ముఖాన్ని మెరిపించే ఫేస్ సీరమ్.. ఇంట్లోనే ఇలా రెడీ!


అందంగా కనిపించాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు. కానీ ఎన్ని బ్యూటీ ఉత్పత్తులు వాడినా ముఖంలో రవ్వంత అయినా తేడా లేక నిరుత్సాహపడే అమ్మాయిలే ఎక్కువ ఉంటున్నారు ఈ కాలంలో. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన  కొరియన్స్ స్కిన్ మీద అమ్మాయిలకు చెప్పలేనంత మోజు. అయితే ఈ కొరియన్ స్కిన్ కు ఇంటి చిట్కాలు కొన్ని హెల్ప్ చేస్తాయి.  ఇంట్లోనే తయారుచేసిన విటమిన్-ఇ సీరమ్ వాడితే ముఖం యవ్వనంగా, గాజులా మెరిసిపోతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా, మృదువుగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.  నిజానికి చాలా బ్యూటీ ప్రోడక్స్ట్ విటమిన్-ఇ ఆధారితంగా తయారుచేస్తారు. ఇంట్లోనే ఈజీగా విటమిన్-ఇ సీరమ్ ఎలా తయారుచేయాలో తెలుసుకుంటే..

కావలసిన పదార్థాలు..

విటమిన్-ఇ క్యాప్సూల్స్ .. 3-4

జోజోబా ఆయిల్.. 1 స్పూన్.

రోజ్ షిప్ ఆయిల్.. 1స్పూన్

ఆర్గాన్ ఆయిల్.. 1స్పూన్

లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్.. ఐదారుచుక్కలు

తయారుచేసే విధానం..

మొదట గ్లాసు డ్రాపర్ బాటిల్ తీసుకోవాలి. ఇందులో పైన చెప్పుకున్న పదార్థాలన్నీ వేయాలి. జొజోబా ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, రోజ్ షిప్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుశ్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషకాన్ని అందిస్తాయి. ఇక లావెండర్ ఆయిల్ చర్మాన్ని కాపాడుతుంది. చర్మం మీద వాపులు, అలర్జీలు, దురద  వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. చర్మానికి కొత్తదనాన్ని ఇస్తుంది.

గ్లాసు డ్రాపర్ బాటిల్ లో అన్ని వేసి బాగా కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీన్ని ఎండ తగలని ప్లేస్ లో పెట్టాలి. ప్రతిరోజు రాత్రి కొన్ని చుక్కల సీరమ్ ను ముఖానికి రాసి బాగా మసాజ్ చేసుకోవాలి. మొత్తం నూనె ముఖ చర్మంలోకి ఇంకేవరకు మసాజ్ చేసుకోవాలి. రాత్రి సమయంలో అయితే మరింత మంచి ఫలితం ఉంటుంది.

ప్రయోజనాలు..

ఈ సీరమ్ రాసుకోవడం వల్ల ముఖ చర్మం మీద మచ్చలు తగ్గుతాయి. ముఖంలో గ్లో వస్తుంది. ఇందులో వాడిన పదార్థాలు అన్నీ సహజమైనవే కాబట్టి  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అయినా సరే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకుని వాడటం మంచిది.

                                  *నిశ్శబ్ద.