ఇంట్లోనే తయారు చేసుకునే ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్ తో.. చర్మం యవ్వనంగా మారడం ఖాయం..!

ఈ కాలంలో చాలామంది చిన్న వయస్సులోనే ముఖం మీద ముడతలు, సన్నని గీతలు, చర్మం వదులుగా మారి ముడుతలు పడటం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటిని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు లేదా రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే దీని వల్ల డబ్బు ఖర్చు తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. కొన్ని క్రీములు చర్మం మీద ప్రబావం చూపించినప్పటికీ అది కేవలం తాత్కాలికం మాత్రమే. ఇలాంటి వారు ఇంట్లోనే తయారు చేసుకుని వాడగల యాంటీ ఏజింగ్ క్రీమ్ ఉంది. దీన్ని చాలా సులువుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ముఖాన్ని యవ్వనంగా మార్చడానికి సహజ పదార్థాలను మాత్రమే ఉపయోగించి నైట్ క్రీమ్‌ను ఇంట్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుంటే..
కావలసిన పదార్థాలు..
అలోవెరా జెల్ - 2 టీస్పూన్లు
బాదం నూనె - 1 టీస్పూన్
విటమిన్ E గుళిక - 1
రోజ్ వాటర్ - 1 టీస్పూన్
తయారీ విదానం..
ఇంట్లో క్రీమ్ తయారు చేయడం చాలా సులభం. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో తాజా కలబంద జెల్ తీసుకోవాలి. తాజా కలబంద జెల్ అందుబాటులో లేకపోతే మార్కెట్లో లభించే జెల్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో రెండు చెంచాల జెల్ తీసుకొని దానికి ఒక చెంచా బాదం నూనె జోడించాలి. రెండింటినీ బాగా కలపాలి. రెండింటినీ బాగా కలిపిన తర్వాత, అందులో విటమిన్ E క్యాప్సూల్ వేసి మళ్ళీ కలపాలి. చివరగా, దానికి రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఇది క్రీమ్ లాగా మారుతుంది. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఎలా వాడాలంటే..
ఈ క్రీమ్ ను వాడే ముందుగా ముఖాన్ని మంచి ఫేస్ వాష్ సహాయంతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఈ క్రీమ్ ను అప్లై చేయాలి. ప్రతి రాత్రి పడుకునే ముందు ముఖం, మెడపై ఈ క్రీమ్‌ను తేలికగా అప్లై చేయాలి. ఉదయం గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.
జాగ్రత్త..
ఈ క్రీమ్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఉపయోగించే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. తద్వారా చర్మంపై ఎలాంటి అలెర్జీ ప్రమాదం ఉండదు.
*రూపశ్రీ.



