జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడే మూలికలు ఇవే..!
అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయినా జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. దీనికి తగినట్టే షాంపూల నుండి నూనెల వరకు చాలా రకాలు వాడుతూ ఉంటారు. అయితే.. మగాళ్ల కంటే ఈ జుట్టు సంరక్షణ, జుట్టు పెరుగుదల విషయంలో ఆడవాళ్లు కొంచెం ఎక్కువే కేర్ తీసుకుంటారు. జుట్టు పెరగడావికి ఎన్ని రకాల చిట్కాలు ట్రై చేసినా సరైన ఫలితాలు ఇవ్వకపోతే.. సరైన చిట్కా ఉపయోగించడం లేదని అర్థం. సాధారణంగా ఏదైనా చిట్కా ఒకరికి బాగా పని చేసింది అంటే మిగతా అందరూ ఆ చిట్కా ఫాలో అవ్వడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే అందరికీ అన్ని చిట్కాలు పనిచేయవు. అయితే జుట్టు వేగంగా పెరగడానికి కొన్ని మూలికలు బాగా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుంటే..
రోజ్మేరీ..
రోజ్మేరీ ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతోంది. రోజ్ మేరీ వాటర్, రోజ్ మేరీ ఎసెన్షియల్ ఆయిల్, రోజ్మేరీ లీవ్స్.. ఇలా రోజ్ మేరీ ఉత్పత్తులు చాలా బాగా పేమస్ అవుతున్నాయి. ఈ రోజ్మేరీ నిజంగానే జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. తలలో రక్త ప్రసరణను పెంచడం ద్వారా జుట్టు కుదుళ్లను యాక్టీవ్ చేస్తుంది. జుట్టు సన్నబడకుండా నివారిస్తుంది.
లావెండర్..
లావెండర్ ఆధారిత సోపులు, ఎయిర్ ఫ్రెషర్లు, సౌందర్య ఉత్పత్తులు చాలా ఉన్నాయి. అయితే లావెండర్ నూనె జుట్టు పెరుగుదలకు భలే సహాయపడుతుంది. అంతేకాదు లావెండర్ వాసన మానసిక ఒత్తిడిని తగ్గించి మనసు ప్రశాంతంగా ఉంచుతుంది.
పిప్పరమెంట్..
పిప్పరమెంట్ అనేది చాలా రకాల చాక్లెట్లు, చూయింగ్ గమ్ లు, మౌత్ ప్రషనర్లలో ఉపయోగించబడుతుంది. ఈ పిప్పరమెంట్ నూనెను తలకు ఉపయోగించడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. పిప్పరమెంట్ నూనెను సాధారణ కొబ్బరి నూనెలో వేసి దాన్ని తలకు మసాజ్ చేయాలి. ఇది కూలింగ్ సెన్సేషన్ కలిగి ఉంటుంది. ఇది తలను చల్లబరుస్తుంది.
మెంతుల నూనె..
ఒకప్పుడు కొబ్బరినూనెలో మెంతులు వేసి మరగబెట్టి ఆ నూనెను తలకు ఉపయోగించే వారు. అయితే ఇప్పుడు మెంతుల ఎసెన్షియల్ ఆయిల్ కూడా అందుబాటులో ఉంది. మెంతుల నూనెలో ప్రోటీన్, నికోటిన్ అధికంగా ఉంటుంది. ఇవి రెండూ జుట్టు పెరుగుదలకు చాలా మంచిగా పనిచేస్తాయి.
మందార..
మందారం పువ్వుల నూనె జుట్టు పెరుగుదలకు చాలా గొప్పగా సహాయపడుతుంది. దీన్ని మందార తైలం అని కూడా పిలుస్తారు. మందార పువ్వులలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తుంది. జుట్టు పెరగడంలో సహాయపడుతుంది.
భృంగరాజ్..
భృంగరాజ్ లేదా గుంటగరగం అనేది జుట్టు పెరుగులకు, జుట్టు నల్లగా ఉండటానికి సహాయపడే మ్యాజిక్ మూలిక. దీన్ని కేష్ కింగ్ అని కూడా అంటారు. భృంగరాజ్ పౌడర్ నూనె లేదా పొడిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
*రూపశ్రీ.
