ఆయుర్వేదం ప్రకారం అమ్మాయిలు పీరియడ్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

పీరియడ్స్ అమ్మాయిలకు ఒక దశ వచ్చాక ప్రతి నెల పలకరిస్తుంటాయి. నిజానికి చాలామంది పీరియడ్స్ వల్ల వచ్చే నొప్పుల గురించి, అసౌకర్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ పీరియడ్స్ రాకపోయినా కంగారు పడాల్సిందే. పీరియడ్స్ ప్రతినెలా కరెక్ట్ గా వస్తుంటేనే అమ్మాయిలలో పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఆయుర్వేదం అమ్మాయిల నెలసరి విషయంలో కొన్ని జాగ్రత్తలు సూచించింది. అమ్మాయిలకు నెలసరి వచ్చాక మూడు రోజుల పాటు కొన్ని జాగ్రత్తలతో కూడిన నియమాలు తప్పనిసరి అని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..
మహిళలలో నెలసరి సమయంలో పునరుత్పత్తి ఆరోగ్యం, హార్మోన్లు, భావోద్వేగాల ఆరోగ్యంగా పేర్కొనే మానసిక ఆరోగ్యం మొదలైనవి కాపాడటానికి 3రోజుల దినచర్యను ఆయుర్వేదం పేర్కొంది. దీన్నే ఋతు సంరక్షణ లేదా నెలవారీ రీసెట్ అని అంటారు.
నెలవారీ రీసెట్ సూత్రం ప్రకారం.. పీరియడ్స్ సమయంలో ఎక్కువగా పనిచేయకూడదు. ఒక పని చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే పని చేయకుండా విశ్రాంతి తీసుకోవడం వల్ల హార్మోన్ల ప్రవాహం ఆరోగ్యంగా ఉండి నెలసరి సమయంలో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.
పైన పేర్కొన్న కారణాల వల్లే నెలసరి వచ్చాక మొదటి మూడు రోజులు పూర్తీగా విశ్రాంతి తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతుంది. ఈ కారణంగానే నెలసరి వచ్చినప్పుడు మూడు రోజులు ఇంటి పనులకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ కదలకుండా ఒక చోట కూర్చుని విశ్రాంతి తీసుకోమని చెబుతారు. కానీ నేటి కాలం దీన్ని అర్థం చేసుకోకుండా వక్రీకరిస్తుంది. కొందరు ఈ మూడు రోజుల సమయంలో మహిళలకు విశ్రాంతి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ దుర్భాషలాడుతూ ఉంటారు. మరికొందరు ఇంటి పనులకు దూరంగా ఉండాలనే విషయాన్ని అంటరానితనం తో చూస్తూ నెలసరి సమయంలో ఉన్న మహిళలను, అమ్మాయిలను మాటలతో చేష్టలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు.
నెలసరి సమయంలో మనస్సును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల హార్మోన్లు ప్రశాంతంగా ఉంటాయి. మహిళల శరీరంలో వచ్చే మార్పులు అయినా, అనారోగ్యాలు అయినా చాలా వరకు హార్మోన్లు బ్యాలెన్స్ తప్పడం వల్లనే వస్తుంటాయి. అందుకే నెలసరి సమయంలో మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం, జపం, లేదా నిశ్శబ్ద సాధన వంటివి చేయడం చాలా సహాయపడతాయి.
నెలసరి సమయంలో తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యమైనది. సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు, వెచ్చని ఆహారాలు తీసుకోవాలి. ఈ సమయంలో మరీ చల్లగా ఉన్న ఆహారం లేదా చాలా వేడిగా ఉన్న ఆహారం నిషేధించాలి. ఆహారంలో కిచిడి, గంజి, ఉడికించిన కూరగాయలు, మజ్జిగ వంటివి బాగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు.. కారంగా ఉండే ఆహారాలు, మాంసాహారం, మద్యం తీసుకోవడం, శీతలపానీయాలు అస్సలు తీసుకోకూడదు. జీర్ణం కావడానికి కష్టమైన ఆహారాలు తీసుకుంటే రక్తప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి.
ఆయుర్వేదం ప్రకారం శరీర ఉష్టోగ్రతను తల నియంత్రిస్తుందట. అందుకే నెలసరి వచ్చిన మూడు రోజులలో తలస్నానం చేయకూడదని చెబుతారు. ఒక వేళ తలస్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత దెబ్బతిని రక్తస్రావ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుందట.
నెలసరి సమయంలో ఆయుర్వేదం చెప్పిన జాగ్రత్తలు పాటించకపోతే అది నెలసరి సమయంలో అధిక నొప్పి, పిసిఓయస్ వంటి హార్మోన్ సమస్యలు, పిల్లలు కనడంలో ఇబ్బందులు వంటివి రావడానికి కారణం అవుతాయని అంటున్నారు.
ఆధునిక వైద్యశాస్త్రం కూడా నెలసరి సమయంలో విశ్రాంతి తీసుకోవాలని, అది ఆరోగ్యం పై, హార్మోన్ల పై ప్రభావం చూపించి శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెబుతోంది. ఈ సమయంలో గర్భాశయం మరమ్మత్తు చేయడం, రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరించడం వంటివి అంతర్గతంగా జరుగుతాయట. కాబట్టి ఆయుర్వేదం చెప్పిన జాగ్రత్తలు, నియమాలు తప్పనిసరిగా పాటించడం మంచిది.
*రూపశ్రీ.



.webp)