చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. గర్బిణుల్లో ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడుగా జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, పొడి చర్మం వంటిసమస్యలు పెను సవాళ్లుగా మారుతుంటాయి. సాధారణంగానే రోగనిరోధోకశక్తి తక్కువగా ఉంటే గర్భిణులకు చలికాలం గడ్డుకాలమే. అలాని పెద్దగా భయపడాల్సిన అవసరంలేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో గర్భిణీలు ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

ఎక్కువ నీళ్లు తాగాలి:

వాతావరణం చల్లగా ఉంటే అస్సలు దాహం వేయదు. అలాని నీళ్లు తాగకుండా ఉంటే డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం ఉంటుంది. గర్భిణులు ఈ విషయం మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే శరీరంలో నీటిస్థాయి లేనట్లయితే ఉమ్మనీరు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఇది ఇలానే కొనసాగితే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టె అవకాశం ఉంటుంది. కాబట్టి కాలమేదైనా వైద్యుల సలహా మేరకు తగిన మోతాదులో నీళ్లు తాగడం మంచిది. కొబ్బరి నీళ్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది.


కీళ్లనొప్పులు:

చలికాలంలో చాలామందిని వేధించే సమస్యల్లో కీళ్ల నొప్పులు కూడా ఒకటి. చల్లగాలులకు శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోయి రక్తప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో కండరాలు, కీళ్లు బిగుసుకుపోతాయి. అంతేకాదు గుండెకూ రక్తం సరఫరా కాదు. గర్బిణుల్లో ఇలాంటి సమస్యలు ఉంటే అది కడుపులో ఎదిగే బిడ్డకు కూడా ప్రమాదమే. కాబట్టి ఇలాంటి సమస్యలెదుర్కొనే గర్భిణులు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం అరోమా థెరపీ చక్కగా ఉపయోగపడుతుంది. ఈక్రమంలో లావెండర్, టీట్రీ, యూకలిప్టస్ వంటి నూనెలతో శరీరమంతా మసాజ్ చేసుకోవడం రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీంతో శారీరక నొప్పులు తగ్గడమే కాదు..ఆరోగ్యమూ కూడా ఇనుమడిస్తుంది. ఈ చిట్కాతో పొడిచర్మం సమస్య కూడా చాలా తగ్గుతుంది. అయితే ఇవి సహజసిద్ధమైన నూనెలే అయినప్పటికీ గర్బిణులు వీటిని వాడే విషయంలో ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

చర్మ సంరక్షణ:

చలికాలమంటే చాలా మంది భయపడుతుంటారు. కారణం చర్మం పొడిబారుతుంది. దీంతో దురద, మంటతో ఇబ్బంది పడుతుంటారు. గర్భిణీల్లో పొట్ట పెరిగిన కొద్దీ చర్మం సాగుతుంది. దీంతో మరింత దురద పుడుతుంది. దీన్ని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే స్ట్రెచ్ మార్క్స్ తో తిప్పలు తప్పవు. అందుకే డాక్టర్ సలహా మేరకు క్రీములు, లోషన్లు, నూనెలు కూడా వాడవచ్చు. వాటితో రోజుకు ఒకటి లేదా రెండు సార్లు పొట్ట భాగంలో మర్దన చేసుకుంటే అటు రక్తప్రసరణ మెరుగవుతుంది. ప్రసవానంతరం స్ట్రెచ్ మార్క్స్ రాకుండా కూడా ఈ చిట్కా సహాయపడుతుంది. మిగతా భాగాల్లో చర్మ సంరక్షణ కోసం పొడి జుట్టు నుంచి విముక్తి పొందడం కోసం నిపుణుల సలహా మేరక సంబంధిత సౌందర్య ఉత్పత్తులు వాడటం మంచిది. లేదంటే ఇంట్లోనే తయారు చేసుకున్న సహాజ సిద్ధమైన బ్యూటీ ఉత్పత్తులు కూడా వాడవచ్చు.

ఉదయం నుంచి ఉత్సాహంగా ఉండేందుకు:

చలికాలంలో ఉదయాన్నే లేవాలంటే బద్ధకంగా ఉంటుంది. దీనికి తోడు గర్భం ధరించిన 3 లేదా 4నెలల పాటు వేవిళ్ల సమస్య వేధిస్తుంది. ఫలితంగా శరీరం మరింత నీరసించిపోయే ప్రమాదం కూడా ఉంది. తద్వారా కడుపులో పెరుగుతన్న బిడ్డపైన కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం నుంచి ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామం, ధ్యానం, యోగా వంటివి రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవాలి. వీటివల్ల శరీరం ఉత్తేజితమవడంతో పాటు మనసకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే గర్భం ధరించిన సమయంలో ఎలాంటి వ్యాయామాలు చేయాలన్న విషయం గురించి మీరు సొంత నిర్ణయం తీసుకోకుండా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.