వాయిస్ మార్చిన జోగు రమేశ్.. ఎవరికీ భయపడరంట

నిక్కర్లు  వేసుకున్నప్పటి నుంచి వైఎస్ శిష్యుడిగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నానంటున్న మాజీ మంత్రి జోగు రమేశ్,  సీఐడీ నోటీసులతో భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ సీఐడీ విచారణకు శుక్రవారం (ఏప్రిల్ 11) హాజరయ్యారు. విజయవాడ రీజనల్ సీఐడీ కార్యాలయంలో విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి జోగు రమేష్ మీడియాతో మాట్లాడారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు సీఐడీ అధికారుల ఇచ్చిన నోటీసుపై విచారణకు వచ్చానని తెలిపారు. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పానని వెల్లడించారు. నాడు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలపై చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలపడానికే వెళ్లానని, దాడి చేయలేదని పేర్కొన్నారు. 

10 నెలల పాలనలో టీడీపీ అట్టడుగు స్థానానికి వెళ్ళిందని జోగు రమేష్ మర్శించారు. అధికారం ఉందని విర్రవీగి కేసులు పెట్టాలని చూస్తున్నారనీ,  ఇదంతా తాత్కాలిమని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. పరిపాలన చేయమని ఓట్లు వేస్తే రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, మానభంగాలు జరుగు తున్నా యన్నారు. అధికారం కోసం కొట్లాటకు దిగుతున్నారని, దోచుకోవడం కోసం ఆరాట పడుతున్నారని విమర్శించారు. పీఠంపై కొడుకు ఎక్కాలా దత్త పుత్రుడు ఎక్కాలా అన్న చర్చ రాష్ట్రంలో నడుస్తోం దంటూ జోగురమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

నోటీసులతో  తమను ఏమి చేయలేరని మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ రెడ్ బుక్ ఎంత కాలం పట్టుకొని తిరుగుతావ్ ఏదో ఒకరోజు దానిని మడత పెట్టుకోవాల్సిందే అని మండిపడ్డారు. భూమి గుండ్రంగా తిరుగుతుంది ఎల్లకాలం ఒకేలా ఉండదని ఒకటి లేదా రెండేళ్లు రెడ్ బుక్ పట్టుకుంటారని.. 5 ఏళ్లు పట్టుకొని తిరుగుతారా అని నిలదీశారు. ఉవ్వెత్తున ఎగిసిన పతాకంలా వైసీపీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు
వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడి తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. జోగి రమేష్ భారీ కాన్వయ్‌తో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడికి తెగబడ్డారు. ఈ కేసును ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని,   సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో జోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు ఈరోజు విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా జోగి రమేష్ సుప్రీం కోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తరువాతే సీఐడీ విచారణకు హాజరయ్యారు.

ఏపిలో  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జోగి రమేష్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రదర్శిం చిన దూకుడుకి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జోగి కుటుంబంపై ఆరోపణలు రావడం, జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ని అరెస్టు చేయడం జోగి రాజకీయ భవిష్యత్తును ఒక్క కుదుపు కుదిపింది. ఒక వైపు కుమారుడి అరెస్టు,  మరో వైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్‌ను విచారణ పేరుతో స్టేషన్ల  చుట్టూ తిప్పడం లాంటి పరిమాణాలు ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి

ఆ క్రమంలో జోగి రమేష్ తన కష్టాలు అన్నీ ఇన్నీ కావని .. తనకు శనిపట్టిందని అంతా కష్టకాలమే నడుస్తోందని కనిపించిన అందరి దగ్గరా మొత్తుకుంటున్నారట . వాస్తవానికి నారా లోకేశ్ రెడ్ బుక్‌లో టాప్ ఫైవ్ లో తన పేరు ఉందని, తనని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారనే భయంతో టీడీపీలో చేరడానికి ఆయన సిద్ధమయ్యారని కూడా వార్తలు వినవచ్చాయి.  చంద్రబాబు, లోకేశ్‌లను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా అడిగారట. గతంలో వైసీపీలో పని చేసి తర్వాత టీడీపీ మంత్రిగా ఉన్న కృష్ణాజిల్లాకే చెందిన బీసీ నేత పార్థసారథితో కలిసి టీడీపీలో చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారంట. అయితే టీడీపీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జోగి రమేష్ ను పార్టీలో చేర్చుకునేది లేదని తెగేసి చెప్పేశారంట. ఇటీవల నూజివీడులో పార్థసారథి, తదితర తెలుగుదేశం నేతలతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నది కూడా అందుకేనంట.

ఏది ఏమైనా ఇప్పుడు  తెలుగుదేశం పార్టీలో ఎంట్రీకి డోర్లు అన్నీ మూసుకుపోవడం, కేసుల తాకిడి పెరుగుతూ విచారణలు ఎదుర్కోవాల్సి రావడంతో గత్యంతరం లేని స్థితిలో జోగి రమేశ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతా ఆయన అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి పసుపు చొక్కా వేసుకుని తిరిగేవారనీ, ఇప్పుడా చాన్స్ లేకపోవడంతో జైలు జీవితానికి మానసికంగా సిద్దమవుతూ,  ఆ ఫ్రస్ట్రేషన్‌లో మళ్లీ నోటికి పనిచెప్తున్నారంటున్నారు.