ముఖ చర్మం పాడవుతోందా... మీరూ  ఈ తప్పులు  చేస్తున్నారేమో!
 

 

అమ్మాయిలలో ఎక్కువగా ఆకర్షించేది ముఖమే. ముఖం అందంగా ఉంటే ఫిజికల్ ఫిట్నెస్ మరింత ఆకర్షణగా మారుతుంది.  చర్మం రంగు ఏదైనా సరే ముఖం చక్కగా, కాంతివంతంగా, మొటిమలు, మచ్చలు ఏవీ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. కానీ  అలాంటి ముఖం చాలా తక్కువ మందికి ఉంటుంది.  అయితే ముఖం మీద మచ్చలు, ముడతలు, మొటిమల తాలూకు గుర్తులు ఏవీ లేకుండా ఉండటం కోసం ఎన్నో రకాల బ్యూటీ ఉత్పత్తులు వాడతారు. ఫేస్ క్రీములు, లోషన్లు, ఫేస్  వాష్ లు ఇలా చాలా ఉపయోగిస్తారు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ ఉత్పత్తులన్నీ మంచి వాసన వస్తాయి తప్ప చర్మాన్నిమాత్రం బాగు చెయ్యవు.  చర్మం చక్కబడాలంటే దానికి కావల్సింది  వాణిజ్య ఉత్పత్తులు ఉపయోగించడం కాదు, చర్మాన్ని శుభ్రం చేసే విధానం తెలుసుకోవడం. ఫేస్ వాష్ చేయడంలో  చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటో తెలుసుకుని వాటిని  సరిచేసుకోవడం అవసరం.

క్లెన్సర్..

ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సరైన క్లెన్సర్ ఎంచుకోవడం తప్పనిసరి. చాలామంది కొంటున్నారనో, మార్కెట్లో వైరల్ అవుతోందనో క్లెన్సర్ కొనుగోలు చేయకూడదు.  చర్మాన్ని బట్టి క్లెన్సర్ ఎంచుకోవాలి. ఇలా చేస్తే చర్మానికి ఎటువంటి నష్టం కలగదు. ఆశించిన ఫలితాలు కూడా ఇస్తాయి. ఒకవేళ ఏదైనా క్లెన్సర్ ఉపయోగించగానే ముఖం మీద గుల్లలు, దద్దుర్లు, ముఖ చర్మం ఎర్రబడటం వంటివి జరిగితే అలాంటి క్లెన్సర్ కు దూరం ఉండాలి.

వేడినీరు వద్దు..

ముఖం శుభ్రం చేసుకోవడానికి కొందరు వేడినీరు ఉపయోగిస్తారు. దీనివల్ల చర్మం శుభ్రపడుతుందని అంటారు. కానీ వేడినీటితో ముఖం కడిగితే ముఖ చర్మంలో ఉన్న తేమ కోల్పోతారు. అదే చల్లని నీటితో కడితే ముఖ చర్మం తేమ కోల్పోదు.

రుద్దకూడదు..

ముఖం కడిగేటప్పుడు   క్లెన్సర్ లేదా సోప్ వంటివి ఉపయోగించే ముందు ముఖాన్ని గట్టిగా రుద్దుతూ ఉంటారు. ఇలా చేస్తే చర్మం దెబ్బతింటుంది.  మృదుత్వం కోల్పోయి చర్మం రఫ్ గా మారిపోతుంది. అంతేకాదు చర్మ రంధ్రాలు కూడా సాగిపోవడానికి అస్కారం ఉంటుంది.

ముందు జాగ్రత్త..

ముఖం కడుక్కోవడానికి ముందు చేతులు  శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. చేతులు శుభ్రం చేసుకోకుండా ముఖం కడుక్కుంటే  చేతులలో ఉన్న మురికి ముఖ చర్మానికి అంటుకుంటుంది. ఇది ముఖం మీద మొటిమలు, గుల్లలు, దద్దుర్లు, ముఖం రంగుమారడం వంటి సమస్యలకు కారణం అవుతుంది.

                                                   *నిశ్శబ్ద.