసాగనుంది. అయితే తాజాగా కూటమి కూడా తమ పార్టీ కార్పొరేటర్ లను ఓ శిబిరంలోకి తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కూటమి తరపున మేయర్ పీఠం ఆశిస్తున్న పీలా శ్రీనివాసరావు ఆర్థికంగా పూర్తి సహాయాన్ని అందిస్తున్నారు. ఎన్నికల ముందే వైసీపీ మేయర్ పీఠాన్ని కోల్పోయినట్లయితే పెద్దగా లాభం లేకపోయినప్పటికీ  అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు చేసిన వ్యవహారానికి ప్రతీకారం  తీర్చుకున్నట్లౌతుందని కూటమి నాయకులు చెప్పుకుం టున్నారు. ఇటు అధిష్టానం గానీ అటు మేయర్  హరి వెంకట కుమారి గాని ఈ విషయంలో పెద్దగా సీరియస్ గా వ్యవహరించక పోవడం తో మొత్తం వ్యవహారం బొత్స మెడ కు చుట్టుకున్నట్టు అయింది.