ఆమె చేతిని అతడు తన చేతిలో పెట్టుకున్నపుడు,
కాలు అంతా యిమిడి, అరటిచెట్టు మొవ్వులో
ఒదిగి, ఫక్కున నవ్విందిటగా!
దహన్! నీ గుండె ధ్వనిస్తుంది?
* * *
---1941
మేగ్నా కార్టా
మేం మనుష్యులం
మేం మహస్సులం
గుండె లోపలి గుండె కదిలించి
తీగ లోపలి తీగ సవరించి
పాట పాటకి లేచు కెరటంలాగ
మాట మాటకి మోగు కిన్నెరలాగ
మేం ఆడుతాం
మేం పాడుతాం
మేం ఉపాసకులం
మేం పిపాసువులం
భూమి అంచులకు వెలుగు తెరకట్టి
తారకల గతికొక్క శ్రుతివెట్టి
పాటపాటకి వెండిదారంలాగ
మాట మాటకి మండు దూరంలాగ
మేం సాగుతాం
మేం రేగుతాం
మేం నవీనులం
మేం భావుకులం
పాత లోకపు గుండెలే శతఘ్ని పగిలించి
భావి కాలపు చంద్రకాంత శిలలు కరిగించి
పాట పాటకి సోకు స్వర్గంలాగ
మాట మాటకి దూకు సింహంలాగ
మేం నిలుస్తాం
మేం పిలుస్తాం
మేం మనుష్యులం
మేం మహస్సులం
మాకు దాస్యంలేదు
మాకు శాస్త్రంలేదు
మాకు లోకం ఒక గీటురాయి
మాకు కరుణ చిగురు తురాయి
మేం పరపీడన సహించం
మేం దివ్యత్వం నటించం
గాలి గుర్రపు జూలు విదిలించి
పూలవర్షం భువిని కురిపించి
పాటపాటకు పొంగు మున్నీరులా
మాట మాటకి జారు కన్నీరులా
మేం ఆడుతాం
మేం పాడుతాం
* * *
---1942
