మరో పాక్ ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు

 

కొన్ని వారాల క్రితం జమ్మూలోని ఉదంపూర్ వద్ద సరిహద్దు భద్రతా దళాల మీద కాల్పులు జరిపిన ఉస్మాన్ ఖాన్ అనే పాక్ ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు. మళ్ళీ ఈరోజు మరో పాక్ ఉగ్రవాది భారత దళాలకు సజీవంగా పట్టుబడ్డాడు. బారాముల్లా జిల్లాలోని రఫియాబాద్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు నిన్న రాత్రి అక్కడికి చేరుకొన్నాయి. ఒక ఇంట్లో దాకొన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరపడంతో భారత్ భద్రతా దళాలు కూడా ఎదురు దాడి చేసాయి. నిన్న రాత్రి నుండి ఈరోజు ఉదయం వరకు సాగిన ఈ ఆపరేషన్ లో మొత్తం నలుగురు ఉగ్రవాదులు భద్రతా దళాలు చేతిలో హతమవ్వగా ఒక్కడు సజీవంగా పట్టుబడ్డాడు. అతనిపేరు సజ్జాద్ అహమ్మద్. వయసు 22సం.లు. పాకిస్తాన్ లో ముజఫర్ ఘర్ అనే ప్రాంతానికి చెందినవాడు. భారత్ పై దాడులు చేసేందుకు తామంతా పాకిస్తాన్ నుండి వచ్చామని అంగీకరించాడు. భద్రతా దళాలు అతని నుండి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రశ్నిస్తున్నాయి.

 

ఇంతకు ముందు ఉదంపూర్ లో పట్టుబడిన ఉస్మాన్ ఖాన్ తాము మొత్తం 18మంది భారత్ లోకి ప్రవేశించమని చెప్పాడు. కనుక చనిపోయిన ఆ నలుగురు, పట్టుబడిన సజ్జద్ అహమ్మద్ తో కలిపి మొత్తం ఐదుగురు ఆ 18మంది ఉగ్రబ్యాచ్ లోవారేనా లేక వీళ్ళు వేరేగా వచ్చారా? అనేది తేలవలసి ఉంది. భారత్ పై దాడి చేసే పాక్ ఉగ్రవాదులు చాలా అరుదుగా సజీవంగా పట్టుబడతారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురు కాల్పులలో ప్రాణాలయినా వదులుకొనేందుకు సిద్దపడతారు కానీ సజీవంగా పట్టుబడరు. కానీ ఈసారి చాలా తక్కు వ్యవధిలో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడటం విశేషం. బహుశః ఇద్దరూ ఇంకా చిన్న వయసువారే అవడంతో వారు పట్టుబడుతున్నట్లున్నారు.

 

పాకిస్తాన్ లో దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న నిరుపేద కుటుంబాలకు చెందిన యువకులను తాలిబాన్, లష్కర్ వంటి ఉగ్రవాద సంస్థలు డబ్బులు ఎరవేసి ఆకర్షించి శిక్షణ ఇచ్చి భారత్ పై దాడులు చేసేందుకు పంపిస్తోందని పట్టుబడ్డ ఉగ్రవాదులు ఇస్తున్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది. కానీ డబ్బుకు ఆశపడి ఇటువంటి పనులకు పూనుకొన్నందుకు వారి జీవితాలే కోల్పుతున్నారు. పాక్ ప్రభుత్వం ఈ సమస్య గురించి తెలియదనుకోలేము. కానీ తెలిసీ మౌనం వహిస్తోంది అంటే దానిపై ఉగ్రవాదుల ప్రభావం, పెత్తనం చాలా ఉందని స్పష్టం అవుతోంది.