దారుణమైన కండీషన్ లో ఉన్న జుట్టైనా సరే.. ఈ టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యంగా మారిపోతుంది..

అమ్మాయిలు జుట్టు గురించి తీసుకునే శ్రద్ద బహుశా ఆరోగ్యం గురించి కూడా తీసుకోరేమో. ఒత్తుగా, పొడవుగా, మెరుస్తూ ఉండే జుట్టంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. కానీ చాలా కారణాల వల్ల జుట్టు దెబ్బ తింటుంది. మెరుపును కోల్పోతుంది. విరిగిపోవడం, బూడిద రంగులోకి మారడం, చిట్లడం,  చుండ్రు వంటి సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. ఇవన్నీ జుట్టు స్వరూపాన్ని మార్చేస్తాయి. వీటి పరిష్కారం కోసం అందరూ ఎన్నో రకరకాల షాంపూలు, నూనెలు వాడుతుంటారు. అయితే ఎన్ని జుట్టు సమస్యలున్నా కింద చెప్పుకునే టిప్స్ పాటించడం వల్ల జుట్టు తిరిగి ఆరోగ్యంగా, అందంగా  మారుతుంది.

జుట్టురాలకుండా ఉండాలంటే..

జుట్టురాలే సమస్య ఉన్నవారు  జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి.  తలస్నానం చేయడానికి ముందు  జుట్టుకు నూనె రాయాలి. జుట్టుకు నూనె రాసిన తరువాత ఎక్కువసేపు ఉంచుకోకూడదు. కేవలం  10 నిమిషాలు మాత్రమే ఉంచుకుని ఆ తరువాత తలస్నానం చెయ్యాలి.  ప్రతి 8-10 వారాలకు ఒకసారి జుట్టు కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు ప్రోత్సాహకంగా ఉంటుంది.   వారానికి ఒకసారి తలస్నానానికి ముందు తాజా ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించాలి . ఇన్ని చేసినా జుట్టు రాలుతోంటే  వైద్యుడిని సంప్రదించడం మంచిది. కొన్నిసార్లు  ఆరోగ్య సమస్యల  కారణంగా జుట్టు రాలుతుంది. కాబట్టి వైద్యుడిని సంప్రదించం కూడా సరైనదే..

జుట్టు మెరుపు లేకుంటే..

ఫ్యాషన్ పేరుతో జుట్టుమీద ప్రయోగాలు చేసేవారు చాలామంది ఉన్నారు. అంతేకాదు  జుట్టును నిర్లక్ష్యం చేస్తే  జుట్టు మెరుపు కోల్పోతుంది. జుట్టుకు తరచుగా రసాయన చికిత్స చేయడం, హీట్ స్టైలింగ్ టూల్స్ వాడటం, ఇవి వాడుతూ  కండీషనర్‌ను అప్లై చేయకపోవడం వంటివి పొరపాట్లు జుట్టును నిర్జీవంగా మారుస్తాయి.  ఈ సమస్యకు మంచి పరిష్కారం ముందస్తు జాగ్రత్తలు.  హెయిర్ వాష్‌కు ముందు  జుట్టుకు పొడవునా నూనె రాయండి. వీలైతే, కనీసం నెలకు ఒకసారి హెయిర్ స్పా చికిత్సకు చేయించుకోవాలి. కుదరని పక్షంలో ఇంట్లోనే హాట్ ఆయిల్ మసాజ్, వేడి నీటిలో ముంచిన టవల్ తలకు చుట్టడం వంటివి ఫాలో కావాలి. జుట్టు మంచి కండీషన్లోకి వచ్చేవరకు జుట్టుకు వేడి, రసాయనాలు తగలకుండా జాగ్రత్త పడాలి.

చుండ్రును తొలగించాలంటే..

చుండ్రులో జిడ్డు, పొడి అనే రెండు రకాలు ఉన్నాయి.  జిడ్డుగల చుండ్రును ఎదుర్కొంటున్నట్లయితే, వైద్య సహాయం అవసరమవుతుంది.  నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సందర్శించడం ఉత్తమం.  పొడి చుండ్రుతో బాధపడుతుంటే  తలస్నానానికి   సాధారణ షాంపూతో పాటు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను వారానికి ఒకసారి ఉపయోగించాలి. చుండ్రు సమస్య ఉన్నప్పుడు  జుట్టును మరింత శుభ్రంగా ఉంచుకోవాలి.

జుట్టు నెరిసిపోవడాన్ని ఎలా అరికట్టాలంటే..

చిన్న వయస్సులోనే జుట్టు బూడిద రంగులోకి మారడం ప్రారంభిస్తే, రసాయన చికిత్సలను నివారించాలి. అదే వయసు పెరిగేకొద్ది  జుట్టు నెరిసిపోతుంటే దీనికి పరిష్కారంగా సహజమైన రంగులు లేదా గోరింటతో కవర్ చేయడం ఉత్తమ పరిష్కారం. ఎప్పుడూ మంచి బ్రాండ్ కలర్‌ను ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. ఇందులో రసాయనాలు లేకుండా చూసుకోవాలి.  ఇంట్లో జుట్టుకు రంగేస్తుంటే చాలా జాగ్రత్తగా వాడాలి.                                                 

 *నిశ్శబ్ద.