చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ బెస్ట్..!

చలికాలం చర్మానికి మా చెడ్డ కాలం అని చెప్పవచ్చు. చర్మ సంబంధ సమస్యలు చాలా వస్తాయి. ఇవి శరీరం మొత్తం చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా అసౌకర్యం కలిగితే అది రోజులో చేసే ఎన్నో పనులలో ఇబ్బందులు కలిగిస్తుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి కింది సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాలి.

ఉదయం లేచి స్నానం చేశాకే ఉద్యోగాలకు, కాలేజీలకు  వెళతారు.  అయితే స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే చర్మం దారుణంగా దెబ్బతింటుంది. చలికాలంలో స్నానాన్ని కేవలం 5 నుండి 10 నిమిషాలలోపు ముగించాలి. ఇలా చేస్తే చర్మం రోజంతా తేమగా ఉంటుంది. ఎక్కువసేపు నీటిలో తడిస్తే చర్మం పొడిబారుతుంది.

బాగా చలిగా ఉంది కదా అని బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తుంటారు. అయితే చాలా వేడిగా ఉన్న నీళ్ళు శరీరానికి బాగా అనిపించినా చర్మ రంధ్రాలు సహజంగా ఉత్పత్తి చేసే నూనెలు ఆగిపోతాయి. దీని వల్ల చర్మం చాలా తొందరగా పొడిబారుతుంది. అందుకే ఎప్పుడూ గోరువెచ్చని నీళ్లతో మాత్రమే స్నానం చెయ్యాలి.

చలి నుండి చర్మాన్ని కాపాడుకోవడానికి చాలామంది బ్యూటీ ఉత్పత్తులు వాడతారు. అయితే రసాయనాలు  అధికంగా ఉన్న ఉత్పత్తులు వాడితే చర్మం దెబ్బతింటుంది. అందుకే సహజమైన మాయిశ్చరైజర్ వాడాలి.

పెదవులు పగలకుండా ఉండాలంటే లిప్ బామ్ తప్పనిసరిగా వాడతారు. కానీ దీన్ని పదే పదే రాయకూడదు. రోజులో రెండు మూడుసార్లు రాస్తేసరిపోతుంది. అది కూడా సహజమైన లిప్ బామ్ బెస్ట్.

 చలికాలంలో ఎక్కువ దాహం వేయదు. కానీ చలికాలంలో నీరు తాగడం తగ్గిస్తే చర్మం తొందరగా ముడతలు పడుతుంది. అందుకే తగినంత నీటిని తాగాలి.

సన్ స్క్రీన్ అంటే వేసవిలోనే ఉపయోగిస్తారనే అపోహ చాలామందిలో ఉంది. కానీ చలికాలంలో కూడా సన్ స్క్రీన్ వాడాలి. ఇది చర్మాన్ని రక్షిస్తుంది.

చలి నుండి శరీరాన్ని కాపాడుకునేందుకు స్వెట్టర్లు, జాకెట్ లు, సాక్సులు, గ్లౌజులు ఉపయోగించాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. చలి కారణంగా చర్మం దెబ్బతినకుండా చేస్తాయి.

చలికాలంలో పైన చెప్పుకున్న సంరక్షణా చర్యలు మాత్రమే కాకుండా ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. సమతుల్య ఆహారం తప్పనిసరి. ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు, పండ్లు తీసుకోవాలి. సీజనల్ ఫుడ్స్ అస్సలు మిస్ కాకూడదు.

                                                          *నిశ్శబ్ద.