మీ పిల్లలు బాగా ఒత్తిడిగా ఫీలవుతున్నారా?  ఈ పనులు చేయండి!

ఒత్తిడి అనేది కేవలం పెద్దవారిలో మాత్రమే కాదు.. పిల్లలలో కూడా ఉంటోంది. నేటికాలంలో పరీక్షలు, ర్యాంకులు, పెద్ద స్కూళ్లలో సీట్లు, ప్రాజెక్ట్ లు, ఇంకా చిన్న వయసులోనే పెద్ద టార్గెట్లు. ట్యూషన్లు, కోచింగ్ సెంటర్లు.. ఇలా ఒకటనేమిటి చిన్న బుర్రలకు ఉరుకులు పరుగులే సరిపోతున్నాయి. ఇవన్నీ పిల్లల మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. పిల్లలో  ఈ ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి.

పిల్లలతో ఏ విషయాన్ని అయినా ఎలాంటి సందేహం లేకుండా మాట్లాడాలి. దీని వల్ల పిల్లలకు కూడా వారి మనసులో ఉన్న విషయాలను స్పష్టంగా చెప్పడం సాధ్యమవుతుంది. పిల్లలలో భయాలు, ఆందోళనలు, మనసులో ఉన్న దిగులు ఇలా అన్నీ పిల్లలు చెప్పగలుగుతారు. కాబట్టి పిల్లలతో ఏదైనా ఓపెన్ గా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి.

పెద్దవాళ్లకు ఉన్నట్టుగా పిల్లలు కూడా తమ పనులు చేసుకోవడానికి టైం టేబుల్ ఏర్పాటు చేయాలి. దీన్ని పిల్లల అభిరుచికి తగ్గట్టు వాళ్లతోనే చేయించాలి. భోజనం, హోం వర్క్, ఆడుకునే సమయం, అభిరుచుల కోసం సమయం ఇలా అన్నింటికి సమయం కేటాయించాలి. ఇది పిల్లలకు పనులు సులువుగా సమయానికి పూర్తీ చేసి ఒత్తిడి తగ్గిస్తుంది.

పెద్దవాళ్లకు పిల్లలకు అందరికీ ఆరోగ్యకరమైన జీవనశైల్ అవసరం అవుతుంది. పిల్లు తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, శారీరక వ్యాయామం వంటివి పాటిస్తుంటే వారిలో భావోద్వేగాలు కూడా నిలకడగా ఉంటాయి.

పెద్దలు చాలామంది మానసికంగా నిలకడగా లేకపోతే కోపం చేసుకోవడం, అరవడం, చికాకు ప్రదర్శించడం వంటివి చేస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం ఈ మానసిక నిలకడ కోసం రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతారు. లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం, గైడెడ్ ఇమేజరీ వంటి మానసికి రిలాక్సేషన్ పద్దతులను పిల్లలతో సాధన చేయించాలి.

పిల్లలకు ఆడుకోవడం ఇష్టం. పిల్లలను ఆడుకోవద్దని తిడితే వారు కోప్పడతారు. అయితే వారు ఆడుకుంటూ ఉంటే సరిగ్గా చదవరని తల్లిదండ్రుల భయం. అందుకే పిల్లల ఆటలకు సమయం కేటాయించాలి. పిల్లలలో ఆటల పట్ల ప్రతిభ కనిపించినట్లైతే ఆ ఆటలలో కూడా పిల్లలను ప్రోత్సహించాలి. ఆటలు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపస్తుంది. గెలుపు ఓటమిలను సమానంగా తీసుకునే మెంటాలిటీ అలవాటు అవుతుంది.

పిల్లలు మొబైల్ ఫోన్, టీవి, కంప్యూటర్ వంటివి చూడటానికి వారికి ఓ నిర్ణీత సమయాన్ని కేటాయించాలి. దీనివల్ల వారు ఫోన్ కు అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. ఇది వారి కంటి ఆరోగ్యానికి కూడా మంచిది.

పిల్లలు చాలావరకు పెద్దలను చూసి తాము కూడా పనులు చేస్తుంటారు. ఈ అనుకరణ వల్ల పిల్లల విషయంలో ఎలాంటి తప్పులు జరగకూడదు అంటే తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకు రోల్ మోడల్స్ లా ఉండాలి.

ఏ సమస్య వచ్చినా సరే పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నారనే భరోసా ఇవ్వాలి. ఇలా ఉంటే పిల్లలు ఒత్తిడి ఫీల్ కారు. ఇంట్లో కూడా పిల్లలకు అనువైన వాతావరణం ఉంచాలి. పిల్లల  భవిష్యత్తు ముఖ్యం కాబట్టి వారి గురించే ఆలోచించాలి. ఏ విషయాన్ని అయినా ఓపికతో పరిష్కరించాలి.


         *నిశ్శబ్ద.