గ్లోయింగ్ స్కిన్ కావాలా? ఈ జ్యూస్ ఇంట్లోనే చేసుకుని తాగితే చాలు..!
గ్లోయింగ్ స్కిన్ ప్రతి అమ్మాయి కల. ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటే చాలా మంది అమ్మాయిల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది కూడా. అయితే ఈ కాలంలో అది అంత ఈజీ కాదు. ఆహారం, జీవనశైలి, ఉద్యోగాలు, చదువులు, కుటుంబ సంబంధాలు.. ఇలా ఒకటా రెండా ఆరోగ్యం దెబ్బతీసే కారణాలు ఎన్నో ఉంటాయి. పైకి ఎలాంటి సమస్య లేదు అన్నట్టు అనిపించినా మనిషిలో ఉండే ఒత్తిడి, అసహనం, చిరాకు, అసౌకర్యం వంటివన్నీ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చర్మాన్ని వాడిపోయినట్టు కళావిహీనంగా మారుస్తుంది. అయితే ఇంట్లోనే ఒక్క జ్యూస్ తయారుచేసుకుని తాగడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. అదేంటో తెలుసుకుంటే..
ఆరోగ్యకరమైన రీతిలో గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే దోసకాయ, పైనాపిల్ జ్యూస్ చక్కగా సహాయపడుతుంది. దోసకాయ చర్మ సంరక్షణకు చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మానికి మెరుపును ఇస్తుంది. ఇందులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.
పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలో మంటలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది.
దోసకాయ.. పైనాపిల్ జ్యూస్..
కావలసిన పదార్థాలు..
దోసకాయ..
పైనాపిల్..
పుదీనా..
నిమ్మరసం..
తయారీవిధానం..
దోసకాయ, పైనాపిల్, పుదీనా ఆకులు మిక్సీ జార్ లో వేసి బాగా మిక్సీ పట్టాలి. దీన్ని ఒక గ్లాసులో పోసి అందులో నిమ్మరసం కలపాలి. దీన్ని నేరుగా తాగితే మంచిది. మరింత ఆహ్లాదం కావాలి అంటే కాస్త ఐస్ క్యూబ్స్ కలుపుకోవచ్చు. రుచికోసం తేనె జోడించుకోవచ్చు.
*రూపశ్రీ.