ఇంట్లోనే మేకప్ రిమూవర్.. ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

 


మేకప్ ఇప్పటి అమ్మాయిలకు చాలా కామన్ విషయం.  పార్టీలు, ఫంక్షన్లలలో అందంగా కనిపించడం కోసం అమ్మాయిలు మేకప్ వేసుకుని అతిలోక సుందరులలాగా కనిపించాలని అనుకుంటారు.  ఒకప్పుడు బ్యూటీ పార్లర్ కు వెళితే తప్ప మేకప్ వేసుకునే వెలుసుబాటు ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. మేకప్ సామాగ్రి ఉంటే ఇంట్లోనే ఈజీగా మేకప్ వేసుకోవడం జరిగిపోతోంది.  అమ్మాయిలు కూడా దీనికి  తగిన మెళకువలు నేర్చేసుకుంటున్నారు. అయితే ఎంత మేకప్ వేసుకున్నా ఆ పార్టీ, ఫంక్షన్ లాంటివి అయిపోగానే మేకప్ రిమూవ్ చేయడం పరిపాటి. లేకపోతే చర్మం పాడైపోతుంది. చాలామంది బయట మార్కెట్లో మేకప్ రిమూవర్ లు కొనుగోలు చేసి వాడుతుంటారు. కానీ దానికి అంత డబ్బు పోసే బదులు ఇంట్లోనే ఈజీగా మేకప్ రిమూవర్ తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మేకప్  రిమూవర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ కింద చూసి తెలుసుకోండి మరి..

మేకప్ రిమూవర్ ఇంట్లోనే తయారు చేసుకునే వివిధ పద్దతులు..

కొబ్బరి నూనె.. అలొవెరా జెల్..

మేకప్ రిమూవర్ లేకపోతే దాని బదులు కొబ్బరినూనె,  అలొవెరా జెల్ వాడవచ్చు.  దీని కోసం ఒక స్పూన్ అలొవెరా జెల్,  ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి.  ఈ రెండింటిని ఒక చిన్న కంటైనర్ లో వేసి బాగా మిక్స్ చేయాలి.  కాటన్ తో ఈ మిశ్రమం తీసుకుని దీంతో మేకప్ రిమూవ్ చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.   మంచి ఫలితం ఉంటుంది.

పాలు.. రోజ్ వాటర్..

మిల్క్‌లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మేకప్ తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది, తేమను అందిస్తుంది. రోజ్ వాటర్ తాజాదనాన్ని ఇస్తుంది. ఈ రెండింటిని కలిపి  మిశ్రమాన్ని సిద్ధం చేసి మేకప్ రిమూవ్ చేయవచ్చు.  దీని కోసం 2 టీస్పూన్ల పచ్చి పాలలో 1 టీస్పూన్ రోజ్ వాటర్ కలపాలి. దీన్ని కాటన్ సహాయంతో ముఖానికి అప్లై చేసి మేకప్ తొలగించాలి. తరువాత ముఖం కడుక్కుని  మాయిశ్చరైజర్ రాయాలి.  

ఆలివ్ ఆయిల్, తేనె..

ఆలివ్ ఆయిల్ మేకప్‌ను సులభంగా కరిగించగలదు, తేనె చర్మానికి పోషణనిస్తుంది. 1 టీస్పూన్ తేనెను 1 టీస్పూన్ ఆలివ్ నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి  చేతులతో తేలికగా మసాజ్ చేయాలి. తడి కాటన్ ప్యాడ్ తో  ముఖాన్ని తుడిచి, ముఖం కడుక్కోవాలి.

దోసకాయ, కలబంద..

దోసకాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి,  కలబంద జెల్ మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.  సగం దోసకాయను బ్లెండ్ చేసి దానికి 1 టీస్పూన్ కలబంద జెల్ జోడించాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మెల్లగా తుడవాలి. తరువాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి.
 
బాదం నూనె, కలబంద..

బాదం నూనెలో విటమిన్ E ఉంటుంది, ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది.  కలబంద జెల్ చర్మాన్ని చల్లబరుస్తుంది. 1 టీస్పూన్ అలోవెరా జెల్‌ను 1 టీస్పూన్ బాదం నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ ప్యాడ్ తో ముఖంపై అప్లై చేయడం ద్వారా మేకప్ తొలగించవచ్చు.

                                  *రూపశ్రీ.