హీల్స్ గురించి ఈ విషయాలు తెలిస్తే మగువలు షాక్ అవుతారు..!
ఫ్యాషన్ ప్రపంచంలో, హీల్స్ లేదా హై-హీల్డ్ బూట్లు మహిళల శైలికి, ఆకర్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పరిగణించబడతాయి. కానీ హీల్స్ మొదట్లో తయారు చేసింది అసలు మహిళలకు కాదు, పురుషులకే అని మీకు తెలుసా? ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. హీల్స్ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాలక్రమేణా మారుతున్న సామాజిక, సాంస్కృతిక మార్పులను ఇది ప్రతిబింబిస్తుంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
పురుషుల కోసమేనట..
ఎత్తు మడమల చెప్పులు లేదా బూట్ల చరిత్ర 10వ శతాబ్దం నుండి ప్రారంభమవుతుంది. ప్రారంభంలో మడమలను పెర్షియన్ అశ్వికదళం ఉపయోగించింది. గుర్రంపై ఉన్నప్పుడు స్టిరప్స్‌లో వారి పాదాలను స్థిరంగా ఉంచడానికి వారికి ఎత్తు మడమల బూట్లు అవసరమయ్యాయి. ఈ డిజైన్ రైడింగ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి వారికి సహాయపడిందట. క్రమంగా ఈ ధోరణి యూరప్‌కు చేరుకుంది. 16వ శతాబ్దం నాటికి పురుషుల ఫ్యాషన్‌లో భాగమైంది.
యూరప్‌లో మడమలు ఎత్తుగా ఉన్న బూట్లు, చెప్పులను వేసుకోవడం అంటే హోదా చిహ్నంగా చూడటం ప్రారంభించారు. ఎత్తు మడమల చెప్పులు ధరించిన వ్యక్తి ధనవంతుడు, ప్రభావవంతమైన వాడుగా పరిగణించబడ్డాడు. ఎందుకంటే అతను శారీరకంగా కష్టతరమైన పని చేయవలసిన అవసరం లేదని ఇది చూపిస్తుంది. ఫ్రాన్స్ రాజు లూయిస్ XIV కూడా తన రాజ శైలిలో ఎత్తు మడమల బూట్లను ఒక భాగంగా చేసుకున్నాడు. వారి బూట్లకు తరచుగా ఎర్రటి మడమలు ఉండేవి. అవి వారి శక్తికి, ప్రతిష్టకు చిహ్నంగా ఉండేవట.
స్త్రీ ల వద్దకు ఇలా..
17వ శతాబ్దం చివరి నాటికి మడమల ధోరణి స్త్రీలలో కూడా వ్యాపించడం ప్రారంభించింది. ఈ సమయంలో పురుషుల ఫ్యాషన్ నుండి ప్రేరణ పొంది మహిళలు హీల్స్ ధరించడం ప్రారంభించారు. ఈ ధోరణి ముఖ్యంగా యూరప్‌లో కనిపించింది. అక్కడ మహిళలు తమ దుస్తులలో పురుషుల దుస్తులను చేర్చడం ప్రారంభించారు. 18వ శతాబ్దంలో పురుషులలో హీల్స్ ఫ్యాషన్ తగ్గిపోయినప్పటికీ అవి మహిళలకు ఫ్యాషన్‌లో ముఖ్యమైన భాగంగా మారసాగాయి.
19వ, 20వ శతాబ్దాలలో హీల్స్ మహిళల ఫ్యాషన్‌లో కొత్త గుర్తింపును సృష్టించాయి. ఇది శైలికి చిహ్నంగా మాత్రమే కాకుండా మహిళల కాన్పిడెన్స్ కు వారి గంభీరత్వానికి చిహ్నంగా మారాయి. ఫ్యాషన్ డిజైనర్లు వివిధ డిజైన్లలో, ఆకర్షణీయమైన రూపాల్లో హీల్స్‌ను ప్రవేశపెట్టారు. ఇది మహిళలకు తప్పనిసరిగా ఉండవలసిన యాక్సెసరీగా మారింది.
నేటి ప్యాషన్ లో..
నేటి కాలంలో హీల్స్ మహిళల ఫ్యాషన్‌లో అంతర్భాగం. ఇది ఎత్తును పెంచడంలో సహాయపడటమే కాకుండా, స్త్రీలను ఆత్మవిశ్వాసంతో, ఆకర్షణీయంగా భావించేలా చేస్తుంది. అయితే ఆధునిక యుగంలో సౌకర్యం, శైలి రెండింటినీ దృష్టిలో ఉంచుకుని హీల్స్ డిజైన్‌లో అనేక మార్పులు చేయబడ్డాయి. ఇప్పుడు ఫ్లాట్ హీల్స్, వెడ్జ్ హీల్స్, బ్లాక్ హీల్స్ వంటి చాలా రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి మహిళలకు సౌకర్యాన్ని, అందంగా కనిపించడాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఇదీ హీల్స్ చరిత్ర.
*రూపశ్రీ.
