జగన్ కోటరీ నుంచి సజ్జల ఔట్?

జగన్ హయాంలో ప్రభుత్వం అడుగు తీసి అడుగేయాలంటే ఆయన అనుమతి అవసరం. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలైనా సరే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకు సాగుతాయి. అంతెందుకు జగన్ ను కలవాటంటే ముందుగా ఆయనను కలవాలి. ఆయన ఓకే చేస్తేనే జగన్ దర్శనం లభిస్తుంది. ఇంతకీ ఎవరాయన అంటారా? అక్కడికే వస్తున్నా.. ఆయన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ రాజకీయ ముఖ్య సలహాదారు.  

ఇంత ప్రాముఖ్యత ఉందని సజ్జల అప్పటి ముఖ్యమంత్రి   జగన్ రెడ్డి సమీప బంధువో, క్లాస్మేట్, రూమ్మేట్టో, క్లాస్ మేటో.. ఇంకా చెప్పాలంటే  జైల్ మేటో కూడా కాదు. ఎంపీ కాదు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా కాదు. వాస్తవానికి ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేదు. అయినా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు ఆయన నోటి నుంచే మీడియాకు చేరతాయి. ప్రభుత్వ నిర్ణయాలే కాదు, జగన్ ఫ్యామిలీ పాలిటిక్స్ లో కూడా సజ్జల మాటే ఫైనల్ అన్నట్లుగా అప్పట్లో ఆయన హవా సాగింది. వైసీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలే కాదు, పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చేతుల మీదుగానే నడిచేవి. ఇప్పటికీ పార్టీ వ్యవహారాలలో ఆయనే కీలకం అనడంలో సందేహం లేదు.   

అయితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత.. సజ్జల రామకృష్ణారెడ్డి పై పార్టీ నేతలు, కేడర్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీ ఓటమికి ఆయన, ఆయన పుత్రరత్నం, వైసీపీ సోషల్ మీడియా మాజీ చీఫ్ సజ్జల భార్గవరెడ్డే కారణమంటూ బాహాటంగానే విమర్శలు గుప్పించారు. జగన్ కూడా పిల్ల సజ్జలను అదేనండీ సజ్జల భార్గవ్ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా నుంచి ఊస్ట్ చేసి పారేశారు. పరాజయం తరువాత తొలి నాళ్లలలో సజ్జలను కూడా దూరం పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత అదేమీ లేదు.. ఇప్పటికీ సజ్జలే పార్టీ వ్యవహారాలలో ఫైనల్ డెసిషన్ మేకర్ గా ఉన్నారు. 

అయితే ఎప్పుడైతే సజ్జలకు ముందు పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగి, ఆ తరువాత మసకబారిపోయి, పార్టీ ఓటమి తరువాత వైసీపీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయిరెడ్డి.. మీడియా సమావేశంలో జగన్ కోటరీపై చేసిన వ్యాఖ్యల తరువాత పరిస్థితిలో ఒకింత మార్పు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టు నుంచే కాకుండా తన కోటరీ నుంచి కూడా జగన్ సజ్జలను సాగనంపేందుకు నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల స్థానంలో పులివెందులకు చెందిన సింగారెడ్డి సతీష్ రెడ్డిని తీసుకురానున్నారని పార్టీ వర్గాల సమాచారం.  

అయితే ఈ వార్తలలో నిజమెంత అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో బలంగా వ్యక్తం అవు తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు వరకూ ఈ సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబానికి పులివెందులలో ప్రధాన ప్రత్యర్థి అనే చెప్పాలి. ఆయన మొదటి నుంచీ కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేశారు. తెలుగుదేశంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతెందుకు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైస్ కు, జగన్ కు 1999 నుంచి 2014 వరకూప్రత్యర్థిగా నాలుగు సార్లు ఎన్నికలలో పోటీ చేశారు. ఆ నాలుగు సార్లూ ఓడిపోయారనుకోండి అది వేరే సంగతి.   తొలి నుంచీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీతోనే ఉణ్న సతీష్ రెడ్డి 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా ఎన్నికయ్యారు.  2011, 2014లలో ఆయన తెలుగుదేశం తరఫున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప జిల్లా వేంపల్లి ఆయన స్వస్థలం. తన రాజకీయ జీవితంలో అత్యధిక భాగం సతీష్ రెడ్డి వైస్ కుటుంబానికి వ్యతిరేకంగానే పని చేశారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమై వైసీపీ పంచన చేరారు. ఇందుకు ప్రధాన కారణంగా పార్టీలో బీటెక్ రవికి పెరిగిన ప్రాధాన్యతే అని ఆయన సన్నిహితులు చెబుతారు.   సుదీర్ఘ కాలం తెలుగుదేశంలో కీలకంగా ఉన్న సతీష్ రెడ్డిని జగన్ విశ్వసించి వైసీపీలో అత్యంత ప్రాధాన్యమైన పోస్టు ఇస్తారా? అన్న అనుమానాలు రాజకీయవర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.