పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలంటే వారి చదువు ఎలా ఉండాలో తెలుసా?
 

చదువుకోరా గాడిదా అని చిన్నపిల్లలను  పెద్దలు ఒక్కసారి అయినా తిట్టే ఉంటారు, ఇప్పటి పెద్దలు కూడా తమ చిన్నతనంలో  తమ తల్లిదండ్రులతో తిట్టించుకునే ఉంటారు. చదువుకోవాల్సిన వయసులో దాని విలువ అర్థం కాలేదు, వయసైపోయిన తరువాత చదువు విలువ అర్థం అవుతుందని చాలామంది చెబుతారు. ఈ కారణంగానే  పెద్దలు తమ పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉంటుంటారు. కానీ పిల్లలు అందరూ ఒకేలా చదవరు, ఒక్కొక్కరు  ఒకోవిధంగా చదువుతుంటారు. చదువుతున్నప్పుడు పిల్లలు తరచూ ఒక అంశాన్ని పునరావృతం చేస్తూ  నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, దీనిని రోట్ లెర్నింగ్ అని తెలుగులో బట్టీ పట్టడం అని అంటారు. ఒకరి జ్ఞాపకశక్తి ఎంత మెరుగ్గా ఉంటే పరీక్షలో సమాధానాలు అంత బాగా వ్రాస్తారని, దాని ద్వారా వచ్చే  ఫలితం ఆధారంగా అతన్ని తెలివైన పిల్లవాడు అని పిలుస్తారు. అయితే లోతుగా ఆలోచిస్తే అలాంటి పిల్లలు నిజంగా తెలివైన వారా?  నిజంగా భవిష్యత్తులో  గొప్పగా మారుతార? అంటే ఖచ్చితమైన సమాధానం లేదు! పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే  పిల్లలు  ఏదైనా విషయాన్ని గుర్తుంచుకోవడంలో చాలా మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు.  కానీ  జీవితానికి సంబంధించిన నిజమైన జ్ఞానాన్ని కోల్పోతారని పరిశోధకులు కూడా చెబుతున్నారు.   వారు  తమ చదువును కూడా సరిగా వినియోగించుకోలేరు.

 విద్య అంటే నేర్చుకోవడం.  జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడానికి  పాఠశాల విద్య ఆధారమవుతుంది. అందువల్ల జీవితంలో సక్సెస్ కావడానికి ఏ విషయాన్ని అయినా లోతుగా అర్థం చేసుకోవడం కావాలి తప్ప విషయాన్ని గుర్తుంచుకోవడం కాదు కావాల్సింది. అంటే పిల్లలు ఏదైనా విషయాలను గుర్తుంచుకోవడం కంటే ఆ విషయాలను అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకోవడం వల్ల పిల్లల  జీవితం  అటు విద్యాపరంగానూ, ఇటు జీవితపరంగానూ  ఎదుగుతుంది.

గుర్తుంచుకోవడం కంటే విషయాలను అర్థం చేసుకోవడం ఎందుకు మంచిదంటే..

బట్టీ పట్టడం ద్వారా పిల్లలు  శబ్ద జ్ఞానాన్ని పొందుతారు అప్పుడు వారికి  పదాలు మాత్రమే మనస్సులో నిలిచిపోతాయి. పిల్లవాడు ఇలా చదివితే అతను  కంఠస్థం చేసిన పదాల సంఖ్యకు అతని అభివృద్ది  పరిమితమవుతుంది.  అదే ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే విషయ పరిజ్ఞానం పెరుగుతూ పోతుంది.

బట్టీ పట్టే ప్రక్రియ కారణంగా పిల్లల మానసిక ఎదుగుదల  సరిగా ఉండదు. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం అనేది ఒకరి మేధో సామర్థ్యాన్ని పెంచే విషయాలపై మంచి అవగాహనకు దారి తీస్తుంది.

బట్టీ పట్టడం వల్ల పిల్లలు అలసిపోతారు. పిల్లలు కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోకుండా విషయాలను కంఠస్థం చేసినప్పుడు  నీరసం వస్తుంది. మెదడు అలసిపోతుంది.

బట్టీ పట్టి చదివే పిల్లలు నిజ జీవితంలో ఏ విషయాన్ని ఒక పద్దతి ప్రకారం ఆచరించలేరు.  విషయాన్ని అర్థం చేసుకోవడం,  రాయడం ద్వారా పిల్లలు మరింత సమర్థవంతంగా ఉంటారు.  జీవితంలోని కష్ట సమయాల్లో కూడా  ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల వారి ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది.

జ్ఞాపకం అనేది స్వల్పకాలిక ప్రక్రియ. ఇది కొద్దికాలం మాత్రమే  ప్రభావవంతంగా ఉంటుంది. కొన్నిరోజుల తరువాత విషయాన్ని మరచిపోతారు. అందుకే పదే పదే రివిజన్ చేయాల్సి ఉంటుంది. అదే  విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత  దాన్ని రాయడం అలవాటు చేసుకుంటే అది చాలాకాలం పాటు గుర్తిండిపోతుంది.

అందుకే పెద్దలు పిల్లలకు విషయాన్ని అర్థం చేసుకుని చదివే దిశగా మార్గనిర్దేశం చేయాలి.  అవసరమైతే చిన్న చిన్న ఉదాహరణలు చెబుతుండాలి. ఎంతసేపు మార్కుల కోణంలో పిల్లలను సతాయించకుండా పిల్లల ఆలోచనా పరిధి ఏంటి అనే విషయాన్ని గుర్తించాలి.

                                                                 *నిశ్శబ్ద.