గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. ఇలా వాడితే  అందాన్ని  కూడా మెరిపిస్తుంది..
 

ఆరోగ్యం మీద స్పృహ ఉన్న చాలామంది  గ్రీన్ టీ తప్పకుండా తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ తాగితే కొలెస్ట్రాల్ అదుపులో ఉండటం నుండి, బరువు తగ్గడం వరకు, ఇమ్యునిటీ పెరగడం నుండి రోజంతా ఉల్లాసంగా ఉండటం వరకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గ్రీన్ టీని కేవలం ఆరోయానికే కాదు, అందాన్ని మెరిపించడానికి కూడా ఉపయోగించవచ్చు. మారుతున్న జీవనశైలి, వాతావరణ ప్రభావం, ఆహారపు అలవాట్లలో మార్పు, దుమ్ము, ధూళి కారణంగా చర్మం దెబ్బతింటుంది. దీన్ని తిరిగి మెరిసేలా చేయడానికి బ్యూటీ పార్లర్లలో బోలెడు డబ్బు పోస్తుంటారు. కానీ అవన్నీ వద్దండోయ్.. కేవలం  గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ లు చర్మాన్ని మెరిపిస్తాయి. గ్రీన్ టీ తో తయూరుచేసి వాడాల్సిన ఫేస్ ప్యాక్ లు ఏంటో ఓ లుక్కేస్తే..

ముల్తాని మట్టి, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్..

జిడ్డు చర్మం ఉన్నవారికి ముల్తానిమట్టి చాలా  ఉపయోగకరంగా ఉంటుంది. ఒక చెంచా ముల్తానీ మట్టికి 2 చెంచాల గ్రీన్ టీ వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మందంపాటి పొరగా ముఖం మీద అప్లై చేసి కనీసం 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది జిడ్డును తొలగించడమే కాదు మృదువుగా ఉంచుతుంది. ముఖ చర్మాన్ని మెరిపిస్తుంది.

ఆరెంజ్ పీల్, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్..

ఆరెంజ్ తొక్కలను  ముఖానికి ఉపయోగించడం ద్వారా చర్మం మెరుస్తుంది. ఇక దీనికి గ్రీన్ టీ కూడా జోడిస్తే రెట్టింపు ఫలితాలు పొందుతారు.  . తాజా నారింజ తొక్కలను అయినా ఉపయోగించవచ్చు. లేదా నారింజ తొక్కల పొడిని అయినా ఉపయోగించవచ్చు.  ఒక చెంచా గ్రీన్ టీలో ఒక చెంచా నారింజ తొక్క పొడి,  అర చెంచా తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను  ముఖం,  మెడపై  అప్లై చేయాలి. దీన్ని 15నిమిషాల పాటు అలాగే ఉంచాలి.  ఆరిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి.

నిమ్మ, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్..

నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఒక చెంచా గ్రీన్ టీ నీటిలో ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి కాటన్ సహాయంతో ముఖానికి అప్లై చేయాలి. దీన్ని అప్లై చేసే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. దాదాపు 10 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో కడగాలి. అంతే కేవలం మూడే మూడు ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం వల్ల పార్లర్ టైప్ మెరుపు సొంతమవుతుంది.

                                                        *నిశ్శబ్ద.