ఇవి కూడా రంగుల పండుగలే!

హోళీ అంటే భారతీయులకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ఎక్కడో ఈశాన్యంలోని మణిపూర్లో ఉన్నా, ఖండాలు దాటుకుని ఏ అమెరికాలో ఉన్నా.... హోళీనాడు రంగు చేతపట్టని భారతీయుడు ఉండదు. ఇందులో ఒకో ప్రాంతానిదీ ఒకో ప్రత్యేకత. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రపంచంలో బహుశా మన హోళీ సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ జీవితాన్ని రంగులమయం చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా దేశాల్లో ఉంది...

టమాటాల పండుగ

స్పెయిన్‌లోని వలెన్‌సియాన్ నగరంలో ఏటా ఈ పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం  జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుంటారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది. నిజానికి ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. కొందరు కుర్రకారు టమాటాలతో కొట్టుకున్న గొడవ ఇలా మారిందనీ, ఓ టమాటా లారీ బోల్తా పడటంతో ఈ సంప్రదాయం మొదలైందనీ, ఊళ్లో కౌన్సిల్‌ సభ్యుల మీద కోపం వచ్చిన పౌరులు టమాటాలను విసరడంతో ఈ ఆచారానికి పునాది ఏర్పడిందనీ రకరకాల వాదనలు ఉన్నాయి. కారణం ఏదైనా ఆ రోజు సంబరం మాత్రం అంబరాన్ని అంటుతుంది. ఆ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి గాయం జరగకుండా చాలా నియమాలనూ పాటించాల్సి ఉంటుంది.

ఒకటే రంగు

నెదర్లాండ్‌ రాజుగారైనా విలియం అలగ్జాండర్ పుట్టినరోజు సందర్భంగా ఆ దేశంలో జరుపుకొనే సంబరాలే ‘Koningsdag’. ఈ రోజున నెదర్లాండ్స్ యావత్తూ ఆ దేశపు రంగైన నారింజరంగుతో నిండిపోతుంది. గోడల మీద నారింజ రంగు కనిపిస్తుంది. జనమంతా నారింజరంగు బట్టలు వేసుకుని తిరుగుతారు. ఆఖరికి జుట్టుకి కూడా నారింజ రంగు వేసుకుంటారు.

ద్రాక్ష ఎరుపులో

మందుప్రియులందరి నోరూరేలాంటి ఓ పండుగ ఉంది. అదే స్పెయిన్‌లో జరిగే ‘హారో వైన్‌ ఫెస్టివల్‌’. ఏటా జూన్‌ 29న ఆ దేశంలోని క్రైస్తవ సన్యాసి ‘శాన్‌ పెడ్రో’ జ్ఞాపకార్థం ఈ పండుగ జరుగుతుంది. హారో అనే ఊరిలో జరిగే ఈ పండుగలో ఊరి జనమంతా ఉదయం నుంచే ద్రాక్షసారాయి నిండిన పాత్రలతో బయల్దేరతారు. దారిలో తమకు ఎదురుపడినవారందరి మీదా ఈ సారాయిని ఒంపుతూ ముందకుసాగుతారు. సాయంత్రం అయ్యేసరికి ఊరంతా ద్రాక్షమయంగా మారిపోతుందన్నమాట. ఇక ద్రాక్షసారాని ఒంపుకోవడమే కాదు... దానిని తాగడంలో కూడా బోలెడు పోటీలు జరుగుతాయి.

నారింజ యుద్ధం

ఇటలీలోని ఇవ్రియా అనే పట్నంలో జరిగే పండుగ ఇది. దీని మూలాలు ఎప్పుడో 13వ శతాబ్దంలో ఉన్నాయని చెబతారు. అప్పట్లో రాజవంశానికి చెందిన వ్యక్తి, ఓ పల్లెటూరి పిల్లని బలాత్కారం చేయబోయాడట. దానికి తిప్పికొట్టిన ఆ అమ్మాయి, ఏకంగా ఆ వ్యక్తి తలని నరికేసిందని చెబుతారు. అంతేకాదు! విషయం తెలుసుకున్న పౌరులంతా కలిసి రాజవంశం మీద తిరగబడ్డారట. ఆనాటి ప్రతిఘటనకు గుర్తుగా ఇవ్రియావాసులు నారింజపండ్లని ఒకరిమీద ఒకరికి విసురుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా హోళీని తలపిస్తూ రంగులతో నిండే ఇలాంటి పండుగలు చాలానే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం పైన పేర్కొన్నవే!

 

- నిర్జర.