ఈ నాలుగు  పదార్థాల ముందు  బ్యూటీ పార్లర్ లో ఖరీదైన ఫేషియల్స్ కూడా పనికిరావు..

అమ్మాయిలకు చర్మ సంరక్షణ మీద ఆసక్తి ఎక్కవ. చాలా మంది చర్మ సంరక్షణ పేరుతో  దృష్టి అంతా ముఖ కాంతిని పెంచడంపైనే ఉంచుతారు.   ముఖంలో  మెరుపు కనిపిస్తూ ఉంటే చాలు తాము యవ్వనంగా ఉన్నామని అనుకుంటారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్ లో వందలాది రూపాయలు ఖర్చు చేస్తారు.  పండుగలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్లు, పార్టీలు చాలా చిన్న వేడుకలలో కూడా అమ్మాయిలు తమ అందాన్ని మెరిపించడానికి ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. బ్యూటీ పార్లర్లలో కాస్త ఖరీదైన ఫేషియల్ క్రీములు ఉపయోగించి వేలాది రూపాయలు  తీసుకుంటారు. వీటిని వాడటం వల్ల చర్మం మెరుపు వచ్చినా అది తాత్కాలికమే. కానీ బ్యూటీ పార్లర్ ఫేషియల్స్ ను తలదన్నే  పదార్దాలు చాలా సులువుగా, తక్కువ ధరకే  లభిస్తాయి. వీటిని ఉపయోగిస్తే ముఖం దగదగ మెరిసిపోతుంది.

పచ్చిపసుపు..

పచ్చిపసుపు ముఖానికి మెరుపు ఇవ్వడంలోనూ, ముఖం మీద మచ్చలు, మొటిమలు, మొటిమల తాలుకూ గుర్తులను తగ్గించడంలోనూ బాగా సహాయపడుతుంది. రెండు చెంచాల పచ్చిపసుపును ఒక చెంచా శనగపిండితో కలపాలి. దీంట్లో తగినంత రోజ్ వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత చేతులను కొద్దిగా తడి చేసి ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేయాలి. దీన్ని రెండు లేదా మూడు రోజులకు ఒకసారి వాడాలి. కేవలం మూడు సార్లు వాడటంతోనే ముఖం లో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీన్ని లైప్ స్టైల్ లో భాగం చేసుకుంటే ముఖానికి ఏ క్రీములు అక్కర్లేదు.

జాజికాయ..

చర్మంపై మచ్చలు మరియు మచ్చలను తొలగించడంలో జాజికాయ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. జాజికాయను గ్రైండ్ చేసి, దాని పొడిని తయారు చేసుకోవాలి. ఈ పొడికి  తేనెను కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మొత్తం ముఖం మీద లేదా మచ్చలు, మొటిమలు ఉన్న ప్రాంతంలో అయినా   చేయవచ్చు. దీన్ని రాత్రి ముఖానికి రాసుకుని అలాగే వదిలేయవచ్చు.  తెల్లారేసరికల్లా ముఖం మెరిసిపోతుంది. దీన్ని పాలో అవుతుంటే అసలు ముఖానికి ఏ ఇతర ఉత్పత్తులు వాడక్కర్లేదు.

చందనం..

చందనం చలువ చేస్తుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు తగ్గిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. రెండు చెంచాల గంధపు పొడికి రోజ్ వాటర్ వేసి కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి.  దీన్ని ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తరువాత తడి చేత్తో సున్నితంగా స్ర్కబ్ చేస్తూ కడిగేసుకోవాలి. దీని వల్ల టానింగ్ సమస్య తొలగిపోయి గ్లో పెరుగుతుంది.

దాల్చిన చెక్క..

వంటల్లోకే కాదు ముఖ సౌందర్యంలోనూ దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కను  మిక్సీలో వేసి  పొడి చేసుకోవాలి. అందులో పండిన అరటిపండు వేసి బాగా  కలపాలి. దీన్ని మెత్తని గుజ్జులా తయారుచేసుకోవాలి. ఇందులో ఒక చెంచా తేనె కలపాలి. దీన్ని ముఖానికి పట్టించాలి.  ఆరిన తరువాత శుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి. ఇది చర్మం మెరుపును మెరుగుపరుస్తుంది. ముఖాన్ని మృదువుగా మారుస్తుంది.

                                                          *నిశ్శబ్ద.