ఖాళీ చేసిన....
పట్టణాలు వదలి
పాపాలు భద్రపరచి
బాంబులకి భయపడి
పరుగెత్తారు
మెయిలు మెయిలుపైన
మెరపుల్లా;
మెరపు కరచిన
ఉరుముల్లా అరుస్తూ!!
కాని బాటప్రక్కకడుపులోన కనులుపెట్టి
సడలిపోయి వడలిపోయి
మండిపోయి మాడిపోయి
ఆకాశపు కప్పుక్రింద
అనంత విశ్వపు గదిలో
ఆకలితో ఆడుకుంటూ
ఆకలినే ఆరగిస్తూ
ఆకలినే ఆవరిస్తూ
నల్లని మట్టిదిబ్బలా
చెల్లని పెంటకుప్పలా
కూరుచున్న కబోదికి
పంగుకు, వికలాంగుకు
నిస్సంగుకు, నీర్సాంగుకు
భయమే లేదా!
బాధయె లేదా!
ప్రభుత్వం వీరిని
పాటిస్తుందా! -- చస్తే
పూడుస్తుందా!
ఒక బాంబు
ఉరిమి ఉరిమి
ఊడిపడెను.
'మాదాకవళం' అని
మహదానందంతో
దోసిలి పట్టెను
తల పగిలిందీ,
కల చెదిరిందీ
న్యూస్ పేపర్లో
'No Casualities' అని వార్త!
* * *
---1942
వేసవి
కాలం కదలదు, గుహలో పులి
పంజా విప్పదు, చేపకు
గాలం తగలదు.
చెట్లనీడ ఆవులు మోరలు
దింపవు, పిల్లిపిల్ల
బల్లిని చంపదు.
కొండమీద తారలు మాడెను
బండమీద కాకులు చచ్చెను
కాలం కదలదు, గుహలో పులి
పంజా విప్పదు, చేపకు
గాలం తగలదు.
