చెవి పోగులలో ఉన్న ఈ రకాల గురించి ఎంత మందికి తెలుసు?

చెవి పోగులు భారతీయుల ఆభరణాలలో ముఖ్యమైనవి. ఎక్కువ అలంకరణ చేసుకోకపోయినా సరే.. చెవికి చెవి పోగులు తప్పనిసరిగా ఉంటాయి. మెటల్ ఏదైనా సరే.. మహిళలు చెవిపోగులు ధరించడం భారతీయుల సంప్రదాయంలో భాగం అయిపోయింది. ఇక పార్టీలు, ఫంక్షన్లు, ఇతర శుభకార్యాలలో ఒక్కో సందర్బంలో ఒక్కో రకమైన చెవి పోగులు పెట్టుకుంటూ చాలా అట్రాక్షన్ గా కనిపిస్తారు మగువలు. అయితే ఈ చెవి పోగులకు కూడా బోలెడు పేర్లు ఉన్నాయి. ఒక్కో రకం చెవి పోగులకు ఒక్కో పేరు ఉంది. ఈ పేర్ల గురించి చాలా మందికి అస్సలు తెలియదు. ఫ్యాషన్ గురించి ఎడా పెడా క్లాసులు ఇచ్చే వారికి కూడా చెవి పోగులలో ఉన్న రకాల గురించి, వాటి పేర్ల గురించి బహుశా పూర్తీగా తెలిసి ఉండకపోవచ్చు. చాలామంది మహిళలు తాము ధరించే చెవి పోగుల పేర్ల గురించి తెలియకుండానే కంటికి నచ్చింది, పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో పెట్టుకుంటూ ఉంటారు. అంతేకానీ వాటి పేర్లు కూడా తెలిసి ఉండవు. ఈ చెవి పోగుల కహానీ ఇప్పుడెందుకు అనుకోకుండా.. చెవి పోగుల రకాలు ఏమిటి? వాటి పేర్లు ఏమిటి? పూర్తీగా తెలుసుకుంటే..
స్టడ్స్..
స్టడ్స్ రోజువారీ దుస్తులకు ఫర్ఫెక్ట్ గా సరిపోతాయి. వీటిని చాలా చోట్ల టాప్స్ అని కూడా పిలుస్తారు. ఇవి చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి. వాటిని స్క్రూతో నొక్కి ఉంచడం లేదా వెనుక బటన్ తో ధరిస్తారు. మార్కెట్లో బంగారం నుండి వజ్రం వరకు స్టడ్‌లు అందుబాటులో ఉంటాయి. ఇవి సింపుల్ లుక్ ఇస్తూ హుందాగా కనిపించేలా చేస్తాయి. కాలేజ్, ఆఫీస్, స్కూల్స్.. ఇలాంటి చోట్లకు స్టడ్స్ బాగా ఉంటాయి.
డ్రాప్స్..
చాలా మంది డ్రాప్స్ ను చూసి స్టడ్స్ అని పొరపాటు పడతారు. కానీ స్టడ్స్ కు డ్రాప్స్ కు చాలా సారూప్యం ఉంటుంది. స్టడ్స్ టాప్స్ లాగా ఉన్నప్పటికీ, డ్రాప్ చెవిపోగులు స్టడ్స్ నుండి కొద్దిగా వేలాడుతూ ఉంటాయి. అయితే ఇవి పెద్దగా పొడవుగా ఉండవు. అందుకే అవి డ్రాప్ లాగా కనిపిస్తాయి. డ్రాప్స్ కాస్త అట్రాక్షన్ గా ఉంటాయి. రెగ్యులర్ గా పెట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. ట్రెడిషన్ దుస్తులైనా, సాధారణ దుస్తులైనా బాగా నప్పుతాయి.
హూప్స్..
ఈ రోజుల్లో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. హూప్స్ మన భారతీయ డిజైన్ కాదు.. ఇవి సింపుల్ గా రింగులను ఒకదానికి మరొకటి అటాచ్ చేసినట్టు ఉంటాయి. పాశ్చాత్య, ఇండో-వెస్ట్రన్ దుస్తులతో వీటిని ధరిస్తారు. రోజ్ గోల్డ్, గోల్డ్, సిల్వర్ రంగులలో హూప్‌లను సులభంగా కనుగొనవచ్చు. వీటిని పార్టీలలో ధరించవచ్చు.
ఝుమ్కాలు..
ఝుమ్కాలు భారతీయుల అభిరుచికి పెద్ద నిదర్శనం. చాలా మంది ప్రతి చెవిపోగును ఝుమ్కా అని పిలుస్తారు. కానీ ఝుమ్కా చాలా భిన్నంగా ఉంటుంది. ఝుమ్కా గంట ఆకారంలో ఉంటుంది. ఇవి మహిళలకు క్లాసిక్ లుక్ ఇస్తాయి. ఝుమ్కాలు ధరించినప్పుడు చాలా ముద్దుగా కనిపిస్తారు. ఝుమ్కాలు భారతీయ సంప్రదాయ దుస్తులతో చాలా బాగా నప్పుతాయి.
చాంద్బలి..
యే తేరి చాంద్‌బలియాన్...... అనే వాక్యం విన్నారా? ఇవి పాటల్లో ప్రస్తావించబడిన చాంద్‌బలియాన్ లాంటివే. ఇవి చంద్రుని ఆకారంలో ఉంటాయి. ఈ ఆకారం వాటిని మరింత అద్భుతంగా కనిపించేలా చేస్తుంది. వీటిని సాధారణంగా వివాహాలు, పండుగలలో ధరిస్తారు. ఇవి సాధారణంగా పెద్ద సైజులో ఉంటాయి. ఇవి ముస్లిం రాజుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పటికీ ముస్లిం యువతులు ఎక్కువగా వీటిని ధరించడానికి ఇష్టపడతారు.
డాంగ్లర్స్
డాంగ్లర్స్ అంటే ఎప్పుడూ క్రిందికి వేలాడే చెవిపోగులు. కొద్దిగా కదిలినా అవి ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. ఈ రకమైన చెవిపోగులు ముఖ్యంగా పార్టీలలో ధరిస్తారు ఎందుకంటే అవి అద్భుతంగా కనిపిస్తాయి.
*రూపశ్రీ.


.webp)
